- 9 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు
- అనేక కాలేజీలలో కుల ప్రాతిపదికన వివక్ష
- చదువుల ఒత్తిడిలో నలిగిపోతున్న జెన్ జెడ్
సహనం వందే, న్యూఢిల్లీ:
ఒక్క మార్కు తగ్గితేనే జీవితం అయిపోయిందనుకునే రోజులివి. అలాంటిది దేశంలోని అత్యున్నత కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు మానసికంగా ఎలాంటి నరకం అనుభవిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? చదువుకోవాల్సిన వయసులో భావి భారత పౌరులుగా ఎదగాల్సిన సమయాన వారిలో తీవ్ర మానసిక వేదన కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారో తెలిస్తే నిజంగా గుండె పగిలిపోతుంది.
సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ అధ్యయనం
ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఈమధ్యకాలంలో బాగా ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు, విద్యార్థుల మానసిక పరిస్థితిపై లోతైన పరిశోధన చేసేందుకు ఒక ప్రత్యేక ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా బయటకు వచ్చిన గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. మన విద్యావ్యవస్థలో దాగి ఉన్న ప్రమాదకరమైన కోణాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది.

అలముకుంటున్న డిప్రెషన్
ఈ సర్వే వివరాల ప్రకారం… ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారిలో దాదాపు 15 శాతం మంది గడిచిన ఆరు నెలల కాలంలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురయ్యారు. తమను తాము సంబాళించుకోలేని రీతిలో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లు స్వయంగా వెల్లడించారు. క్లాస్‌రూమ్‌లు, ల్యాబ్‌లు, హాస్టల్ గదుల మధ్య నలిగిపోతూ తమ మనసులోని బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు.
ఆత్మహత్య ఆలోచనలు
దీనికంటే భయంకరమైన నిజం మరొకటి ఉంది. పాల్గొన్న వారిలో ఏకంగా 9 శాతం మంది తీవ్రమైన ఆత్మహత్య ఆలోచనలతో బాధపడినట్లు తేలింది. అంటే మనం చూస్తున్న ప్రతీ వంద మందిలో తొమ్మిది మంది జీవితాన్ని చాలించాలనే ఆలోచనతో నలిగిపోతున్నారు. గొప్ప స్థాయికి వెళ్లాల్సిన వయసులో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనే ఆలోచనలు రావడానికి క్యాంపస్‌లలోని ప్రతికూల వాతావరణమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రీమియర్ సంస్థల్లో వరుస విషాదాలు
ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వరుసగా చోటుచేసుకున్న ఆత్మహత్యల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం స్వయంగా జోక్యం చేసుకుని మూల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.
క్యాంపస్‌లలో వివక్ష, కౌన్సెలింగ్ లోపం
క్యాంపస్‌లలో కేవలం చదువుల ఒత్తిడి మాత్రమే కాదు… కుల, సామాజిక ప్రాతిపదికన జరిగే వివక్ష, తోటి వారి నుండి వచ్చే ఒత్తిడి, ఒంటరితనం కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం కోసం ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియడం లేదు. దాదాపు 32 శాతం విద్యార్థులకు కాలేజీల్లో కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో లేవని తేలింది. ఒత్తిడికి గురైతే సమస్యను చెప్పుకునే వ్యవస్థలు సరిగా పని చేయకపోవడం వల్ల లోలోపలే కుమిలిపోతూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తల్లిదండ్రుల ధోరణి…
మన సమాజంలో మానసిక ఆరోగ్యం అంటే ఇప్పటికీ ఒక అపవాదుగానే మిగిలిపోయింది. మానసిక ఒత్తిడి ఉందంటే బలహీనుడిగా ముద్ర వేస్తారనే భయంతో బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ర్యాంకులు, ఉద్యోగాల గురించే ఆలోచిస్తున్నారు తప్ప పిల్లల మానసిక స్థితిని పట్టించుకోవడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్గదర్శకాల దిశగా కమిటీ…
ఈ కమిటీ త్వరలోనే తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. దీని ఆధారంగా విద్యాసంస్థలకు రాబోయే రోజుల్లో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉంది. క్యాంపస్‌లలో మెంటల్ హెల్త్ సెంటర్లను తప్పనిసరి చేయడం, కౌన్సెలర్లను నియమించడం లాంటి కీలక చర్యలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించలేవు. విద్యావ్యవస్థ అంటే కేవలం సిలబస్ పూర్తి చేయడం కాదని, ఒక మనిషిని సన్మార్గంలో నడిపించే వాతావరణాన్ని కల్పించడమని గుర్తిస్తేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. చదువుల ఒత్తిడిలో నలిగిపోతున్న పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలపైనే ఉంది. ప్రాణం కంటే ఏ పరీక్షా పెద్దది కాదని విద్యార్థులు గ్రహించాలి.
మార్పు రావాల్సిన సమయం
పిల్లలను ర్యాంకుల వెనుక పరిగెత్తించే క్రమంలో వారి నవ్వులను, ప్రశాంతతను మనం బలి తీసుకుంటున్నామా అనే ప్రశ్న ఈ నివేదిక చూశాక ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. చదువు ప్రాణం తీసేదిగా కాక, ప్రాణం పోసేదిగా ఉండాలి.