- పెరిగిన అక్రమ సంబంధాలే కారణం
- విషం కక్కుతున్న సోషల్ మీడియా
- కుప్పకూలిన కుటుంబ వ్యవస్థ
సహనం వందే, హైదరాబాద్:
పెళ్లి అంటే నమ్మకం, బంధం, తోడు. కానీ నేడు ఆ బంధమే మృత్యుపాశంగా మారుతోంది. కట్టుకున్న భర్తలు కంటికి రెప్పలా కాపాడుతుంటే, భార్యలు మాత్రం ప్లాన్డ్ గా ప్రాణాలు తీస్తున్నారు. గురుగ్రామ్ కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం, దేశంలో కేవలం 6 నెలల్లోనే 592 మంది భర్తలు మరణించారు. ఇది ఏదో ప్రమాదం కాదు… కళ్ళముందే జరుగుతున్న పక్కా ప్రణాళికాబద్ధమైన దారుణం. అసలు ఇంట్లో భార్య ఉందా? లేక కాలయముందా?
రక్తపు మరకల రిపోర్ట్
ఏకం న్యాయ్ ఫౌండేషన్ గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై 14 వరకు 592 మంది భర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 401 మందిని భార్యలే హత్య చేశారు. రోజుకు ముగ్గురు భర్తలు చొప్పున బలైపోతున్నారంటే వ్యవస్థ ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్తి కోసం లేదా ప్రియుడితో విలాసాలకు అడ్డు వస్తున్నారనే నెపంతో ప్రాణాలు తీయడం సర్వసాధారణమైపోయింది.
చిత్తూరు జిల్లాలో దారుణం
మొన్న చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. రమేష్ అనే వ్యక్తిని అతని భార్య హాసిని దారుణంగా అంతం చేసింది. తిరుపతి వెళ్తున్నామని భర్తను నమ్మించి బైక్ మీద తీసుకెళ్లింది. ముందే ప్లాన్ చేసుకున్న విధంగా భర్తను ఆపి ప్రియుడు యుగంధర్, అతని గ్యాంగ్ తో కలిసి నరికించింది. భార్యల కుట్ర ఎంతలా ఉందో చెప్పడానికి ఈ ఉదంతం ఒక నిలువుటద్దం. కళ్ళముందే భర్త ప్రాణాలు పోతుంటే ఆ మహిళ చలించలేదు.
అత్యాశకు బలి
నిరపరాధులైన భర్తల చావులకు అక్రమ సంబంధాలే మూల కారణం. సోషల్ మీడియాలో పరిచయాలు, క్షణికపు ఆకర్షణలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. తన భర్త, బిడ్డ బాగుండాలని రాత్రనక పగలనక కష్టపడే భర్తకు దక్కేది ఇదేనా? ఆస్తి కోసం లేదా అక్రమ సంబంధం కోసం కన్న బిడ్డ భవిష్యత్తును కూడా గాలికి వదిలేస్తున్నారు. కట్టుకున్న వాడే శత్రువుగా మారి నిద్రలోనే ప్రాణాలు తీస్తున్న పరిస్థితి నెలకొంది.
నిస్సహాయతలో భర్తలు
మరో 191 మంది భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు. భార్య వేధింపులు, అక్రమ సంబంధాల ఒత్తిడిని భరించలేక వారు తనువు చాలించారు. పెళ్లి చేసుకుంటే జీవితం సాఫీగా ఉంటుందనుకున్న భ్రమలు పటాపంచలవుతున్నాయి. పరువు పోతుందనో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని మగాడు మౌనంగా కుమిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ భర్తలకు భద్రత అనేదే ప్రశ్నార్థకంగా మారింది.
వ్యామోహంలో మహిళలు
సోషల్ మీడియా రీల్స్, చాటింగ్ యాప్స్ ద్వారా అపరిచితులతో ఏర్పడుతున్న సంబంధాలు పెళ్లి అనే వ్యవస్థను కుప్పకూల్చేస్తున్నాయి. బాధ్యత కంటే సోషల్ మీడియా, విలాసాలే ముఖ్యం అనుకుంటున్నారు. ఇంట్లో లక్ష్మి అని కొలిచే సంస్కృతి నుంచి ఆ లక్ష్మి వేషంలోనే మృత్యువు దాగుందని భయపడే స్థాయికి సమాజం దిగజారింది. పెళ్లి అంటేనే ఇప్పుడు ఒక రిస్క్ గా, డెత్ ట్రాప్ లా కనిపిస్తోంది.
అప్రమత్తత అవసరం
భర్తలు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందేనా? ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ పది సార్లు ఆలోచించాలి. ఎదుటి వ్యక్తి క్యారెక్టర్, ప్రవర్తన, సోషల్ మీడియా వాడకం గమనించాలి. కళ్ళు మూసుకుని ఎవరినీ నమ్మకూడదు. ఈ 592 మంది ప్రాణాలు కేవలం అంకెలు కావు, సమాజపు నైతిక పతనం. కుటుంబ విలువలు లేని వారు పెళ్లికి అనర్హులు అని తెలుసుకోవాలి.