ఔట్‌సోర్సింగ్ ఆర్తనాదం… పంజాబ్ ఆదర్శం – పీఎఫ్, పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి భద్రత

Punjab Outsourcing Benefits
  • ఆ రాష్ట్రంలో నిర్ణీత కాలంలోనే క్రమబద్ధీకరణ
  • తెలుగు రాష్ట్రాల్లో దాని అమలుకు డిమాండ్
  • ఏపీ, తెలంగాణ మొండి వైఖరిపై విమర్శలు
  • ఆర్థిక వ్యవస్థకు భారమన్న వాదనలో పసెంత?

సహనం వందే, హైదరాబాద్:

ప్రభుత్వ వ్యవస్థలో ప్రాణం పోస్తున్న అదృశ్య శక్తి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే. దశాబ్దాలుగా సేవలందిస్తున్నా వారికి గుర్తింపు లేదు. కనీస భద్రత లేని జీవితాలతో వారు సతమతమవుతున్నారు. పంజాబ్ మోడల్ ఒక వైపు ఆశను చిగురింపజేస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న వివక్ష మరోవైపు వారిని నిరాశలోకి నెడుతోంది. అసలు ఈ వ్యవస్థలో దాగున్న నిజాలేమిటో ఇప్పుడు చూద్దాం.

ఆశలు రేపుతున్న పంజాబ్ బాట
దేశవ్యాప్తంగా ఇప్పుడు పంజాబ్ మోడల్ పైనే చర్చ నడుస్తోంది. వేలమంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ఆ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వ వ్యవస్థలో పదేళ్లకు పైగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారికి భరోసా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. కేవలం జీతం పెంపు మాత్రమే కాదు… పీఎఫ్, పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత కల్పించడమే అక్కడ జరిగిన నిజమైన విప్లవం. ఇతర రాష్ట్రాలు దీనిని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Outsourcing system at Punjab

తెలుగు రాష్ట్రాల్లో కీలకం…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి చూస్తే విద్యుత్ నుంచి ఉపాధిహామీ వరకు, టీటీడీ నుంచి ఆర్టీసీ వరకు లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీరిలో చాలామంది 10 నుంచి 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకున్నా ప్రభుత్వ యంత్రాంగం నడవాలంటే వీరి శ్రమే కీలకం. కనీస పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రాథమిక హక్కులకు వీరు నోచుకోవడం లేదు. కానీ ప్రభుత్వాలు వీరిని మాత్రం నిత్యం విస్మరిస్తూనే ఉన్నాయి.

ఉద్యోగుల ఆవేదన… డిమాండ్లు
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పాయింట్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్‌లను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చడం, ఐదేళ్లు నిండిన వారికి రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి బెనిఫిట్స్ ఇవ్వడం అత్యవసరం. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మరో ప్రధాన డిమాండ్. వేతనాలు పెండింగ్ పడకుండా గ్రీన్ ఛానల్ ద్వారా పంపిణీ చేయాలి. ఇవి అసాధ్యమైన గొంతెమ్మ కోరికలు కావు, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే పద్ధతులు.

ఆర్థిక భారమా లేక భ్రమనా?
ప్రభుత్వాలు చెబుతున్నట్టు రెగ్యులరైజేషన్ ఆర్థిక భారం ఏమీ కాదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది. సుమారు 3 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు అదనంగా 20 వేలు ఇచ్చినా ఏడాదికి అయ్యే ఖర్చు 7,200 కోట్లు మాత్రమే. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో కేవలం 0.36 శాతం అంటే 100 రూపాయల ఆదాయంలో కేవలం 36 పైసలు మాత్రమే. దీనిని బట్టి చూస్తే ఖజానాకు ఇది భారం కాదు, కేవలం ఒక సాకు మాత్రమేనని అర్థమవుతోంది.

మల్టిప్లయర్ ఎఫెక్ట్ తో లాభం
ఉద్యోగి చేతికి డబ్బులు వస్తే అది మార్కెట్లోకి వెళుతుంది. పిల్లల చదువు, ఆరోగ్యం, ఇళ్లు, వస్తువుల కొనుగోలుతో ప్రతి రూపాయి ఆర్థిక వ్యవస్థలో అనేకసార్లు తిరుగుతుంది. దీనిని ఆర్థిక వేత్తలు మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటున్నారు. వ్యాపారాలు పెరిగి ప్రభుత్వానికి జీఎస్టీ, పన్నుల రూపంలో తిరిగి ఆదాయం వస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది సంజీవనిలా మారుతుంది. స్థానిక ఆర్థిక కార్యకలాపాలు చురుగ్గా మారి రాష్ట్రానికి లాభమే చేకూరుస్తుంది.

హక్కుల గుర్తింపులో జాప్యం ఎందుకు?
కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు, భూములు ఇచ్చేటప్పుడు పెట్టుబడి అంటాం. మరి ప్రభుత్వ వ్యవస్థను భుజాన మోస్తున్న ఉద్యోగుల భద్రతను ఎందుకు భారం అంటున్నాం? రెగ్యులరైజేషన్ అంటే ఖజానా ఖాళీ చేయడం కాదు… లక్షలాది కుటుంబాలకు భరోసా ఇవ్వడం. మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం ఏ ప్రభుత్వానికైనా అదనపు బలం. ఉద్యోగులను గౌరవించి ఆర్థిక శక్తిని పెంచితే, రాష్ట్ర అభివృద్ధికి అదే నిజమైన పునాది అవుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *