‘అయ్యో’ధ్య – విరాళాల వివాదంతో తగ్గిన యాత్రికుల తాకిడి

Ayodhya Rama Mandir
  • అవినీతితో దెబ్బతిన్న భక్తుల మనోభావాలు
  • మసకబారిన నమ్మకం… నిలిచిన వ్యాపారం
  • వివాదంతో స్థానికుల జీవనోపాధికి గండి
  • తగ్గిన హోటల్ బుకింగ్‌లు… ఆగిన రాకపోకలు

సహనం వందే, అయోధ్య:

రామమందిర నిర్మాణ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు అయోధ్య నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండేళ్లుగా కళకళలాడిన పవిత్ర నగరం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. భక్తుల రాక తగ్గడంతో వ్యాపారులు, రవాణాదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం చట్టపరమైన విచారణే కాకుండా, భక్తుల నమ్మకం దెబ్బతినడం వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. దీనిపై ప్రత్యేక విశ్లేషణ.

రామమందిర ప్రస్థానం…
గత రెండేళ్లుగా అయోధ్యలో రామమందిరం ప్రభావంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంది. వేల సంఖ్యలో భక్తులు రావడంతో హోటళ్లు, రవాణా రంగం, చిరు వ్యాపారాలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విరాళాల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది.

వివాదంతో తగ్గిన యాత్రికుల ఉత్సాహం…
అయోధ్యలోని రామమందిరం మాత్రమే కాకుండా హనుమాన్ గర్హి, కనక్ భవన్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద కూడా భక్తుల సందడి కనిపించడం లేదు. గత వేసవికాలంతో పోలిస్తే ఇప్పుడు భక్తుల రాక చాలా తక్కువగా ఉందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కేవలం వేసవి ఎండల వల్ల భక్తులు రావడం లేదని అధికారులు భావిస్తున్నప్పటికీ, స్థానికులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు.

దెబ్బతిన్న భక్తుల మనోభావాలు
రామమందిర విరాళాల వినియోగంపై భక్తుల్లో నెలకొన్న సందేహాలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. తాము ఇచ్చే విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయని భక్తులు భావిస్తున్నారు. ఈ అపనమ్మకం వల్ల యాత్రికుల సంఖ్యపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. వ్యాపారులు, హోటల్ యజమానులు, ఈ రిక్షా డ్రైవర్లు అందరూ ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్నారు.

స్థానిక జీవనోపాధిపై తీవ్ర ప్రభావం
అయోధ్యలో ఇప్పుడు వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. రవాణా రంగం, హోటల్ రంగాలు ఆదాయం లేక వెలవెలబోతున్నాయి. భక్తుల ఖర్చులే తమ ప్రధాన జీవనాధారమని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు.

అధికారిక గణాంకాల్లో అస్పష్టత…
ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత భక్తుల రాకపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక గణాంకాలు వెల్లడి కాలేదు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. రామమందిర ప్రాంగణంతో పాటు నగరం మొత్తం యాత్రికుల కోసం నిరీక్షిస్తోంది. విచారణ జరుగుతున్నా సరే ప్రజల నమ్మకం పెంచే ప్రయత్నాలు జరగకపోతే ఆర్థిక వ్యవస్థ మరింత చితికిపోయే ప్రమాదం ఉంది.

విచారణ దాటిన వివాదాల వేడి
రామమందిర నిధి అక్రమాలపై జరుగుతున్న విచారణ కేవలం ఒక క్రిమినల్ కేసుగా మాత్రమే మిగిలిపోలేదు. అది ఒక సామాజిక ఆందోళనగా మారింది. నగర ఆర్థిక స్థితిని కాపాడుకోవాలంటే భక్తుల నమ్మకాన్ని తిరిగి పొందడం అత్యంత అవసరం. లేనిపక్షంలో రెండేళ్ళుగా సాధించిన ఆర్థిక ప్రగతికి ఇక్కడ బ్రేకులు పడే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *