- ద్రవిడ గడ్డపై కొత్త రగడ…నార్త్ కూలీలే టార్గెట్
- నేరాల చుట్టూ రాజకీయం..ఎత్తుగడలు షురూ
సహనం వందే, తమిళనాడు:
తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం మొదలైంది. నిన్నటివరకు ద్రవిడ పార్టీల ఉత్తరాది వ్యతిరేకతను తప్పుపట్టిన బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై.. ఇప్పుడు అదే ఉత్తరాది వలస కూలీల నేరాలపై తిరుగుబావుటా ఎగురవేస్తూ సరికొత్త పొలిటికల్ యుద్ధం ప్రకటించారు.
ఉత్తరాదిపై అన్నామలై సరికొత్త పోరు
తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం, భాషా సెంటిమెంట్ల చుట్టూనే ఎప్పుడూ రాజకీయం తిరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీని వీడిన తర్వాత కె.అన్నామలై పాత రాజకీయ మూసను పూర్తిగా మార్చేస్తూ ఉత్తరాదికి వ్యతిరేకంగా సరికొత్త పోరాటానికి తెరలేపారు. గతంలో ద్రవిడ పార్టీలు చేసిన హిందీ వ్యతిరేక రాజకీయం కాకుండా… ఈసారి వలస కార్మికుల నేరాలను అడ్డుపెట్టుకుని ఉత్తరాది శక్తులపై ఆయన నేరుగా దాడి ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది.

సంచలనం రేపిన నేరాల వివాదం
రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు ఘోరమైన నేరాలు తమిళనాడును తీవ్రంగా కుదిపేశాయి. ఒక మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరగడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అలాగే ఒక 10 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ రెండు కేసుల్లోనూ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఉత్తరాదికి చెందిన వలస కార్మికులే కావడం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసింది.
వలస కూలీలపై పెరిగిన నిఘా
ఈ తీవ్రమైన నేరాల నేపథ్యంలో అన్నామలై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న తీవ్రమైన నేరాల్లో ఉత్తరాది వలస కార్మికుల ప్రమేయం ఎక్కువగా పెరుగుతోందని ఆయన బహిరంగంగా విమర్శించారు. మైనర్లపై జరుగుతున్న నేరాలను ప్రస్తావిస్తూ ఆయన పదేపదే ఉత్తరాది వలస కార్మికుల గురించి మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. పెరుగుతున్న ఈ నేరాలను అడ్డుకోవడానికి తక్షణమే పరిపాలనాపరమైన జోక్యం అవసరమని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
ద్రవిడ కోటలో వ్యూహాత్మక మార్పు
తమిళనాడు పొలిటికల్ స్క్రీన్‌పై ద్రవిడ పార్టీలు ఆరు దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఉత్తరాది వ్యతిరేకతతోనే బలమైన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. ఆ పాత ద్రవిడ కోటను బద్దలు కొట్టడానికి అన్నామలై ఇప్పుడు వలస కార్మికుల భద్రతా కోణాన్ని ఎంచుకున్నారు. ఉత్తరాది కార్మికుల వల్ల ఇక్కడి ప్రజలకు రక్షణ కరువైందనే కొత్త సెంటిమెంట్‌ను ఆయన బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. వలస కూలీల నియంత్రణకు గట్టి యంత్రాంగం అవసరమని చెప్తున్నారు.
ఉత్తరాది వర్సెస్ దక్షిణాది
ద్రవిడ పార్టీలు గతంలో నడిపిన ఉత్తరాది వ్యతిరేక వాదనకు అన్నామలై చేస్తున్న తాజా డిమాండ్లకు చాలా తేడా ఉంది. గతంలో ఇది కేవలం హిందీ భాష, సంస్కృతి వ్యతిరేకత చుట్టూనే సాగింది. కానీ అన్నామలై ఇప్పుడు దానిని శాంతిభద్రతలు, నేరాల ఆధారిత వలస కార్మికుల సమస్యగా మార్చారు. తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ కొత్త ఉత్తరాది వర్సెస్ దక్షిణాది చర్చ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కాలణమవుతుందో చూడాలి.