సీబీఐ వలలో జేఎన్టీయూ – కోట్ల కుంభకోణం… ఉలిక్కిపడిన యూనివర్సిటీ

JNTU Former Registrar Scams
  • గత రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు
  • నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇచ్చినట్లు ఫిర్యాదు
  • ప్రభుత్వ ప్రాజెక్ట్ నిధులను దారి మళ్లించారని విమర్శలు
  • తప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లతో కోట్ల దందా
  • స్వతంత్ర దర్యాప్తు కోసం పలువురి డిమాండ్
  • గవర్నర్, ముఖ్యమంత్రులకూ ఫిర్యాదు

సహనం వందే, హైదరాబాద్:

రాష్ట్రంలో పేరుమోసిన ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థ హైదరాబాద్ జేఎన్టీయూలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. యూనివర్సిటీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను ఉల్లంఘనలు, పరిపాలనాపరమైన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు అందింది. కె.పి. భాగ్య వెంకట కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదును నేరుగా ఢిల్లీలోని సీబీఐకి సమర్పించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ప్రమోషన్లలో నిబంధనల ఉల్లంఘన
యూనివర్సిటీలో జరిగిన ఈ కుంభకోణంలో ప్రధానంగా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) ప్రమోషన్లలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో రిజిస్ట్రార్‌గా పనిచేసిన కె.వెంకటేశ్వరరావు హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి కొందరికి ప్రమోషన్లు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వులను, యూనివర్సిటీ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ప్రొఫెసర్ హోదాలు పొందారని, చివరకు రిజిస్ట్రారే స్వయంగా ప్రొఫెసర్ పదవిని పొందడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆడిట్ ద్వారా వెల్లడైంది.

CBI Enquiry on JNTU

పరీక్షల విభాగంలో ఆడిట్ అభ్యంతరాలు
పదవుల దుర్వినియోగానికి సంబంధించి పరీక్షల విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలోనూ తీవ్రమైన ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నట్లు స్థానిక ఫండ్ ఆడిట్ తేల్చింది. ఈ వ్యవహారంలో ఆ వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు, కమర్షియల్ ప్రాపర్టీలను కూడబెట్టారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఆయన వద్ద ఉన్న ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని ఫిర్యాదుదారుడు కోరారు.

అధికారాల దుర్వినియోగం…
యూనివర్సిటీ సర్వీస్ నిబంధనలలోని రూల్ 37 ప్రకారం విద్యాసంస్థల పాలన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం నిబంధనలను లెక్కచేయకుండా కేవలం యూనివర్సిటీ స్వయంప్రతిపత్తిని అడ్డుపెట్టుకుని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల విశ్వవిద్యాలయ వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. పరిపాలనాపరమైన ఈ అక్రమాలపై ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ వెంటనే స్పందించి నిష్పాక్షపక్ష విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పరిశోధన నిధుల మళ్ళింపు
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈ, డీఎస్‌టీ ఎస్‌ఈఆర్‌బీ వంటి సంస్థల నుంచి రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు వస్తుంటాయి. అయితే జేఎన్టీయూహెచ్‌లో ఈ పరిశోధన ప్రాజెక్టుల నిధుల ఖర్చులో తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అకౌంటెంట్ జనరల్, లోకల్ ఫండ్ ఆడిట్ బృందాలు ల్యాబ్ పరికరాలు, ప్రాజెక్ట్ ఆస్తులను పరిశీలించడానికి వెళ్లినప్పుడు కొందరు అధికారులు తీవ్ర అడ్డంకులు సృష్టించారు. తనిఖీలను కావాలనే ఆలస్యం చేయడం లేదా అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడ్డారని ఆడిట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

తప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు
రికార్డులలో చూపించిన ల్యాబ్ పరికరాలు క్షేత్రస్థాయిలో అసలు కొనుగోలు చేయనేలేదని ఆడిట్‌లో బయటపడింది. ప్రభుత్వ ఏజెన్సీలకు సమర్పించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అన్నీ పూర్తిగా తప్పుడు సమాచారంతో కూడినవని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిధులు దుర్వినియోగం కాలేదని నమ్మించడానికి తప్పుడు పత్రాలను సృష్టించి ప్రభుత్వానికి సమర్పించారని ఫిర్యాదులో వివరించారు. ఈ రికార్డులను పరిశీలించి తప్పుడు సర్టిఫికెట్లకు క్లియరెన్స్ ఇచ్చిన వారిలో కొందరు రిటైర్డ్ ఫైనాన్స్ అధికారులు కూడా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఒక ఫైనాన్స్ అధికారిపై సొంత చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని సమాచారం. పలు సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని కీలకమైన ఫైనాన్స్ అధికారి పదవిలో కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చర్యల కోసం అధికారులకు విజ్ఞప్తి
ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కూడా రంగంలోకి దించాలని కోరారు. జీఎస్టీ నిబంధనల ఉల్లంఘనలు, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఫైళ్లు, విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేసి తప్పు చేసిన వారిపై క్రిమినల్, సివిల్, డిపార్ట్‌మెంటల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ప్రతులను ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యాలయం, ఏజీ ఆడిట్ డైరెక్టర్, ఏసీబీ కమిషనర్‌లకు అందజేశారు. ఉన్నత విద్యాలయాలను భ్రష్టుపట్టిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ఈ ఘటనపై రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *