- ప్రతి రెండు రివ్యూలలో ఒకటి అబద్ధం
- నాణ్యత లేకున్నా రేటింగ్లే రాజ్యం
- తిమ్మినిబమ్మిని చేస్తున్న టెక్ దిగ్గజాలు
- ఫైవ్ స్టార్ కోసం డిస్కౌంట్ డ్రామా
సహనం వందే, హైదరాబాద్:
ఆన్‌లైన్ మార్కెట్ ఇప్పుడు నమ్మకద్రోహానికి అడ్డాగా మారింది. మనం నమ్మి కొనే వస్తువు వెనుక ఉన్న 5 స్టార్ రేటింగ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ రాసిన స్క్రిప్ట్ కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని శాసిస్తున్న ఈ నకిలీ రివ్యూల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బ్రిటన్ తాజా విచారణ బయటపెట్టింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసం కూడా అంతే వేగంగా అప్డేట్ అవుతోంది.
నమ్మకానికి పాతర
బ్రిటన్ పోటీ, మార్కెట్ల అధికార సంస్థ సీఎంఏ ఇప్పుడు ఐదు ప్రముఖ సంస్థలపై ఉక్కుపాదం మోపింది. జస్ట్ ఈట్ వంటి ఫుడ్ డెలివరీ యాప్ నుండి ఆటోట్రేడర్ వంటి కార్ల సైట్ వరకు అన్నీ విచారణను ఎదుర్కొంటున్నాయి. ఫీఫో, పాస్తా ఎవాంజెలిస్ట్స్ వంటి సంస్థలు తమ రేటింగ్‌లను ఎలా మేనేజ్ చేస్తున్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు. అంత్యక్రియల సేవలను అందించే డిగ్నిటీ సంస్థ కూడా తన సిబ్బందితోనే మంచి రివ్యూలు రాయించుకోవడం ఈ మోసం ఎంత దిగజారిందో చూపిస్తోంది.

గణాంకాల వెనుక గూడుపుఠాణి
ట్రూత్ ఇంజిన్ అనే పరిశోధనా సంస్థ ఇచ్చిన డేటా ప్రకారం ఆన్‌లైన్ రివ్యూలలో దాదాపు 50 శాతం నకిలీవే ఉంటున్నాయి. అంటే మనం చదివే ప్రతి రెండు రివ్యూలలో ఒకటి అబద్ధం. ఇది కేవలం ఒక దేశానికే పరిమితం కాలేదు. 2024లో కొన్ని చిన్న రెస్టారెంట్లను సైబర్ నేరగాళ్లు బ్లాక్‌మెయిల్ చేయడం కొత్త తరహా మాఫియాకు నిదర్శనం. వేల రూపాయలు ఇస్తేనే నెగటివ్ రివ్యూలు ఆపుతామని బెదిరించడం ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారింది. ఇది మార్కెట్ పారదర్శకతను నిలువునా గొంతు కోస్తోంది.
టెక్ దిగ్గజాల మౌనం
కేవలం ఈ ఐదు కంపెనీలే కాదు అమెజాన్, గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్స్ మీద కూడా గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 2025 జనవరిలో ఈ కంపెనీలు తమ పద్ధతులు మారుస్తామని మాట ఇచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. కృత్రిమ మేధస్సు సాయంతో రాయించిన అత్యంత మెరుగుపెట్టిన రివ్యూలు సామాన్యుడిని తప్పుదారి పట్టిస్తున్నాయి. వినియోగదారుల హక్కుల విభాగం హెడ్ సూ డేవిస్ చెబుతున్నట్లుగా కేవలం విచారణలు సరిపోవు. భారీ జరిమానాలు విధిస్తేనే ఈ దోపిడీ ఆగుతుంది.
ఆశ చూపి మోసం
పాస్తా ఎవాంజెలిస్ట్స్ వంటి సంస్థలు ఇచ్చే ఆఫర్లు మరో రకమైన మోసం. 5 స్టార్ రేటింగ్ ఇస్తే భవిష్యత్తు ఆర్డర్లలో భారీగా తగ్గింపు ఇస్తామని కస్టమర్లను లోబర్చుకోవడం ఒక అనైతిక చర్య. దీనివల్ల వస్తువు నాణ్యతతో సంబంధం లేకుండా రేటింగ్ పెరిగిపోతుంది. ఆటోట్రేడర్, ఫీఫో వంటి ప్లాట్‌ఫారమ్‌లు చెడు రివ్యూలను అసలు బయటకు రానివ్వకుండా తొలగించడం ద్వారా వినియోగదారులకు ఒకే వైపు చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఇది కొనేవాడి నిర్ణయాధికారాన్ని దెబ్బతీస్తోంది. సామాన్యుడిని ఇలాంటి తప్పుడు రేటింగ్‌లతో ముంచడం క్షమించరాని నేరం.
మాయలో పడకండి
నియంత్రణ సంస్థలు ఇస్తున్న సలహా ప్రకారం మరీ అద్భుతంగా ఉన్న రివ్యూలను అనుమానించాలి. ఒక వ్యక్తి కేవలం డెలివరీ లేట్ అయిందనో లేక ప్యాకింగ్ బాగోలేదనో ఒక స్టార్ తగ్గిస్తే అది అసలైన రివ్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 3 లేదా 4 స్టార్ రేటింగ్ ఉన్న వాటిని చదివితేనే నిజం తెలుస్తుంది. ఏ ఒక్క వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మకుండా కనీసం రెండు మూడు చోట్ల చెక్ చేసుకోవాలి. టెక్నాలజీ మాటున సాగుతున్న ఈ అబద్ధాల వేటలో వినియోగదారుడే అప్రమత్తంగా ఉండాలి.