- భారతీయ కుర్రాడి ఏఐ కోడింగ్ సంచలనం
- అమన్ అద్భుతం… స్పేస్ఎక్స్తో ఒప్పందం
సహనం వందే, హైదరాబాద్:
సాంకేతిక ప్రపంచం ఇప్పుడు ఒక 25 ఏళ్ల యువ మేధావి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఎలాన్ మస్క్ సామ్రాజ్యం స్పేస్ఎక్స్ సంస్థ ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల భారీ డీల్‌తో ఒక భారతీయ మూలాలున్న యువకుడిని సొంతం చేసుకుంది. అమన్ సంగర్ సృష్టించిన కర్సర్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అంతర్జాతీయ టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి అసాధారణమైన రీతిలో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్పేస్ఎక్స్ భారీ ఒప్పందం
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ సంస్థ కర్సర్ అనే ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం స్పేస్ఎక్స్ 5 లక్షల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చిస్తోంది. అమన్ సంగర్ స్థాపించిన మాతృ సంస్థ ఎనీస్ఫియర్ ఇంక్ పూర్తిగా స్పేస్ఎక్స్లో విలీనం కానుంది. 2026 మూడో త్రైమాసికం నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తికానుంది. ఈ మేరకు గురువారం స్పేస్ఎక్స్ అధికారికంగా ప్రకటించింది.

కోడింగ్ ప్రపంచంలో కొత్త శకం
సాధారణ కోడింగ్ ప్లాట్‌ఫామ్స్ కేవలం అక్షరాలను సూచించే ఆటోకంప్లీట్ టూల్స్‌గా పనిచేస్తాయి. కానీ కర్సర్ ప్లాట్‌ఫామ్ మాత్రం పూర్తి కోడ్‌బేస్‌ను విశ్లేషించి తెలివైన సూచనలను అందిస్తోంది. ఇది ప్రోగ్రామర్లకు గూగుల్ డాక్స్ వంటిదని దీని వ్యవస్థాపకులు చెబుతుంటారు. ప్రస్తుతం 50 వేల బృందాలు దీన్ని వాడుతున్నాయి. ఫార్చ్యూన్ 500 సంస్థల్లో 64 శాతం కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నాయి. ఇక్కడ రోజుకు 10 కోట్ల లైన్ల కోడింగ్ జరుగుతోంది.
అద్భుతమైన సాంకేతికత
కర్సర్ మీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌లోని అన్ని ఫైళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తుంది. ఒక కొత్త ఫీచర్ కావాలని అడిగితే పాత కోడ్‌లో ఎక్కడ మార్పులు చేయాలో అదే వెతికి పెడుతుంది. మీరు పది ఫైళ్లు తెరిచి వెతకాల్సిన అవసరం లేదు. కర్సరే అన్ని ఫైళ్లను విశ్లేషించి మీకు కావాల్సిన కోడ్‌ను సిద్ధం చేస్తుంది. గూగుల్ డాక్స్‌లో మనం రాసేటప్పుడు వాక్యాలను ఎలా అర్థం చేసుకుంటుందో కర్సర్ కూడా కోడ్‌ను అలాగే అర్థం చేసుకుంటుంది. ఇది కోడ్ రాయడమే కాకుండా అది ఎలా పనిచేస్తుందో వివరించగలదు.
రాకెట్ సైన్స్‌కు కీలకం
స్పేస్ఎక్స్ వంటి సంస్థలు రాకెట్ ప్రయోగాల కోసం క్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతాయి. లక్షల లైన్ల కోడ్ ఉన్న ప్రాజెక్టులలో ఒక చిన్న తప్పు జరిగినా భారీ నష్టం జరుగుతుంది. కర్సర్ పూర్తి కోడ్‌బేస్‌ను విశ్లేషించి తప్పులను ముందే గుర్తిస్తుంది. వేగంగా కొత్త ఫీచర్లను అభివృద్ధి చేయడానికి ఇది స్పేస్ఎక్స్కు ఒక ఆయుధంగా మారుతుంది. మస్క్ ఈ సామర్థ్యాన్ని గుర్తించే 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ సంస్థను కొనుగోలు చేశారు. ఎన్విడియా, అడోబ్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఇంజనీర్ల పనివేగాన్ని రెట్టింపు చేయడానికి కర్సర్‌ను వాడుతున్నాయి.
అమన్ సంగర్ ప్రస్థానం
న్యూయార్క్‌లో పెరిగిన అమన్ సంగర్ కుటుంబానికి భారతదేశంతో విడదీయలేని బంధం ఉంది. ఆయన తండ్రి అరవింద్ సంగర్ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి. తల్లి శిల్పా సంగర్ పారిశ్రామికవేత్తగా సేవలందిస్తున్నారు. 14 ఏళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించిన అమన్ ఎంఐటీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అక్కడ మైఖేల్ ట్రుయెల్, సుఅలె అసిఫ్, ఆర్విడ్ లున్నెమార్క్లతో కలిసి కర్సర్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్, గూగుల్ సంస్థల్లో పనిచేశారు. 2022లో తన స్నేహితులతో కలిసి ఎనీస్ఫియర్ ఇంక్‌ను స్థాపించారు. మొదట్లో మెకానికల్ ఇంజినీరింగ్ టూల్స్ కోసం ఏఐ రూపొందించి విఫలమయ్యారు. కానీ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
పెట్టుబడులు… భవిష్యత్తు
కర్సర్ సంస్థ గత నవంబర్‌లో 2.93 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది. యాక్సెల్, కోట్యూ నేతృత్వంలో జరిగిన ఫండింగ్ రౌండ్లో 23 వేల కోట్ల రూపాయలను ఆ సంస్థ సమీకరించింది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఆదాయం ఒక లక్ష కోట్ల రూపాయలు దాటింది. టెక్ ప్రపంచంలో వైబ్ కోడింగ్ అనే పదానికి ప్రాచుర్యం కల్పించడంలో కర్సర్ కీలక పాత్ర పోషించింది. కాలిన్స్ డిక్షనరీ 2025లో దీన్ని ప్రత్యేక పదంగా పేర్కొంది. ఏఐ రంగంలో భారతీయ మేధావుల ఆధిపత్యానికి ఇది నిదర్శనమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.