- బ్యాంకుల నిరాదరణ… పడిపోయిన విద్యా రుణాలు
- ఆకాశాన్నంటుతున్న ఫీజులు… విలవిల్లాడుతున్న మధ్యతరగతి
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతికర నివేదిక
సహనం వందే, హైదరాబాద్:
మన దేశంలో ఉన్నత చదువులు చదవాలనుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం శరాఘాతంగా మారుతోంది. ఒకప్పుడు పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకులపై ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ గత పదేళ్ల కాలంలో విద్యా రుణాల సరళి పూర్తిగా మారిపోయింది. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల మోత తట్టుకోలేక, బ్యాంకుల్లో అప్పులు పుట్టక అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన నికర రుణాల గణాంకాలు ఈ విషాదకర నిజాలను స్పష్టం చేస్తున్నాయి.
భారీగా పడిపోయిన లబ్ధిదారులు
ఆర్బీఐకి చెందిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల డేటా ప్రకారం దేశంలో విద్యా రుణాలు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2016 జూన్ నాటికి దేశవ్యాప్తంగా 25.76 లక్షల విద్యా రుణ ఖాతాలు నమోదు కాగా, 2026 జూన్ నాటికి ఆ సంఖ్య 21.84 లక్షలకు పడిపోయింది. అంటే ఈ దశాబ్ద కాలంలో లోన్ ఖాతాల సంఖ్య 15.2 శాతం క్షీణించింది. విద్యార్థులకు రుణాలు అందజేయడంలో బ్యాంకింగ్ రంగం ఎంతటి నిరాదరణ చూపుతుందో ఈ నివేదిక తెలియజేస్తోంది.
మూడు రెట్లు పెరిగిన రుణ భారం
రుణ గ్రహీతల సంఖ్య తగ్గినప్పటికీ, లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరిపై పడే సగటు అప్పు భారం మాత్రం విపరీతంగా పెరిగింది. 2016 జూన్లో ప్రతి విద్యా రుణ ఖాతాపై సగటు బకాయి ₹2.60 లక్షలుగా ఉండగా, 2026 జూన్ నాటికి అది ₹7.25 లక్షలకు ఎగిసిపడింది. అంటే 10 ఏళ్లలో సగటు అప్పు భారం ఏకంగా 178.2 శాతం పెరిగింది. లబ్ధిదారుల సంఖ్య తగ్గినప్పటికీ, చదువుకోవడానికి లోన్ పొందిన అతికొద్ది మంది విద్యార్థులు తీవ్రమైన అప్పుల ఊబిలోకి వెళుతున్నారు.
ఫీజుల మోత… కఠిన నిబంధనలు
ఈ పరిస్థితిపై ‘పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్, విమెన్, చిల్డ్రన్, యూత్ అండ్ స్పోర్ట్స్’ తమ 372వ నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తపరిచింది. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ కోర్సులకు కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఫీజులను విపరీతంగా పెంచేయడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు బ్యాంకులు పూచీకత్తులు, ఆస్తుల గ్యారెంటీ పేరిట కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. పేద విద్యార్థులు ఈ షరతులను నెరవేర్చలేక, ఆర్థిక స్థోమత లేక ప్రతిభ ఉన్నప్పటికీ చదువుకు దూరం కావాల్సి వస్తోంది.
సంపన్నులకే చదువులు
మరోవైపు డిగ్రీలు పూర్తయినా సరైన ఉద్యోగాలు లభించకపోవడం, తలపై భారీ అప్పుల భారం మిగిలిపోతుండటంతో యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఫీజుల నియంత్రణ లేకపోవడం, బ్యాంకింగ్ షరతులు కఠినతరం కావడంతో విద్య అనేది పేదలకు దూరమై కేవలం సంపన్నులకే అందుబాటులో ఉండే ఖరీదైన సరుకుగా మారుతోంది. ప్రభుత్వాలు, బ్యాంకింగ్ రంగాలు తక్షణమే స్పందించి రుణ నిబంధనలను సరళతరం చేయకపోతే, సమాజంలో విద్యా అసమానతలు మరిన్ని దారుణ పరిస్థితులకు దారితీసే ప్రమాదముంది.