సెకండ్ హ్యాండ్ సినిమా సేల్ – పాత సినిమాల విడుదలపై ప్రేక్షకుల అసహనం

  • మళ్లీ డబ్బు దండుకునేందుకు రీ-రిలీజ్ రచ్చ
  • ఓటీటీల్లో ఉండగా మళ్లీ థియేటర్లలో ఇదేంటి?
  • కొత్త సినిమాలు తీయడంలో బద్దకిస్తున్న వైనం
  • కొత్త వారికి అవకాశాలు కల్పించడంలో కుట్ర

సహనం వందే, హైదరాబాద్:
తెలుగు సినిమా రంగంలో రీ రిలీజ్ పరంపర ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ప్రేక్షకులను ఆకర్షించడం కాదు… అక్షరాలా దోచుకోవడమే! ఇప్పటికే ఓటీటీ వేదికల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న కమర్షియల్ మసాలా సినిమాలకు ప్రేక్షకుడు మళ్ళీ టికెట్ కొని థియేటర్లకు వెళ్లాల్సి రావడం ఏంటి? సందేశాత్మక చిత్రాలు కావు. సామాజిక సమస్యలపై తీసినవి కావు. కేవలం పాత ఫార్ములా సినిమాలు. కానీ డబ్బు ఆర్జనకు మాత్రం సినీ పెద్దలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. తాజాగా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో మళ్లీ విడుదల చేసి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇది కొత్త కథ కాదు, కొత్త సాంకేతికత కాదు, కానీ డబ్బు మాత్రం కొత్తగానే వస్తోంది. ఇక్కడ ప్రేక్షకుడిని దోచుకోవడం ఒక్కటే లక్ష్యంగా కనిపిస్తోంది.

కమర్షియల్ దిగ్గజాలకు కథలు కరువే?
ఒకప్పుడు తెలుగు సినిమా వైభవం అంటే ఏడాదికి పదుల సంఖ్యలో చిత్రాలు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి లాంటి దిగ్గజాలు సంవత్సరానికి నాలుగైదు నుంచి పది సినిమాలు తీసి రికార్డులు సృష్టించారు. ఆ రోజుల్లో టెక్నాలజీ పరిమితం… స్క్రీన్ల సంఖ్య తక్కువ. అయినా కొత్త కథలకు కొరత లేదు. హీరోలు సాహసాలు చేశారు. ఇప్పుడేమో సాంకేతికత అందుబాటులో ఉంది. వందలాది స్క్రీన్లు సిద్ధంగా ఉన్నాయి. నటీనటుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ కొత్త కథలు మాత్రం అడుగంటాయి. పెద్ద నటులు ఏడాదికి ఒకటో రెండో సినిమాలకే పరిమితమవుతున్నారు. సృజనాత్మకత పడిపోయి కొత్త కథలు రాసే చేవ లేక పాత సినిమాలను దుమ్ము దులిపి మళ్లీ ప్రేక్షకుడిపైకి నెడుతున్నారు. పెద్ద హీరోల బద్ధకానికి… స్క్రిప్టు కొరతకు రీ రిలీజ్‌లు ఒక కవచంగా మారాయి.

పాత సినిమాలను మళ్లీ అమ్మడం
బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ విషయంలో తొలి రోజే రూ. 18 కోట్ల స్థూల వసూళ్లు సాధించడం నిజంగా వ్యాపార విజయం. రీ రిలీజ్ చిత్రాల్లో ఇంత భారీ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. గతంలో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ 8 కోట్లు, మహేష్ బాబు బిజినెస్‌మెన్ 5.27 కోట్లు, మురారి 5 కోట్లు వసూలు చేశాయి. ఈ రికార్డులన్నీ బాహుబలి ఒక్క రోజులోనే బద్దలు కొట్టింది. ఇది సినిమా పరిశ్రమ పెద్దలకు ఒక కొత్త వ్యాపార మార్గాన్ని చూపించింది. ఈ వసూళ్ల వెనుక ప్రేక్షకుడి జ్ఞాపకాలు, ఉత్సాహం ఉన్న మాట వాస్తవమే. కానీ దశాబ్దాల కిందటి పాత ఉత్పత్తిని మళ్లీ అమ్మి సొమ్ము చేసుకోవడం సృజనాత్మకతకు సిగ్గుచేటు. ఇది వ్యాపారంగా విజయమే తప్ప కళాత్మకంగా పతనం.

కొత్త వారికి అన్యాయం…
స్క్రీన్ల సంఖ్య వేలల్లో పెరిగింది. కానీ వాటిపై ఆడే పెద్ద స్టార్ల సినిమాలు మాత్రం పడిపోయాయి. దీనికి రీ రిలీజ్ చిత్రాలు అదనపు శాపంలా తగిలాయి. కొత్త దర్శకులు, కొత్త కథలు చెప్పాలని ప్రయత్నిస్తున్నా వారికి స్క్రీన్లు దొరకడం లేదు. రీ రిలీజ్ చిత్రాలు ప్రధాన స్క్రీన్లను ఆక్రమించడంతో కొత్త చిన్న సినిమాలు, విభిన్న కథాంశాలు ప్రేక్షకుడికి చేరువయ్యే అవకాశాన్ని కోల్పోతున్నాయి. ఉదాహరణకు రవితేజ నటించిన మాస్ జాతర సినిమాకు బాహుబలి ఎఫెక్ట్ చూపింది. తెలుగు సినిమా భవిష్యత్తుకు ఇది ఏ మాత్రం మంచిది కాదు. పాత జ్ఞాపకాలపై ఆధారపడి వ్యాపారం చేయడం అంటే కొత్త తరాన్ని, వారి సృజనాత్మకతను నిరుత్సాహపరచడమే. ఇది సినిమా పరిశ్రమ పెద్దలు తీసుకుంటున్న పిచ్చి నిర్ణయంగానే భావించాలి.

సాహసం చేయండి పెద్దలారా…
బాహుబలి లాంటి సినిమా కూడా ఒకప్పుడు భారీ బడ్జెట్‌తో… కొత్త సాంకేతికతతో సాహసం చేస్తేనే సాధ్యమైంది. అప్పటి సాహసాన్ని, రిస్క్‌ను ఇప్పుడు పెద్ద హీరోలు, దర్శకులు వదిలేశారు. పాత సినిమాలను మళ్లీ అమ్మి డబ్బు సంపాదించుకోవడం సులభమైన మార్గం. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ప్రేక్షకులు కొత్త కథలు, కొత్త హీరోలు, కొత్త సాహసాలు కోరుకుంటున్నారు. దిగ్గజాలు మాత్రం సురక్షితమైన మార్గంలో, పాత సినిమాలపై ఆధారపడుతూ బద్ధకాన్ని పెంచుకుంటున్నారు. ఈ రీ రిలీజ్ సంస్కృతిని వెంటనే ఆపి కొత్త కథలకు, కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి. లేకపోతే తెలుగు సినిమా పరిశ్రమ పాత జ్ఞాపకాల ఊబిలోనే కూరుకుపోతుంది. కొత్త భవిష్యత్తుకు మార్గం ఉండదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *