- కార్పొరేట్ ఉద్యోగాలకు దీటుగా వేతనాలు
- దేశ జీడీపీకి ఏకంగా 18 వేల కోట్ల ఆదాయం
- కేవలం హాబీ కాదు… ఇది ఏకంగా పెద్ద కెరీర్
- కాలక్షేపం నుండి కోట్లు కురిపించే ఇండస్ట్రీ
- యూట్యూబ్ ఇండియా ఇంపాక్ట్ రిపోర్ట్ వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
ఒకప్పుడు యూట్యూబ్ అంటే కేవలం వీడియోలు చూసి టైమ్ పాస్ చేసే యాప్ మాత్రమే అనుకునేవాళ్లం. చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఏదేదో వీడియోలు తీస్తే ఏమొస్తుందిలే అని నవ్వుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే వేదిక ఎంతోమంది జీవితాలను మార్చేస్తూ కోట్లకు పడగలెత్తేలా చేస్తోంది. యూట్యూబ్ ఇప్పుడు ఒక చిన్న యాప్ కాదు… మన దేశ ఆర్థిక వ్యవస్థనే పరుగులు పెట్టించే ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది.
లక్షలాది మందికి ఉద్యోగాలు…
ఈ మధ్యే వెలువడిన ‘యూట్యూబ్ ఇండియా ఇంపాక్ట్ రిపోర్ట్ 2025’ లోని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. క్రియేటర్ల కష్టం వల్ల మన దేశ జీడీపీకి ఏకంగా 18 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరింది. ఆర్థిక వ్యవస్థకు ఈ స్థాయిలో ఉపయోగపడుతుందంటే, మన క్రియేటర్లు ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దేశానికి ఆదాయంతో పాటు నిరుద్యోగులకు ఇది పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం మన దేశంలో దాదాపు 10 లక్షల మందికి దీని ద్వారా ఫుల్ టైమ్ ఉద్యోగాలు లభించాయి. ఒక పెద్ద ఐటీ కంపెనీ లేదా ఫ్యాక్టరీలో పని చేసినట్లే వీళ్లు పూర్తిగా దీన్నే నమ్ముకుని బతుకుతున్నారు. అంతేకాకుండా కెమెరామెన్లు, ఎడిటర్లు, లైట్ బాయ్స్ వంటి మరో 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది. కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా లభించని వేతనాలు నేడు క్రియేటర్లు సంపాదిస్తున్నారు.
బిజినెస్ సామ్రాజ్యాలుగా అవతారం…
ఇప్పుడు యూట్యూబర్లు అంటే సామాన్యులు కాదు. సెల్ఫీ స్టిక్ పట్టుకుని తిరిగేవాళ్లు సైతం పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగా మారిపోయారు. ఉదాహరణకు, ‘సింపుల్ ఘర్’ అనే ఛానెల్ 2022లో ఒక చిన్న గదిలో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈరోజు వారి కింద 35 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పైగా 7 వేర్వేరు భాషల్లో కంటెంట్ అందిస్తున్నారు. ఇలాంటి సక్సెస్ స్టోరీలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. చాలామంది యూట్యూబ్ ను పార్ట్ టైమ్ గా మాత్రమే చేస్తారనుకుంటారు. కానీ 73 శాతం మంది క్రియేటర్లు ఇదే తమ ప్రధాన ఆదాయ వనరు అని చెబుతున్నారు. గతేడాది కొత్తగా 2 లక్షల ఛానెల్స్ కు మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. ఏటా లక్షలు సంపాదించే వారి సంఖ్య 20 శాతం మేర పెరుగుతోంది.

ఏఐ టెక్నాలజీతో భాషా అడ్డంకులకు చెక్
అలాగే ఏఐ టెక్నాలజీ క్రియేటర్లకు ఒక వరంలా మారింది. ముఖ్యంగా భాషా అడ్డంకులను ఇది తొలగిస్తోంది. ఏఐ సాయంతో ఒక ప్రాంతీయ భాషలోని వీడియోను ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి సులభంగా డబ్బింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల మన తెలుగు వీడియోలను ఇతర రాష్ట్రాల లేదా విదేశీయులు సైతం తమ సొంత భాషలో చూడవచ్చు. అయితే ఏఐ వాడకం వల్ల క్వాలిటీ లేని కంటెంట్ వస్తుందేమోననే భయం ఉంది. దీనిపై యూట్యూబ్ స్పష్టమైన నియమాలు పెట్టింది. సొంత సృజనాత్మకతకు ఏఐని కేవలం ఒక సాధనంగా వాడుకోవచ్చు. ఒరిజినాలిటీ ఉండి, ప్రేక్షకులకు ఉపయోగపడే కంటెంట్ కు మాత్రమే మానిటైజేషన్ లభిస్తుంది.
స్మార్ట్ టీవీలు, యూట్యూబ్ షాపింగ్ హవా
వీడియోలు చూడటమే కాకుండా యూట్యూబ్ లో షాపింగ్ చేయడం కూడా పెరుగుతోంది. దాదాపు 45 కోట్ల మంది యూజర్లు ఏదో ఒక ప్రొడక్ట్ కోసం ఇక్కడ వెతికారు. ఈ షాపింగ్ కంటెంట్ చూసేవారి సంఖ్య 55 శాతం పెరిగింది. అందుకే క్రియేటర్లు తమ వీడియోల్లో వస్తువుల లింక్స్ ట్యాగ్ చేసే ఫీచర్ తెచ్చారు. ప్రేక్షకులు ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమీషన్ లభిస్తుంది. మరోవైపు మొబైల్ ఫోన్లకే పరిమితం కాకుండా స్మార్ట్ టీవీల్లో వీడియోలు చూసే ధోరణి పెరిగింది. మన దేశంలో దాదాపు 7.5 కోట్ల మంది స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ చూస్తున్నారు. ప్రతి ఏటా కొత్తగా 50 నుంచి 70 లక్షల ఇళ్లలోకి స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. అందుకే క్రియేటర్లు కూడా పెద్ద స్క్రీన్ కు తగ్గట్టుగా సినిమా రేంజ్ క్వాలిటీ కంటెంట్ అందిస్తున్నారు.
షార్ట్స్ వేగం… అందరికీ సమాన అవకాశాలు
ఇక యూట్యూబ్ షార్ట్స్ తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యూటీ, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతోంది. కొత్త ప్రేక్షకులను ఆకర్షించి, లాంగ్ వీడియోల వైపు నడిపించడానికి షార్ట్స్ అద్భుతమైన మార్గం. భవిష్యత్తులో క్రియేటర్లు కేవలం వీడియోలకే పరిమితం కాకుండా సొంత బ్రాండ్లను స్థాపించి వ్యాపారవేత్తలుగా ఎదగబోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా కాలేజీ కుర్రాళ్ల నుంచి 80 ఏళ్ల బామ్మల వరకు అందరూ ఇందులో రాణిస్తున్నారు. సాంకేతికత అందరికీ సమాన అవకాశాలు ఇస్తుందని యూట్యూబ్ ఇండియా హెడ్ గుంజన్ సోనీ పేర్కొన్నారు. టాలెంట్, కొంత క్రియేటివిటీ ఉంటే ఎవరైనా ఇందులో విజయం సాధించవచ్చు!