ఆపరేషన్లంటే డాక్టర్ల పరేషాన్ – సర్జరీ కోర్సులు అంటే విద్యార్థుల్లో వణుకు

Doctors Vs Operations
  • కత్తి పట్టాలంటే వణుకుతున్న చేతులు
  • ఆపరేషన్ వికటిస్తే… చనిపోతే పట్టించుకునే నాధుడెవరు?
  • జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెర్మటాలజీ వైపు మొగ్గు
  • నీట్ పీజీ కౌన్సిలింగ్ లో వింత ధోరణులు
  • సర్జరీ వైపు తగ్గిన ఆసక్తి… వైద్య రంగంలో మారుతున్న ట్రెండ్
  • యువ డాక్టర్ల కొత్త జీవన విధానం…
  • భవిష్యత్తులో సర్జన్ల కొరత

సహనం వందే, హైదరాబాద్:

వైద్య వృత్తి అంటేనే నిస్వార్థ సేవకు, ప్రాణాలు కాపాడే సాహసానికి ప్రతీక. అర్ధరాత్రి ఒంటి గంటయినా, రెండు గంటలైనా ప్రాణాలతో కొట్టుమిట్టాడే రోగిని బతికించడానికి డాక్టర్లు పరుగులు పెడుతుంటారు. కానీ అలాంటి డాక్టర్లే ఇప్పుడు కెరీర్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నమ్మగలరా? తాజాగా నీట్ పీజీ మొదటి కౌన్సిలింగ్‌కు సంబంధించి వెలువడిన టాప్ 100 ఛాయిస్‌ల గణాంకాలు వైద్య రంగంలో ఒక సంచలన మార్పును కళ్లకు కడుతున్నాయి. టాపర్లు అందరూ సర్జరీల వైపు వెళ్లడం మానేసి వేరే దారి చూసుకుంటున్నారు. అసలు డాక్టర్లకు ఏమైంది? వారు ఎందుకు భయపడుతున్నారు? దీనివల్ల మనకు రాబోయే ప్రమాదం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కత్తి పట్టాలంటే వణుకుతున్న చేతులు
డాక్టర్ ఎలా తయారవుతాడు? ఎంతో కష్టపడి చదివి, నీట్-పీజీ పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్‌ను ఎంచుకుంటారు. తాజాగా నీట్ పీజీ మొదటి కౌన్సిలింగ్‌కు సంబంధించి వచ్చిన టాప్ 100 ఛాయిస్‌ల గణాంకాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 52 మంది మెడిసిన్‌ను ఎంచుకోగా, 23 మంది రేడియాలజీ వైపు, 11 మంది డెర్మటాలజీ వైపు మొగ్గు చూపారు. సర్జరీ వైపు వెళ్లేవారి సంఖ్య భారీగా తగ్గిపోవడం వైద్య రంగంలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

ఆపరేషన్ వికటిస్తే… రోగి చనిపోతే?
అసలు ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటో సామాన్యులు కూడా ఆలోచించాలి. కేవలం పాషన్, డబ్బు, లగ్జరీ లైఫ్‌స్టైల్, సూపర్‌స్పెషలైజేషన్ మాత్రమే కాదు… ఈరోజు ఒక యువ డాక్టర్ ఏమని ఆలోచిస్తున్నాడంటే… ’నేను రాత్రి రెండు గంటలైనా సరే రోగి ప్రాణాలు కాపాడటానికి సిద్ధమే, కానీ ఆపరేషన్ వికటిస్తే లేదా రోగి చనిపోతే నాకు రక్షణ ఎవరు ఇస్తారు?’ అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ఒక్క భయమే ఈరోజు వైద్య రంగంలో పెను మార్పులకు కారణమవుతోంది.

సర్జరీ వెనుక ఉన్న కఠిన వాస్తవాలు
సర్జరీ అనగానే మనకు కత్తి పట్టుకుని ప్రాణాలు కాపాడే దృశ్యం గుర్తుకొస్తుంది. కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఎవరైనా ఆలోచించారా? సంవత్సరాల తరబడి సాగే కఠినమైన శిక్షణ, నిద్రలేని రాత్రులు, కంటి మీద కునుకు లేని డ్యూటీలు ఉంటాయి. వీటికి తోడు కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే, ఆసుపత్రిలో అడుగుపెట్టిన క్షణం నుంచి మొదలయ్యే మానసిక వేధింపులు ఆ యువ డాక్టర్లను కుంగదీస్తున్నాయి.

చట్టపరమైన త్తిళ్ళు… భద్రతా సమస్యలు
అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు డాక్టర్లను భయపెడుతున్న ప్రధాన సమస్య చట్టపరమైన ఒత్తిళ్లు. ఆపరేషన్ టేబుల్ మీద డాక్టర్ తన సర్వశక్తులు ఒడ్డుతాడు…. ప్రాణం పోయాలని ప్రయత్నిస్తాడు. కానీ కొన్నిసార్లు మన చేతుల్లో ఏదీ ఉండదు, ప్రాణం పోతుంది. అలా జరిగిన ప్రతిసారీ, డాక్టరే తప్పు చేశాడని దాడులు చేయడం ఈరోజు సాధారణమైపోయింది. రక్షణ లేని ఆ వాతావరణంలో ఎవరైనా సరే రిస్క్ తీసుకుని సర్జరీ చేయడానికి ముందుకు వస్తారా? వైద్య రంగం అనేది ఏమాత్రం కంఫర్ట్ ఉండే జాబ్ కాదు. ఇది క్షణక్షణమూ టెన్షన్‌తో కూడుకున్న బాధ్యతాయుతమైన ప్రయాణం. కానీ ప్రతి విషమ పరిస్థితిని ఒక క్రిమినల్ నేరంగా చూడడం సరైన పద్ధతా? ఒక మనిషి చనిపోతే దాన్ని వైద్యుడి హత్యగా చిత్రీకరించే ధోరణి పెరిగిపోయింది. ఇలాంటి వాతావరణం ఉంటే ఏ యువ డాక్టర్ కూడా కత్తి పట్టుకోవడానికి సాహసించలేడు.

మెడిసిన్, రేడియాలజీల వైపు మొగ్గు
అందుకే టాపర్లు అందరూ ఆ రిస్క్ ఉండే సర్జికల్ విభాగాలను పక్కన పెడుతున్నారు. దానివల్ల ఇప్పుడు మెడిసిన్, రేడియాలజీ వంటి విభాగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సర్జరీతో పోలిస్తే అక్కడ ఒత్తిడి తక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. కానీ ఇది కేవలం డాక్టర్ల సమస్య మాత్రమే కాదు, రేపు పొద్దున మన కుటుంబంలో ఎవరికైనా అత్యవసర ఆపరేషన్ వస్తే పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాలి.మఎం డాక్టర్ తయారవడానికి పది ఏళ్ల చదువు, కఠినమైన శ్రమ ఉంటాయి. అలాంటి ప్రతిభావంతులను మనం గౌరవించగౌరవించుకోవాలి. వైద్యుడిని అనుమానిస్తూ, ప్రతిసారీ నేరస్తుడిలా చూసే సంస్కృతి మారాలి. అప్పుడే ఆపరేషన్ థియేటర్లలో మళ్లీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. లేదంటే ప్రాణాలు కాపాడే చేతులే భయంతో వణికిపోయి వెనకడుగు వేసే పరిస్థితి వస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *