15 లక్షల కోట్ల గోల్డ్ స్కామ్ – రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గోల్‌మాల్

Rajesh Exports Gold Scam
  • కాగితాల మీదే అద్భుత సామ్రాజ్యం
  • సెబీ దర్యాప్తులో విస్తుగొల్పే నిజాలు
  • లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి
  • మౌనంగా ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:

భారతీయ మార్కెట్లను కుదిపేసిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణంలో ఒకటిగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు బంగారు సామ్రాజ్యంగా వెలుగొందిన ఈ సంస్థ, ఇప్పుడు రూ 15 లక్షల కోట్ల కుంభకోణంలో చిక్కుకుంది. కష్టపడి సంపాదించిన సొమ్మును మార్కెట్‌లో పెట్టిన సామాన్యుల గుండెల్లో ఈ వార్త రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ భారీ కుంభకోణం వెనుక దాగున్న అసలు నిజాలు ఇప్పుడు వ్యవస్థల పనితీరుపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

కాగితాల మీదే అద్భుత సామ్రాజ్యం
రాజేష్ మెహతా అప్పులతో మొదలుపెట్టిన వ్యాపారం స్విట్జర్లాండ్‌లో గోల్డ్ ఫ్యాక్టరీని కొనే స్థాయికి ఎదిగింది. దీనితో ఎల్‌ఐసీ వంటి భారీ సంస్థలు, సామాన్యులు ఆ కంపెనీని నమ్మి పెట్టుబడులు పెట్టారు. కానీ కంపెనీ లెక్కలు చూస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. తాము ఏటా 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నామని సెబీకి రిపోర్ట్ ఇచ్చింది. స్విస్ ఫ్యాక్టరీ రికార్డులను పరిశీలిస్తే, 5 ఏళ్లలో కేవలం 3,000 కోట్ల రూపాయల వ్యాపారం మాత్రమే జరిగింది. మిగిలిన లక్షల కోట్ల రూపాయల వ్యాపారం కాగితాల మీద బొమ్మ మాత్రమేనని స్పష్టమవుతోంది.

తీగ లాగితే కదిలిన డొంక
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తన విదేశీ ఫ్యాక్టరీతో కలిసి అస్సలు జరగని వ్యాపారాన్ని జరిగినట్లు చిత్రీకరించింది. బయటకు వెళ్లిన డబ్బు మళ్ళీ తిరిగి కంపెనీకే చేరేలా చేసి టర్నోవర్ పెంచుకున్నట్లు చూపింది. అసలు రూపాయి కూడా చేతులు మారకుండానే అబద్ధపు లెక్కలను నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. 2024 మార్చిలో ఒక షేర్‌హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదుతో సెబీ దర్యాప్తు మొదలైంది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ రికార్డులను, వాల్కంబి రికార్డులతో పోల్చి చూడగా అసలు గుట్టు రట్టయింది. కంపెనీ తన గ్రూప్ ఆదాయంలో 99 శాతం విదేశీ అనుబంధ సంస్థల నుంచే వస్తోందని నమ్మబలికింది. కానీ వాల్కంబి ఐదేళ్ల ఆదాయం కేవలం రూ. 3027 కోట్లు మాత్రమేనని ఆడిట్ స్పష్టం చేసింది.

నియంత్రణ సంస్థ నిర్లక్ష్యం
3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు సెబీ కళ్లు మూసుకోవడం పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు వ్యాపారమే జరగనప్పుడు ఆ టర్నోవర్ ఎలా వచ్చిందని సెబీ ఎందుకు ఆరా తీయలేదనేది ప్రశ్నార్థకం. 20 నెలల పాటు విచారణ చేశామంటూ సెబీ చేసిన ఆలస్యం వల్ల కంపెనీ ఆస్తులను పక్కకు మళ్లించే అవకాశం కలిగింది. వ్యవస్థ వైఫల్యాల వల్ల సామాన్యులు బలి కావాల్సి వచ్చింది. రాజేష్ మెహతా అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ అనే బ్రోకర్ ద్వారా రూ. 11,487 కోట్ల గోల్డ్ డెరివేటివ్స్ అమ్మి, మళ్లీ రూ. 11,488 కోట్లవి కొన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అసలు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తమ క్లయింటే కాదని అఫ్లుయెన్స్ సంస్థే బాంబు పేల్చింది.

సెబీ వైఫల్యమా లేదా కాలయాపనా
దాదాపు 20 నెలల పాటు బహిరంగ దర్యాప్తు జరిపిన సెబీ ఇప్పుడు హడావిడిగా ఎక్స్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం వ్యవస్థా లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఈ 20 నెలల కాలంలో ప్రమోటర్లు నిధులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవడానికి సమయం ఇచ్చినట్లయిందని విమర్శలు వస్తున్నాయి. కేవలం రాజేష్ మెహతాపై నిషేధం విధించి, రికార్డులను సరిచేయమనడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడం సామాన్యుడికి వ్యవస్థపై నమ్మకాన్ని పోగొడుతోంది.

కరిగిపోయిన సామాన్యుల పెట్టుబడులు
ఈ మోసం వల్ల తీవ్రంగా నష్టపోయింది సామాన్యులే. ఒకప్పుడు 1,000 రూపాయలకు పైగా ఉన్న షేర్ ధర ఇప్పుడు 80 రూపాయలకు పడిపోయింది. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు చేతిలో మిగిలింది కేవలం 80,000 రూపాయలు మాత్రమే. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా ఆవిరైపోతుంటే సెబీ కేవలం నోటీసులతో కాలక్షేపం చేస్తోంది.

చర్యలు తీసుకునే వేళ ఆస్తులు హుష్‌కాకీ
చివరికి రాజేష్ మెహతాను మార్కెట్లో వ్యాపారం చేయకుండా సెబీ నిషేధించింది. కానీ ఆస్తులన్నీ పోయిన తర్వాత, ఇన్వెస్టర్లు రోడ్డున పడ్డ తర్వాత ఈ చర్యలు ఎందుకనేది అందరి ప్రశ్న. విదేశాల్లో ఇలాంటి మోసాలకు సిఈఓలను వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ మన దేశంలో మాత్రం కేవలం వివరణలు అడుగుతూ కాలం గడుపుతున్నారు. నమ్మిన వారికి దరిద్రం, దోచుకున్న వారికి దర్జా అన్నట్లుగా సాగుతోంది ఈ వ్యవహారం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *