- కండరాలతోనే అకాల మరణాలకు చెక్
- గుండెకు కొత్త రక్షణ… డెమెన్షియాకు వీడ్కోలు
- 1.47 లక్షల మందిపై 30 ఏళ్ల పాటు పరిశోధన
సహనం వందే, హైదరాబాద్:
నిత్యం జిమ్లో కష్టపడే వారిని చూసి మనం నవ్వుకుంటాం. వాకింగ్ చాలు కదా అని తేలికగా తీసుకుంటాం. కానీ వ్యాయామంలో బరువులు ఎత్తడం అనేది ఒక అద్భుతమైన మంత్రం అని సైన్స్ చెబుతోంది. ఇది కేవలం కండరాల కోసం కాదు… అకాల మరణాన్ని అడ్డుకునే ఒక కవచం. మీ ఆయుష్షును పెంచే అసలు రహస్యం ఇక్కడ ఉంది.
నిరంతర అధ్యయనం
శాస్త్రవేత్తలు ఏకంగా 1.47 లక్షల మందిపై 30 ఏళ్ల పాటు పరిశోధన చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. కేవలం పరుగు, సైక్లింగ్ మాత్రమే సరిపోదు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదా బరువులు ఎత్తడం అనేది మనిషి జీవిత కాలాన్ని పెంచడంలో కీలకం అని ఈ భారీ డేటా నిరూపించింది. వారానికి 90 నిమిషాల నుంచి 2 గంటల పాటు బరువులు ఎత్తేవారిపై ఈ అధ్యయనం దృష్టి పెట్టింది. వీరిలో అకాల మరణం సంభవించే అవకాశం 13 శాతం తగ్గుతుందని తేలింది. కష్టపడితే ఫలితం దక్కుతుందనే నానుడికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. నిరంతర శ్రమ ద్వారా ఆయుష్షును కాపాడుకోవచ్చని ఈ రీసెర్చ్ స్పష్టం చేస్తోంది.
గుండెకు భరోసా
గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలతో చనిపోయే ముప్పు 19 శాతం తగ్గుతుందని ఈ డేటా చెబుతోంది. తక్కువ వ్యాయామంతోనే గుండె ఆరోగ్యంగా ఉంటుందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీనివల్ల ఆసుపత్రులపై పడే ఆర్థిక భారం కూడా తగ్గుతుందని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. మతిమరుపు లేదా డెమెన్షియా వంటి నరాల సంబంధిత వ్యాధులు సమాజంలో వేగంగా వ్యాపిస్తున్నాయి. బరువులు ఎత్తడం వల్ల ఇలాంటి సమస్యల వల్ల వచ్చే మరణాల ముప్పు ఏకంగా 27 శాతం తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది. మెదడును చురుగ్గా ఉంచడానికి ఇది ఒక అద్భుతమైన మార్గంగా నిలిచింది.
అతి ఎప్పుడూ ప్రమాదమే
ఇక్కడ చిన్న కండిషన్ కూడా ఉంది. వారానికి 2 గంటల కంటే ఎక్కువ బరువులు ఎత్తినా అదనపు ప్రయోజనం ఉండదు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు రోజుకు కాస్త సమయం కేటాయిస్తే చాలు. మీ శరీరం మీకు దీర్ఘకాలంలో కృతజ్ఞతలు చెబుతుంది. అతిగా కాకుండా పరిమితంగా కష్టపడటం ఎప్పుడూ మేలే. రోజూవారీ పనులతో పాటు వారానికి నిర్ణీత సమయం ఏరోబిక్ వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ చేసే వారిలో అకాల మరణం ముప్పు ఏకంగా 58 శాతం వరకు తగ్గుతుంది. 28 ఏళ్ల యువతి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని పాటించవచ్చు. మనం ఇతరులపై ఆధారపడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఈ కష్టాన్ని ప్రేమించడం మొదలుపెట్టాలి.