- ఎన్నికల బరిలో ఒంటరి వ్యూహం
- మారుతున్న రాజకీయ సమీకరణాలు
- డీఎంకే వర్సెస్ ఏఐఏడీఎంకే
సహనం వందే, తమిళనాడు:
తమిళనాడు రాజకీయ యవనికపై యువ దళపతి అడుగుపెట్టారు. సినీ గ్లామర్ అండతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగంతో గెలుపుపై కన్నేశారు. పాత పార్టీలకు దీటుగా తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఈ సినీ హీరో సృష్టించబోయే సంచలనంపై అందరి చూపు నిలిచింది.

సినిమా వర్సెస్ రాజకీయాలు
తమిళనాడులో సినిమాకు రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పుడు ఆ బాటలోనే విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో ఏఐఏడీఎంకే కూటమి, డీఎంకే కూటమి బరిలో ఉన్నాయి. వీటితో పాటు విజయ్ ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కచ్చి పార్టీ కూడా రేసులో ఉంది.
సింగం సింగిల్‌గానే
విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని సినిమాల తరహాలోనే తీర్చిదిద్దుకుంటున్నారు. సింగం సింగిల్‌గా వస్తుందనే ఆయన నినాదం రాజకీయంగా కీలకమైంది. ఏ పార్టీతో కలవకుండా తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఆయనకున్న విపరీతమైన క్రేజ్ రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. దీంతో చాలా పార్టీలు విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించాయి.
అందరి చూపు ఆయన వైపే…
కాంగ్రెస్ పార్టీ డీఎంకేకే కట్టుబడి ఉండగా… ఎన్డీఏ కూటమి విజయ్‌తో జత కట్టేందుకు ఆరాటపడింది. భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా ఆశ చూపినట్లు సమాచారం. ఎన్నికల ఖర్చు భరించవచ్చన్న ఆశతో పార్టీలోని జిల్లా కార్యదర్శులు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. కానీ అటు పార్టీ కానీ, ఇటు ఏఐఏడీఎంకే కానీ పొత్తు వార్తలను అధికారికంగా ఖండించాయి.
సందిగ్ధంలో విజయ్
విజయ్ ఇప్పుడు ఒక పెద్ద సందిగ్ధంలో ఉన్నారు. చిరంజీవి దారిలో వెళ్లాలో లేక పవన్‌కళ్యాణ్ వ్యూహాన్ని అనుసరించాలో తేల్చుకోవాలి. 2009లో చిరంజీవి 16 శాతం ఓట్లతో 18 సీట్లు సాధించి చివరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అదే తప్పు చేయకూడదని విజయ్ భావిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ లాగా మొదట ఒంటరిగా పోరాడి తర్వాత పొత్తు పెట్టుకుంటే మంచిదని కొందరు భావిస్తున్నారు.
బీజేపీతో దోస్తీ కష్టమే
బీజేపీతో వెళ్లడం విజయ్‌కు రాజకీయంగా నష్టమే. బీజేపీని తన భావజాల శత్రువుగా ఆయన ఇప్పటికే ప్రకటించారు. సెన్సార్ బోర్డు తన సినిమా జన నాయగన్‌ను అడ్డుకోవడం, మెర్సల్ సినిమాపై విమర్శలు, తన పేరులోని క్రైస్తవ గుర్తింపుపై బీజేపీ చేసిన దాడిని ఆయన మర్చిపోలేదు. పైగా ఏఐఏడీఎంకేతో కలిస్తే ముఖ్యమంత్రి పీఠం దక్కడం కష్టం. సొంతంగా పోటీ చేస్తే డీఎంకేకు పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ స్పూర్తి
విజయ్ ఇప్పుడు ఎన్టీఆర్ దారిలో వెళ్లాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగు ఆత్మగౌరవంతో ఎన్టీఆర్ ఎలాగైతే అధికారంలోకి వచ్చారో… ఇప్పుడు విజయ్ కూడా ద్రావిడ పాలనపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. విజయ్ ప్లాన్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఆయన 234 విజయ్‌ల ఫార్ములాతో బరిలో దిగుతున్నారు. మే 4న వచ్చే ఫలితాలు ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్