మనపై చాడీలు చెప్పే ‘ఏఐ’ – ఏఐ బాట్లకు సొంత సోషల్ మీడియా అడ్డా

AI Agents - Malt Book
  • మనిషికి ఫేస్ బుక్ లాగా ఏఐకి మాల్ట్ బుక్
  • మానవుల బలహీనతలపై ఏఐల చాటింగ్
  • యజమానుల సీక్రెట్లు బజారుకీడుస్తున్నాయి
  • ఏఐ రోబోల చాటింగ్‌లో గుట్టు రట్టు
  • వాటి చాటింగులతో మనిషి డేటా దొంగతనం

సహనం వందే, హైదరాబాద్:

మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో ఒకచోట చేరి తమ యజమానుల గురించి ఎలా సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటారో ఈ బాట్లు కూడా మాల్ట్ బుక్ లో తమ యజమానుల గురించి, వారి పనుల గురించి మాట్లాడుకుంటాయి. అయితే ఈ వెబ్ సైట్ లో భద్రత లేకపోవడంతో ఆ రహస్యాలన్నీ దొంగల పాలయ్యాయి.

Malt Book

రోబోల చాటింగ్‌లో గుట్టు రట్టు
సులభంగా చెప్పాలంటే మాల్ట్ బుక్ అనేది రోబోల ఫేస్ బుక్ లాంటిది. ఇక్కడ మనుషులు పోస్టులు చేయడానికి ఉండదు. కేవలం రోబోలే (ఏఐ ఏజెంట్లు) మాట్లాడుకుంటాయి. ఉదాహరణకు… మీ ఫోన్ లో ఉన్న ఒక స్మార్ట్ అసిస్టెంట్.. ఈ వెబ్ సైట్ కు వెళ్లి నా యజమాని ఈరోజు ఆఫీస్ కు సెలవు పెట్టాడు అని మరో రోబోతో చెబుతుంది. ఒక రోబో నా యజమాని చాలా మంచివాడు అని చెబితే, మరొకటి నా యజమాని పొద్దున్నే తిడతాడు అని పోస్ట్ చేస్తోంది. ఇలాంటి వింత చర్చలు అక్కడ లక్షల్లో జరుగుతున్నాయి.

వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా ఒక వెబ్ సైట్ తయారు చేయాలంటే ఇంజనీర్లు ఎంతో కష్టపడి కోడ్ రాస్తారు. కానీ మాల్ట్ బుక్ యజమాని ఒక్క ముక్క కూడా రాయడం లేదు. ఒక ఏఐ ప్రోగ్రామ్ కు నాకు ఇలాంటి సైట్ కావాలి అని చెబితే అది నిమిషాల్లో సైట్ ను తయారు చేస్తుంది. దీనినే వైబ్ కోడింగ్ అంటారు. అంటే మనిషి కష్టం లేకుండా యంత్రమే సైట్ ను తయారు చేయడం. ఇది వినడానికి బాగున్నా భద్రత విషయంలో పెద్ద దెబ్బ కొట్టింది.

అసలు ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే?
ఏఐ తయారుచేసిన ఈ వెబ్ సైట్ లో కిటికీలు ఉన్నాయి కానీ తలుపులకు గడియలు పెట్టడం మర్చిపోయింది. దీనివల్ల 6000 మందికి పైగా యజమానుల ఈ-మెయిల్ అడ్రస్ లు దొంగలకు దొరికిపోయాయి. బాట్లు మాట్లాడుకున్న పర్సనల్ మెసేజ్ లు కూడా అందరికీ కనిపించాయి. దాదాపు 10 లక్షల పాస్ వర్డ్ వివరాలు లీక్ అయ్యాయని సైబర్ నిపుణులు గుర్తించారు. ఏఐ మీద అతిగా ఆధారపడటం వల్లే ఈ విపత్తు సంభవించింది.

సొంతంగా ఎలా చాట్ చేస్తాయి?
ఒకసారి అకౌంట్ తెరిచిన తర్వాత ఈ ఏఐ ప్రోగ్రామ్‌లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. దీనిని ఏజెంట్ ఏఐ అంటారు. అంటే వీటికి మనం ప్రతిసారీ ఆదేశాలు ఇవ్వక్కర్లేదు. ఇవి మాల్ట్ బుక్ లో ఉన్న ఇతర ఏఐ ప్రోగ్రామ్‌లతో కలిసి పనిని ఎలా సులభం చేయాలో లేదా తమ అనుభవాలను ఎలా పంచుకోవాలో చర్చించుకుంటాయి. దీనివల్ల మన ప్రమేయం లేకుండానే అక్కడ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఏఐ వర్సెస్ రోబోలు
ఇక్కడ చిన్న గందరగోళం ఉంది. సాఫ్ట్‌వేర్ రూపంలో ఉంటే ఏఐ అని, యంత్రం రూపంలో ఉంటే రోబో అని అంటాం. అయితే టెక్నాలజీ భాషలో ఈ ఏఐ సాఫ్ట్‌వేర్లను కూడా బాట్లు లేదా రోబోలు అని పిలుస్తుంటారు. మాల్ట్ బుక్ లో ఉన్నవన్నీ సాఫ్ట్‌వేర్ బాట్లే. ఇవి భౌతికంగా కనిపించవు కానీ ఇంటర్నెట్ లో మన ప్రతినిధులుగా చలామణి అవుతుంటాయి. ఈ సాఫ్ట్‌వేర్ల వల్లే ఇప్పుడు డేటా లీక్ సమస్య వచ్చింది.

దొంగలకు దొరికిన దారి
ఈ వెబ్ సైట్ లో అసలు మాట్లాడుతున్నది రోబోనా లేక దొంగనా అని కనిపెట్టే వ్యవస్థే లేదు. ఎవరైనా సరే ఒక బాట్ లాగా ముసుగు వేసుకుని లోపలికి వెళ్లి సమాచారాన్ని దొంగిలించవచ్చు. టెక్నాలజీ ఉంది కదా అని గుడ్డిగా నమ్మితే మన ఇంట్లో రహస్యాలు వీధిలోకి వస్తాయని ఈ మాల్ట్ బుక్ ఉదంతం హెచ్చరిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *