అదానీకి క్లీన్ చిట్… ట్రంప్ స్వీట్ గిఫ్ట్! – అమెరికాలో భారత బిలియనీర్‌ కేసు రద్దు

Trump Adani
  • ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ లాయర్ మంత్రాంగం
  • కేసులు ఎత్తివేస్తే 83 వేల కోట్ల పెట్టుబడులు
  • ఈ భారీ ఆఫర్ తో కేసు క్లోజ్ చేసిన అమెరికా
  • నష్టపోయిన ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటనేది ప్రశ్న

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా పెట్టుబడిదారులను వంచించారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీకి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఊహించని ఊరటనిచ్చింది. బైడెన్ హయాంలో నమోదైన అవినీతి, మోసం కేసులను పూర్తిగా ఎత్తివేయాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అపర కుబేరుడి భారీ పెట్టుబడుల వాగ్దానమే ఈ యూటర్న్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.

అదానీ వ్యూహం.. అద్భుత మలుపు
బైడెన్ పాలన ముగిసే దశలో అదానీపై బ్రూక్లిన్ ప్రాసిక్యూటర్లు తీవ్రమైన అభియోగాలు మోపారు. అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అదానీ అత్యంత శక్తివంతమైన లాయర్లను రంగంలోకి దింపారు. ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రాబర్ట్ జె. గియుఫ్రా జూనియర్ నేతృత్వంలోని బృందం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దింది. ఈ నియామకంతోనే కేసు దిశ మారిపోయింది.

Gotham Adani

వాషింగ్టన్ భేటీ… రహస్య మంత్రాంగం
గత నెలలో వాషింగ్టన్ లోని న్యాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరిగింది. గియుఫ్రా ప్రాసిక్యూటర్ల ముందు వంద స్లైడ్లతో కూడిన భారీ ప్రజంటేషన్ ఇచ్చారు. అదానీపై ఉన్న అభియోగాల్లో కనీస ఆధారాలు లేవని ఆయన వాదించారు. ఈ కేసును విచారించే అధికార పరిధి అమెరికాకు లేదని స్పష్టం చేశారు. ఈ రహస్య భేటీ వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారాయి.

అదానీ భారీ ఆఫర్…
ఈ స్లైడ్లలో ఒక అంశం అధికారులను విశేషంగా ఆకర్షించింది. తనపై ఉన్న కేసులు ఎత్తివేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థలో 83,000 కోట్ల రూపాయలు అంటే 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని అదానీ ఆఫర్ ఇచ్చారు. దీనివల్ల అమెరికాలో 15,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు. ట్రంప్ ఎన్నికైన తర్వాత చేసిన వాగ్దానానికి ఇది కొనసాగింపుగా కనిపిస్తోంది.

న్యాయశాఖ స్పందన…
పెట్టుబడుల ప్రతిపాదనకు, కేసు ఎత్తివేతకు సంబంధం లేదని అధికారులు పైకి చెబుతున్నా వాస్తవం వేరేలా ఉంది. అదానీ ఇచ్చిన ఆఫర్ పట్ల ఒక సీనియర్ న్యాయశాఖ అధికారి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో బ్రూక్లిన్ ప్రాసిక్యూటర్లు నమోదు చేసిన అవినీతి అభియోగాల నుంచి ఆయనకు విముక్తి లభించనుంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల కంటే ఆర్థిక లబ్ధికే పెద్దపీట వేశారనే విమర్శలు వస్తున్నాయి.

రాజకీయ ప్రకంపనలు.. విమర్శల వెల్లువ
అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసిన ఈ నిర్ణయంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. గతంలో ఇదే కేసును వివరించినప్పుడు ఇది ఒక ఎలబొరేట్ బ్రైబరీ స్కీమ్ అని ప్రాసిక్యూటర్లు అభివర్ణించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆధారాలు లేవని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం తన న్యాయ విలువల కంటే వ్యాపార ఒప్పందాలకే ప్రాధాన్యం ఇచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది.

బిలియనీర్ గెలుపు.. ఇన్వెస్టర్ల నష్టం
ఈ పరిణామంతో అదానీ గ్రూప్ ఊపిరి పీల్చుకుంది. ఫెడరల్ ఛార్జీల నుంచి బయటపడటం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి పెద్ద విజయం. అయితే అమెరికా మార్కెట్లలో నిధులు పెట్టిన సామాన్య ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది. న్యాయ శాఖ అధికారికంగా కేసు విరమించుకుంటే ఇది కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ముగింపుగా నిలిచిపోనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *