- ఫీ-ఫర్-సర్వీస్ వైద్యంలో వ్యాపార ధోరణి
- అవసరం లేని పరీక్షలు, అనవసర మందులు
- స్క్రీనింగ్ పరీక్షల పేరిట ఆసుపత్రుల దోపిడీ
- ఇన్సూరెన్స్ పేరిట అనవసర ఆపరేషన్లు
- స్పెషలిస్టుల వైఖరితో వైద్యం ముక్కలు
- ‘పిల్-ఫ్రీ’ పుస్తకంలో భయంకర నిజాలు
- ప్రపంచవ్యాప్తంగా ‘చూజింగ్ వైజ్లీ’ ఉద్యమం
సహనం వందే, హైదరాబాద్:
చిన్న తలనొప్పితో ఆస్పత్రికి వెళ్తే పది రకాల టెస్టులు రాసి, ల్యాబ్ రిపోర్టులతో భయపెట్టి గుప్పెడు మందులు మింగిస్తున్నారు. మన దేశంలో రోగం తగ్గడం కంటే జేబులు, శరీరాలు గుల్ల కావడమే ఎక్కువవుతోంది. డాక్టర్ చంద్రకాంత్ లాహరియా రాసిన ‘పిల్-ఫ్రీ’ పుస్తకం భారతదేశంలో జరుగుతున్న ఓవర్ట్రీట్మెంట్, ఓవర్మెడికేషన్ను బట్టబయలు చేసింది. ఆధునిక వైద్యంలో అత్యాధునిక స్కానింగ్‌లు వచ్చినప్పటికీ, అదే స్థాయిలో పరిమితికి మించిన చికిత్సలు పెరిగాయి.
హెల్త్ చెకప్‌ల తప్పుడు రిపోర్టులు
అనవసర వైద్యానికి ప్రధాన కారణం హెల్త్ చెకప్‌ల పేరిట జరిపే స్క్రీనింగ్ పరీక్షలే. నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం… సాధారణ చెకప్ ప్యాకేజీలలో చేసే అనవసర పరీక్షల వల్ల తప్పుడు పాజిటివ్ రిపోర్టులు వచ్చి రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాంతో మరిన్ని ఫాలోఅప్ పరీక్షలు చేయడం, అవసరం లేని చికిత్సలు ప్రారంభించడం ఒక అలవాటుగా మారింది. నిజంగా టెస్ట్ అవసరమా అని ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది.
ముక్కలై విడిపోతున్న వైద్య విధానం…
వైద్య రంగంలో స్పెషలిస్టులపై అమితంగా ఆధారపడటం మరొక సమస్య. చిన్న అనారోగ్యం వచ్చినా నేరుగా స్పెషలిస్ట్ దగ్గరకే వెళ్తుండటంతో దీర్ఘకాలిక రోగులు వేర్వేరు శరీర భాగాల కోసం వేర్వేరు డాక్టర్లను సంప్రదించాల్సి వస్తోంది. ఆయా వైద్యులు తమ విభాగానికే చికిత్స చేస్తారు తప్ప శరీరం మొత్తాన్ని ఒకేలా పరిగణించరు. దీనివల్ల సమగ్ర చికిత్స అందకుండా వైద్యం ముక్కలవుతోంది.
వృద్ధులపై పడుతున్న తీవ్ర ప్రభావం
ఈ పరిణామాలు వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2021, 2025లలో వచ్చిన అధ్యయనాల ప్రకారం… మన దేశంలో దాదాపు 49 శాతం మంది వృద్ధులు ప్రతిరోజూ ఐదు లేదా అంతకంటే ఎక్కువ రకాల మందులు వాడుతున్నారు. వీరిలో 28 శాతం కేసుల్లో వారికి అనవసరమైన మందులు ఇస్తున్నట్లు తేలింది. కాబట్టి ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా తమ మందుల ప్రిస్క్రిప్షన్‌ను డాక్టర్‌తో సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాపారమయంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్
వైద్య రంగం వ్యాపారమయంగా మారడంతో లాబొరేటరీ టెస్టులు, స్కానింగ్‌లు, ఆపరేషన్లు వస్తువులుగా మారాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు కడతాయి కదా అని ఆస్పత్రులు భారీ ఖర్చుతో కూడిన వైద్యం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించినా అనవసర చికిత్స వల్ల నష్టపోయేది రోగి శరీరమే అని గ్రహించాలి. వైద్యులలో పెరుగుతున్న భయం, పొరపాటు జరిగే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో అదనపు టెస్టులు రాయడానికి కారణమవుతోంది.
రోగులలో అవగాహన ప్రాముఖ్యత
ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా 70 స్పెషాలిటీ సొసైటీలు కలిసి ‘చూజింగ్ వైజ్లీ’ అనే ఉద్యమాన్ని ప్రారంభించి అనవసర చికిత్సలను గుర్తించాయి. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ప్రతి ప్రిస్క్రిప్షన్పై సమీక్షించే తేదీ, మందులు ఎప్పుడు ఆపాలో స్పష్టంగా రాయించుకోవాలి. రోగి కూడా ఏ చికిత్సకైనా ముందే ఈ టెస్ట్ ఎందుకు అవసరం, లాభనష్టాలు ఏమిటి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని ప్రశ్నించాలి. ఏది అవసరమో తెలుసుకోవడమే నిజమైన అవగాహన.