- తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కిన వివాదం
- సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై నెటిజన్ల సెటైర్లు
సహనం వందే, హైదరాబాద్:
టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే… తీరా అందులో ప్రత్యర్థినే హీరోగా చూపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అలాంటి పరిస్థితే ఎదురైంది! నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ చూసిన వాళ్లంతా ఇప్పుడు కథ కంటే, అందులోని ఒక క్యారెక్టర్ గురించే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన చిత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ని హీరోగా ఎలివేట్ చేశారంటూ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. అసలు ఏం జరిగింది? రేవంత్ రెడ్డిపై నెటిజన్లు ఎందుకు ట్రోలింగ్ మొదలుపెట్టారో చూద్దాం!
పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్…
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘దసరా’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అదే కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ‘ది ప్యారడైజ్’ మీద ట్రేడ్ వర్గాల్లో, ఆడియన్స్‌లో ఊహించని రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్, టాప్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే టాక్ ఎలా ఉన్నా, పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

కేసీఆర్ పాత్రను పోలిన ‘శంకరన్న’
ఒక సినిమాలో పొలిటికల్ పర్సనాలిటీ పాత్రను సృష్టించడం కత్తి మీద సాములాంటి వ్యవహారం. కానీ శ్రీకాంత్ ఓదెల 1980-85 బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ జాగీర్ జమానా కథతో ఈ చిత్రాన్ని మలిచాడు. సికింద్రాబాద్ బోయిగూడ ప్యారడైజ్ ప్రాంతంలో ఒక సామాన్య తెగ ఉనికి కోసం చేసిన పోరాటమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఈ కథలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను పోలిన ‘శంకరన్న’ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు.
శంకరన్న పాత్రలో ప్రియదర్శి…
శంకరన్న పాత్రను నటుడు ప్రియదర్శి పోషించగా, అందులో కేసీఆర్ శైలిని యాజిటీజ్‌గా దించేశారు. ఆయన మాట్లాడే తీరు, వ్యవహార శైలి, తెలంగాణ సాధనకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రియదర్శితో చెప్పించి ఆ క్యారెక్టర్‌ను ఎంతో శక్తివంతంగా తీర్చిదిద్దారు. కేవలం కొద్దిసేపు మాత్రమే స్క్రీన్ మీద కనిపించినా, ప్రేక్షకులకు ఊహించని రేంజ్లో హై ఇస్తోంది. ఆడియన్స్ నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
రేవంత్ రెడ్డిని అవమానించారా?
ఇక రిలీజ్‌కు ముందు హీరో నాని అభ్యర్థనను అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వపరంగా అంతలా సపోర్ట్ చేస్తే, సినిమాలో మాత్రం కేసీఆర్‌ని హీరోగా చూపించడం పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పాలనలోనే ఈ సన్నివేశాలు ఉండటంతో నెటిజన్లు రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే, క్రెడిట్ అంతా కేసీఆర్ అకౌంట్లో పడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.
మీడియాలో వైరల్…
తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరును ఎవరూ చెరిపేయలేరంటూ బీఆర్ఎస్ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శంకరన్న పాత్ర ఫోటోలు, డైలాగ్స్ ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో టాక్ పక్కన పెడితే పొలిటికల్ వర్గాల్లో మాత్రం పెద్ద దుమారమే రేపుతోంది. సినిమా మేకర్స్ ఒక ప్రాంత చరిత్రను, అక్కడి నాయకుల పోరాటాలను వెండితెరపై చూపించడం సహజమే అయినా… పొలిటికల్ టైమింగ్ వల్ల ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొత్త చర్చకు దారితీసింది.