- క్రిస్టియన్ ఓటు బ్యాంకు మంత్రం
- దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి పయనం
- దమ్మున్న నేతల ధైర్యపు అడుగులు
- కష్టాల్లోనూ తగ్గని ఇద్దరు నేతల తీరు
- ద్రవిడ గడ్డపై విజయ్ సరికొత్త రాజకీయం
సహనం వందే, అమరావతి/చెన్నై:
రాజకీయ తెరపై ఇద్దరు యోధులు ఉప్పెనలా దూసుకొచ్చారు. సరిహద్దులు వేరైనా వారి ఆలోచనలు ఒక్కటే. మతం నేపథ్యం నుంచి మొదలుకొని అధికారం దక్కించుకునే వరకు వీరిద్దరి ప్రయాణం ఆసక్తికరం. ఆధిపత్య రాజకీయాలను తలకిందులు చేస్తూ ప్రజల మనిషిగా ఎదిగిన ఈ జగన్, విజయ్ నాయకుల అంతరంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
క్రైస్తవ నేపథ్యం బంధం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక క్రైస్తవుడు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా అదే మతానికి చెందినవారు. వీరిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. ఎన్నికల కంటే ముందే తమిళనాడులో జరిగిన ఒక పెళ్లి వేడుక వీరిని దగ్గర చేసింది. ఆ శుభకార్యం కేవలం విందుకు మాత్రమే పరిమితం కాలేదు. అక్కడ జరిగిన రాజకీయ చర్చలే నేడు ఫలితాల రూపంలో కనిపిస్తున్నాయి. మతపరమైన ఓటు బ్యాంకును ఆకర్షించడంలో విజయ్ తనదైన ముద్ర వేశారు. ఈ వ్యూహాల వెనుక జగన్ సలహాలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. క్రైస్తవ వర్గాలను ఐక్యం చేయడంలో వీరిద్దరి ఆలోచనలు ఒకేలా సాగాయి.

సారూప్యత కలిగిన మనస్తత్వాలు
విజయ్, జగన్ ఇద్దరూ పట్టువదలని విక్రమార్కులు. ప్రజల్లోకి వెళ్లే విషయంలో వీరిద్దరూ సరికొత్త రికార్డులు సృష్టించారు. పాదయాత్రలు లేదా భారీ బహిరంగ సభల ద్వారా సామాన్యుడికి చేరువయ్యారు. అధికార వర్గాల నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వీరు అస్సలు భయపడలేదు. జగన్ మీద గతంలో ఎన్నో కేసులు పెట్టారు. జైలుకు పంపించి రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు. అటు విజయ్ కూడా ఎన్నో విమర్శలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడటమే వీరిని ఈ స్థాయికి చేర్చింది. వారి ధైర్యం ప్రజల్లో ఒక గొప్ప భరోసాను కల్పించింది.
పొత్తులకు ససేమిరా…
రాజకీయాల్లో పొత్తులు పెట్టుకుని గెలవడం సాధారణం. కానీ జగన్ తన ప్రయాణాన్ని ఒంటరిగానే మొదలుపెట్టారు. గతంలో వామపక్ష పార్టీలు, మరికొన్ని శక్తులు జగన్‌తో చేతులు కలిపేందుకు ప్రయత్నించాయి. కానీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని జగన్ గట్టిగా నిశ్చయించుకున్నారు. సరిగ్గా ఇదే పంథాను విజయ్ అనుసరించారు. తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు విజయ్‌తో పొత్తు కోసం పడరాని పాట్లు పడ్డాయి. అయితే ఆయన ఏ పార్టీతోనూ రాజీ పడలేదు. సొంత బలం మీద నమ్మకంతోనే బరిలోకి దిగి తాను ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్నికల ప్రచారం అంటే విమర్శలు, తిట్లు అనే స్థాయికి పడిపోయింది. కానీ విజయ్ తన ప్రచారాన్ని చాలా మర్యాదగా నిర్వహించారు. ప్రత్యర్థులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయకుండా కేవలం అభివృద్ధి, మార్పు గురించి మాట్లాడారు. జగన్ కూడా తన హయాంలో సంక్షేమ పథకాలను వివరించారు. నిశ్శబ్ద విప్లవంతో కోట్లాది మంది మనసులను గెలవడం వీరి ప్రత్యేకత.
ఒంటరి పోరుతో పీఠం…
మొదటి సారి ముఖ్యమంత్రులు అయిన తీరు ఇద్దరిది ఒకే రకం. ప్రాంతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీల చక్రబంధాన్ని వీరు విజయవంతంగా ఛేదించారు. జగన్ పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే 151 సీట్లతో ప్రభంజనం సృష్టించారు. అటు విజయ్ కూడా తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. ఎవరి అండ లేకుండా.. కేవలం ప్రజల అండతోనే సింహాసనాన్ని అధిష్టించారు. రాజకీయ విశ్లేషకులు కూడా వీరి సాహసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అగ్రనేతల అంచనాలను తలకిందులు చేస్తూ.. రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఘనత వీరిద్దరికే దక్కుతుంది.
కొత్త నాయకత్వ లక్షణాలు
ప్రస్తుత రాజకీయాల్లో విజయ్, జగన్ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. క్రైస్తవ వర్గాలతో పాటు యువత, అట్టడుగు వర్గాలను ఏకం చేయడంలో వీరిద్దరూ ఆరితేరారు. ఎంత కష్టం వచ్చినా ఎదురు నిలబడాలనే వీరి తత్వం భావి తరాలకు పాఠం లాంటిది. ప్రాంతాలు వేరైనా… భాషలు వేరైనా వీరిద్దరి మధ్య ఉన్న పోలికలు రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకంగా నిలిచిపోతాయి.