- భారతదేశంలో బ్రిటన్ కార్ల పన్ను తగ్గింపు
- 110 శాతం నుంచి 30 శాతానికి సుంకం కోత
- 15 నుంచి అమలు… కోటా పద్ధతిలో కార్లు
- రూ. లక్షలు తగ్గనున్న జాగ్వార్, రేంజ్ రోవర్
- స్కాచ్ విస్కీపై సగం తగ్గిన దిగుమతి సుంకం
- జానీ వాకర్, ది మెకల్లన్, గ్లెన్‌ఫిడిచ్ ఇక చీప్
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకం మొదలైంది. భారత్, యూకే దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు తీపి కబురు అందించింది. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై దశాబ్దాలుగా ఉన్న భారీ పన్నుల భారం ఒక్కసారిగా తగ్గింది. ఇకపై సామాన్యుడికి చేరువలో విలాసవంతమైన కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పు భారతీయ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఆకాశం నుంచి భూమికి ధరలు
లగ్జరీ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఏకంగా 30 శాతానికి కుదించింది. ఈ నిర్ణయంతో జాగ్వార్, రేంజ్ రోవర్ వంటి బ్రాండ్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కొనుగోలుదారులు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. విలాసవంతమైన కారును సొంతం చేసుకోవాలనే కల ఇక సాకారం కానుంది.
కోటా పద్ధతితో నియంత్రణ
పన్ను తగ్గింపు అందరికీ అందుబాటులో ఉండదు. దీనిని ప్రభుత్వం కోటా పద్ధతిలో అమలు చేస్తోంది. మొదటి ఏడాదిలో కేవలం 20 వేల కార్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ప్రతి ఏటా ఈ కోటాను పెంచుకుంటూ ఐదేళ్లలో 37 వేల కార్లకు చేరుస్తారు. షోరూమ్‌లలో కొత్త ధరల పట్టికలు సిద్ధం కావడంతో కొనుగోలుదారులు వేగంగా స్పందించాల్సి ఉంటుంది.
శక్తివంతమైన ఇంజిన్లపై ప్రభావం
ఈ ఒప్పందం ప్రధానంగా శక్తివంతమైన వాహనాలపై ప్రభావం చూపుతుంది. 3000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు, 2500 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ కార్లకు ఇది వర్తిస్తుంది. లగ్జరీ ఎస్‌యూవీలను కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయం. తక్కువ పన్ను భారం వల్ల అత్యాధునిక ఫీచర్లు ఉన్న వాహనాలు తక్కువ ధరకే లభిస్తాయి.

విస్కీ ప్రియులకు విందు
విస్కీ ప్రియులకు సైతం ఈ ఒప్పందం కిక్కు ఇస్తోంది. స్కాచ్ విస్కీపై ఉన్న 150 శాతం దిగుమతి సుంకాన్ని 75 శాతానికి తగ్గించారు. రాబోయే పదేళ్ళలో ఇది 40 శాతానికి చేరుతుంది. ఇది కేవలం బ్రిటన్ తయారీ బాటిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. జానీ వాకర్, ది మెకల్లన్, గ్లెన్‌ఫిడిచ్ వంటి బ్రాండ్ల ధర తగ్గనున్నాయి. అయితే ఎక్సైజ్ పన్నులు యథాతథంగా ఉండటంతో సగం ధరకే బాటిల్ లభిస్తుందనేది అపోహ మాత్రమే.
ఐటీ నిపుణులకు ఆర్థిక భరోసా
యూకేలో పనిచేసే లక్షలాది మంది భారతీయులకు ఈ ఒప్పందం భారీ ఊరటనిచ్చింది. డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ద్వారా సోషల్ సెక్యూరిటీ పేరుతో జరిగే జీతంలో కోతకు తెరపడింది. ఇది ఐటీ నిపుణుల చేతికి అందే జీతాన్ని నెలకు 20 నుంచి 25 శాతం వరకు పెంచుతుంది. తద్వారా మన దేశంలోకి వచ్చే నగదు ప్రవాహం వేల కోట్ల రూపాయల్లో పెరిగే అవకాశం ఉంది.
స్వదేశీ పరిశ్రమల రక్షణ
విదేశీ వస్తువుల రాకతో పోటీ పెరిగినా దేశీయ పరిశ్రమలకు ముప్పు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాల ఉత్పత్తులు, చక్కెర, పప్పుధాన్యాల వంటి సున్నితమైన రంగాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. స్థానిక రైతులకు, చిరు వ్యాపారులకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విదేశీ పోటీని తట్టుకుని స్వదేశీ వస్తువుల నాణ్యతను పెంచుకోవడమే ఇప్పుడున్న లక్ష్యం.