పండు తిన్నారు… పాడెక్కారు! – అనంత లోకాలకు చేరిన అక్కాచెల్లెళ్ల కథ

Mangoes incident in Narayanguda
  • కమ్మని మామిడి కొన్నారు… కడతేరి పోయారు
  • హైదరాబాద్ నారాయణగూడలో ఘోరం
  • పుచ్చకాయ తిని ముంబైలో నలుగురు మృతి
  • ప్రమాదకర రసాయనాలే కారణమని నిర్ధారణ
  • మామిడి పండ్లను నిషేధించిన జపాన్, నేపాల్
  • భారతీయ పండ్లలో కెమికల్ మంటలు
  • పండ్లు కొనాలంటేనే వణికిపోతున్న జనం!

సహనం వందే, హైదరాబాద్:

ప్రతి సీజన్‌లో వచ్చే పండ్లు తింటే ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతుంటారు. కానీ నేడు మనం అమృతం అనుకుని తింటున్న పండ్లే ప్రాణాలు తీసే విషంగా మారుతున్నాయి. లాభాల కోసం వ్యాపారులు వాడుతున్న రసాయనాలు పండ్లను గుండెలపై బండలుగా మారుస్తున్నాయి. హైదరాబాద్ నుండి జపాన్, నేపాల్ వరకు ఈ రసాయన ముప్పు ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

నారాయణగూడ నరకం
హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివసించే భువనేశ్వరి, సంధ్య అనే అక్కాచెల్లెళ్లు అందరూ ఇష్టపడే మామిడిపండ్లను తిన్నారు. ఆ పండ్లు తిన్న తర్వాత వారు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోవడం అందరినీ కలచివేసింది. కర్ణాటక బీదర్ నుంచి వలస వచ్చిన ఒక పేద కుటుంబంలో ఈ ఘటన కోలుకోలేని విషాదాన్ని నింపింది. పండ్లు పండించడానికి వాడే ప్రమాదకరమైన రసాయనాలు దీనికి కారణమా లేక మరేదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా అనే కోణంలో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పండ్లలో విష రసాయనాలు వాడుతున్నారనే ప్రచారం ఇప్పుడు జనంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.

Narayanguda Mangoes Incident

ముంబైలో పుచ్చకాయ తిని నలుగురు మృతి
సరిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 25న మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే మార్గ్ ఏరియాలో ఇటువంటి ఘటనే జరిగింది. అక్కడ ఉండే అబ్దుల్లా డొకాడియా కుటుంబం ఓ పార్టీ నిర్వహించింది. పార్టీ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అబ్దుల్లా, ఆయన భార్య నస్రీన్, వారి కూతుళ్లు అయేషా, జైనెబ్ బిర్యానీ తిని, ఆ తర్వాత వాటర్ మిలన్ తిన్నారు. కొన్ని గంటల్లోపే వారికి తీవ్ర విరేచనాలు, వాంతులు ప్రారంభమవడంతో జేజే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ చికిత్స పొందుతూ ఆ నలుగురూ మరణించారు. ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు.

మార్ఫైన్ మర్మం
ముంబై ఘటనలో ఫోరెన్సిక్ నిపుణులు నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుడు అబ్దుల్లా శరీరంలో మార్ఫైన్ అనే ప్రమాదకర రసాయనాన్ని నిపుణులు గుర్తించారు. శరీరంలో అనేక అవయవాలు రంగు మారాయంటే ఏదో విష పదార్థం శరీరం అంతా వ్యాపించి ఉంటుందని వారు అనుమానించారు. బాధితుల మెదడు, గుండె, ఇతర అవయవాలు అన్నీ ఆకుపచ్చ రంగులోకి మారిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. అయితే వారు తిన్న వాటర్ మిలన్ ఎక్కడ నుండి తీసుకొచ్చారు అనే విషయంలో అధికారులకు స్పష్టత రాలేదు. ఈ ఘటన తర్వాత ముంబైలో వాటర్ మిలన్‌ అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి.

జపాన్, నేపాల్ నిషేధం…
భారతీయ పండ్లలోని రసాయనాలు, క్వారంటైన్ లోపాలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. జపాన్ క్వారంటైన్ అధికారులు భారతీయ మామిడి ఎగుమతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యూమిగేషన్, క్రిమిసంహారక చర్యలలో భారీ లోపాలను వారు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని రెహ్మాన్‌పూర్‌లో ఉన్న వాపరు హీట్ ట్రీట్‌మెంట్ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు ఈ గందరగోళం బయటపడింది. ఏటా ఎగుమతులకు ముందు జరిపే ఈ తనిఖీలలో ఈసారి పకడ్బందీ నిబంధనలు పాటించలేదని జపాన్ నిర్ధారించింది. నాణ్యత మెరుగుపడే వరకు భారత్ నుండి ఏ ఒక్క మామిడి పండును స్వీకరించబోమని యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. అంతెందుకు ఇండియా మీద ఆధారపడే నేపాల్ వంటి చిన్న దేశం కూడా అధిక స్థాయిలో రసాయన పురుగుమందులు ఉన్నాయని భారత మామిడి దిగుమతులను నిషేధించింది. అంటే మన మామిడి పండ్లు కనీసం నేపాల్ వంటి చిన్న దేశానికి కూడా ఎగుమతి చేసే అర్హత కూడా లేకుండా పోయిందా?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *