- ప్రయాణికులకు అనుకూల తీర్పు
సహనం వందే, హైదరాబాద్:
ఎప్పుడైనా అనుకోకుండా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారా? అయితే ఈ వార్త కచ్చితంగా మీకోసమే! క్యాన్సిలేషన్ చార్జీల పేరుతో సగం డబ్బులు గుంజడమే కాకుండా, మనం చెల్లించిన జీఎస్టీని కూడా ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటివరకు తమ జేబులో వేసుకునేవి. కానీ ఇకపై ఆ దందాలకు చెక్ పడనుంది.
కొర్రీలకు చెక్ పెట్టిన తీర్పు
విమాన టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనం చెల్లించిన జీఎస్టీ ట్యాక్స్ డబ్బులు మళ్లీ మనకు తిరిగొస్తాయా లేదా అన్న సందేహాలకు జీఎస్టీ అప్పెలేట్ ట్రిబ్యునల్ స్వస్తి చెప్పింది. ప్రయాణికులకు టికెట్ రద్దు మొత్తంతో పాటు పన్ను డబ్బులను కూడా పూర్తి స్థాయిలో వాపస్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. అలా ప్రయాణికులకు వాపస్ ఇచ్చిన పన్ను మొత్తాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందవచ్చని స్పష్టం చేసింది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉదాహరణ
ఈ వ్యవహారంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉదాహరణే కీలకమైనది. ఆ సంస్థకు సంబంధించిన ఒక కేసును పరిశీలించిన జీఎస్టీ అప్పెలేట్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు ఇచ్చింది. టికెట్లు రద్దు చేసుకున్న వారికి చట్టప్రకారం చెల్లించాల్సిన డబ్బులను వెనక్కి ఇచ్చినందున, పన్ను శాఖ నుంచి జీఎస్టీ వాపస్ పొందడానికి ఆ సంస్థ అర్హులని తేల్చిచెప్పింది. ఇది దేశంలోని మిగతా విమానయాన సంస్థలకు కూడా కనువిప్పు లాంటిది.
45 లక్షలకు పైగా వాపస్
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందాల్సిన దాదాపు 45 లక్షల 92 వేల రూపాయల జీఎస్టీ మొత్తాన్ని, దానికి తగిన వడ్డీతో సహా వెంటనే తిరిగి చెల్లించాలని పన్ను శాఖను ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నప్పుడు డబ్బులు పోతాయని టెన్షన్ పడాల్సిన అవసరం ఇకపై ఉండదు. మనం చెల్లించిన పన్నులు కూడా తిరిగి మన జేబులోకి వచ్చేలా ఈ తీర్పు మార్గం సుగమం చేసింది.
పారదర్శకత వైపు అడుగులు
అన్ని ప్రధాన విమానయాన సంస్థలు తమ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మళ్లీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా సంస్థలు పన్ను వాపసు ఇవ్వడానికి తిరస్కరిస్తే, ప్రయాణికులు ఈ తీర్పు ఆధారంగా లీగల్‌గా పోరాడవచ్చు. ఇది వినియోగదారుల హక్కుల పరిరక్షణలో మరో అడుగు ముందుకు పడినట్టే.