టెక్ విద్యార్థి పాత బట్టల వ్యాపారి – 22 ఏళ్ల యువకుడి సృజనాత్మక బిజినెస్

Tech Student - Old Branded clothing business
  • బ్రాండెడ్ పాత బట్టలు కొని ఆన్‌లైన్ విక్రయం
  • ఏడాది క్రితం ప్రారంభం… లక్షల్లో ఆదాయం
  • నేటితరం పాత బట్టలు కొనడంపై మొగ్గు
  • గ్లాస్గో వర్సిటీ నుంచి డిజైన్ ఇంజనీరింగ్ పట్టా

సహనం వందే, లండన్:

గ్లాస్గో నగరపు వీధుల్లో ఒక 22 ఏళ్ల యువకుడు పాత బట్టల మూటలతో కనిపించినప్పుడు అందరూ పెదవి విరిచారు. ఇంజనీరింగ్ చదువు మానేసి పాత జీన్స్ ప్యాంట్లు ఏరుకోవడమేంటని ఈసడించుకున్నారు. కానీ అదే పాత బట్టలు నేడు అతనికి నెలకు 7 లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న ఈ పెను మార్పును స్కాట్ అట్కిన్స్ ముందే పసిగట్టాడు. ఇది కేవలం ఒక కుర్రాడి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ వినియోగదారుల ధోరణికి నిదర్శనం.

Vinted App Scott Atkins Old Branded cloth business

ఇంజనీరింగ్ కంటే వ్యాపారమే మిన్న
స్కాట్ అట్కిన్స్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో డిజైన్ ఇంజనీరింగ్ చదువుతున్న మూడో ఏడాదిలో ఉండగా ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. 2025 ఏప్రిల్‌లో చదువుకు పూర్తిగా స్వస్తి పలికాడు. అప్పటికే అతను అప్రెంటిస్‌షిప్ ద్వారా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ ఆ జీతం అతనికి సరిపోలేదు. 2024లో ఒక సొంత కారు కొనుక్కోవాలనే చిన్న కోరికతో మొదలైన పాత బట్టల వ్యాపారం… అతనిలో ఉన్న అసలైన వ్యాపారవేత్తను నిద్రలేపింది. అతని తల్లిదండ్రులు మొదట భయపడినా నేడు అతని సంపాదన చూసి మౌనంగా ఉండిపోయారు.

పాత బట్టల లాభాల లెక్క
స్కాట్ వ్యాపార సూత్రం చాలా సరళంగా ఉంటుంది. బ్రిటన్‌లోని పెద్ద హోల్‌సేల్ మార్కెట్లకు వెళ్లి అక్కడ కుప్పలుగా ఉన్న పాత బట్టల నుంచి వింటేజ్ కార్హార్ట్, లీవైస్ వంటి ఖరీదైన బ్రాండ్లను వెతికి తీస్తాడు. కేవలం వందల రూపాయల్లో దొరికే ఈ బట్టలను శుభ్రం చేసి మోడల్స్ వేసుకున్నట్లుగా అందంగా ఫోటోలు తీస్తాడు. వీటిని వింటెడ్ అనే ఆన్‌లైన్ యాప్‌లో విక్రయిస్తాడు. అక్కడ అమ్మకందారుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయరు. దీంతో అతను నెలకు 10.90 లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ అందులో 7.65 లక్షల రూపాయలను నికర లాభంగా మిగుల్చుకుంటున్నాడు.

వార్డ్‌రోబ్ అంటే ఏమిటి?
యువతలో వస్తున్న మార్పును గమనిస్తే విస్మయం కలుగుతుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం ప్రకారం నేటి యువత తమ బట్టల బీరువాలో (వార్డ్‌రోబ్) 32 శాతం స్థానాన్ని పాత బట్టలకే ఇస్తున్నారు. పాత బ్రాండెడ్ బట్టలనే ఇష్టపడుతున్నారు. ఇది కేవలం పొదుపు మాత్రమే కాదు… పర్యావరణ స్పృహ కూడా. పాత బట్టలను మళ్లీ వాడటం వల్ల కొత్త బట్టల ఉత్పత్తి తగ్గి ప్రకృతికి మేలు జరుగుతుందని వీరు నమ్ముతున్నారు. ఈ ధోరణే స్కాట్ లాంటి వారికి కాసుల వర్షం కురిపిస్తోంది.

మార్కెట్ విస్తరణ వేగం
2030 నాటికి ప్రపంచవ్యాప్త రీసెల్లింగ్ మార్కెట్ 28.80 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. 10 మంది యువతలో 8 మంది కొత్త బ్రాండ్లను తెలుసుకోవడానికి ఈ పాత బట్టల యాప్‌లనే వాడుతున్నారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు జూన్ ఉమ్ ప్రకారం… సోషల్ మీడియాలో నిత్యం గడిపే యువతకు ఇదొక సులభమైన ఆదాయ మార్గంగా మారింది. అయితే ఇందులో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదని… మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నారు. స్కాట్ మాత్రం తన నిలకడైన శ్రమతో ఆ అడ్డంకులను అధిగమించాడు.

రిస్క్ లేనిదే గెలుపు లేదు
ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు వెనక్కి వెళ్లే దారి ఉండకూడదని స్కాట్ అంటాడు. చదువు వదిలేసినప్పుడు అతనికి ఉన్న ఏకైక మార్గం కష్టపడటం మాత్రమే. స్టాక్ కోసం ముందుగా డబ్బు పెట్టాల్సి రావడం… కొన్నిసార్లు బట్టలు అమ్ముడుపోకుండా ఉండిపోవడం వంటి సవాళ్లను అతను ఎదుర్కొన్నాడు. వస్తువుల ధరలు పెరగడం, ప్లాట్‌ఫామ్ మార్పులు వంటివి కూడా ఇబ్బంది పెడతాయి. కానీ స్కాట్ తన వ్యాపారాన్ని ఒక ప్రొఫెషనల్ కంపెనీలా నడుపుతున్నాడు. కేవలం లాభాల కోసమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం అతను తపిస్తున్నాడు.

భవిష్యత్తుపై ధీమా
తాను ఎప్పటికీ ఉద్యోగంలో చేరనని స్కాట్ తెగేసి చెబుతున్నాడు. ఆన్‌లైన్ ప్రపంచంలో ఉన్న ఆదాయ మార్గాలు అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. పాత దుస్తులను విక్రయించడం అనేది తక్కువ పని కాదని… అది ఒక గౌరవప్రదమైన వ్యాపారమని అతను నిరూపించాడు. స్కాట్ కథ కేవలం ఒక యువకుడి విజయం మాత్రమే కాదు… సంప్రదాయ ఉద్యోగ పద్ధతులపై ఒక తిరుగుబాటు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *