క్రికెట్ మత్తులో భారత్ – 99 శాతం వ్యామోహం… కపిల్ దేవ్ ఆవేదన

Kapildev Comments
  • ఇతర క్రీడలకు అడ్డంకిగా ఉందని విమర్శ
  • వైభవ్ సూర్యవంశీ ప్రతిభావంతుడని కితాబు

సహనం వందే, హైదరాబాద్:

భారత క్రీడా రంగంలో క్రికెట్ ఒక మతంలా మారింది. ప్రతి గల్లీలో బ్యాట్, బంతి కనిపిస్తున్నాయి. కానీ ఈ మత్తులో దేశం ఇతర క్రీడలను విస్మరిస్తోంది. 1983 ప్రపంచకప్ గెలిచిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. క్రికెట్ మీద మనకు ఉన్న 99 శాతం వ్యామోహం ఇతర క్రీడల ఎదుగుదలను అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.

వ్యామోహంలో భారత్
భారతదేశం క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత మరే ఇతర క్రీడలకు ఇవ్వడం లేదని కపిల్ దేవ్ వాపోయారు. మనం ఒక జాతిగా 99 శాతం క్రికెట్‌కే కేటాయిస్తున్నామని… ఇది కచ్చితంగా అన్యాయమని ఆయన తేల్చి చెప్పారు. అన్ని క్రీడలకు సమానమైన గుర్తింపు లభిస్తేనే దేశం నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు. క్రికెటర్ అయినప్పటికీ తాను ఈ మాటలు చెప్పడం గమనార్హం.

Kapildev

కపిల్ చూపు గోల్ఫ్ వైపు…
ప్రస్తుతం కపిల్ దేవ్ క్రికెట్ కంటే గోల్ఫ్ క్రీడకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చిన్నతనంలో చదువు కంటే బ్యాట్, బంతితో ఆడుకోవడమే తనకు ఆనందాన్ని ఇచ్చేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే మక్కువను గోల్ఫ్ పట్ల చూపిస్తున్నారు. ఆట ఏదైనా బాల్యం నుంచి మరణించే వరకు క్రీడలతో మమేకం కావాలని ఆయన ఆకాంక్షించారు.

వైభవ్ సూర్యవంశీ ప్రతిభావంతుడు
ప్రస్తుత ఐపీఎల్ 2026లో సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా కపిల్ స్పందించారు. వైభవ్ ఒక ప్రత్యేకమైన ప్రతిభావంతుడని ఆయన కొనియాడారు. అయితే అతనికి ఇంకా సమయం ఇవ్వాలని… జీవితం గురించి ఇంకా నేర్చుకోవాల్సి ఉందని కపిల్ సూచించారు. కేవలం క్రికెట్ మాత్రమే లోకం కాదనే విషయాన్ని పరోక్షంగా యువతకు గుర్తు చేశారు.

విద్యా వ్యవస్థలో క్రీడల పాత్ర…
పిల్లలు ఆరేడేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారి చేతిలో బ్యాట్ బదులు పెన్సిల్ పెడుతున్నారని కపిల్ బాధపడ్డారు. ఇది చదువుపై దృష్టి పెట్టేలా చేసినా క్రీడాకారుల ఎదుగుదలకు ఆటంకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని… అప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమని ఆయన కోరారు.

గతాన్ని వదిలేయాలి
1983 ప్రపంచకప్ విజయం తన కెరీర్‌లోనే గొప్ప ఘట్టమని కపిల్ అన్నారు. కానీ ఆ గతాన్ని పట్టుకుని కూర్చోవడం తనకు ఇష్టం ఉండదు. ఆ రోజు తాను దేశం కోసం ఆడానా అంటే… నిజానికి తాను తనకు నచ్చిన ఆటను ఆడానని కపిల్ నిజాయితీగా చెప్పారు. క్రీడాకారుడు తన ఆనందం కోసం ఆడుతూనే దేశానికి కీర్తిని తీసుకురావాలని ఆయన సూచించారు.

దేశ ప్రగతికి మంత్రం
ఓటమిని ఒప్పుకోకూడదని… గివ్ అప్ ఇచ్చిన క్షణమే ఒక క్రీడాకారుడు మరణించినట్లు అని కపిల్ దేవ్ హెచ్చరించారు. క్రికెట్ ఆధిపత్యం నుంచి బయటపడి ఇతర రంగాల్లో కూడా మన యువత రాణించినప్పుడే భారతదేశం ప్రపంచ వేదికపై మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కపిల్ దేవ్ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *