ఎవడబ్బ సొమ్ము? – లక్ష కోట్ల భూ దోపిడీలో బీఆర్ఎస్ నేతలు

Revanth allegations on BRS Politicians
  • కేసీఆర్ కుటుంబ భూబాగోతం బట్టబయలు
  • వేల కోట్ల సొమ్ము కాజేసి తెలంగాణపై పెత్తనం
  • అసెంబ్లీ వేదికగా గర్జించిన సీఎం రేవంత్ రెడ్డి
  • గులాబీ నాయకుల భూబాగోతంపై బిగ్ బ్లాస్ట్
  • 30 రోజుల్లో విచారణకు సిట్ ఏర్పాటు

సహనం వందే, హైదరాబాద్:

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కట్టుకథల బండారం బద్దలైంది. రేవంత్ దెబ్బకు గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి! వేల ఎకరాల ఆక్రమణల పునాదులు కదులుతున్నాయి. 30 రోజుల సిట్ దెబ్బకు బీఆర్ఎస్ బడా నేతల చుట్టూ ఉరితాళ్లు బిగుస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అపహస్యం చేశారు. బుధవారం శాసనసభలో తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. నిన్నటిదాకా సెక్షన్ 22 ఏ భూముల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన ప్రతిపక్షానికి అసెంబ్లీ సాక్షిగా పెద్ద షాక్ తగిలింది. పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ కీలక నేతలు ఎన్ని వేల ఎకరాలు వెనకేశారో అధికారిక లెక్కలతో సహా బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వెనుక దాగి ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దళిత బిడ్డలకు పంచుతామంటూ విసిరిన సవాల్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తోంది.

Revanth Comments on BRS Politicians Bhudanda

కేసీఆర్ గుప్పిట్లో వేల కోట్ల ఆస్తులు…
మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలు, భూములు కోల్పోయిన పేదలు ఒకవైపు ఉంటే… కేసీఆర్ మాత్రం వేల కోట్ల విలువైన ఆస్తులను ఎలా సంపాదించారో రేవంత్ రెడ్డి ఎండగట్టారు. సిద్దిపేట జిల్లా పరిధిలో కేసీఆర్, ఆయన సతీమణి పేరిట 65 ఎకరాలు, కేటీఆర్ పేరు మీద 49 ఎకరాలు, శైలిమా పేరిట 17, అలేఖ్య పేరు మీద 9, చివరికి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ పేరు మీద 46 ఎకరాల భూమి ఉందన్నారు. కవిత పేరిట 14 ఎకరాలు, అనిల్ పేరిట 23 ఎకరాలు ఉన్నాయి. జోగినపల్లి రవీందర్ రావు పేరు మీద 53 ఎకరాలు, సంతోష్ కుమార్ పేరిట 18, ఆయన భార్య పేరిట 7, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు పేరిట 97 ఎకరాలు ఉన్నాయి. కేవలం అధికారిక రికార్డుల్లోనే కేసీఆర్ కుటుంబం, బంధువుల పేరిట 439 ఎకరాల భూమి ఉందని తెలిపారు.

ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్‌హౌస్ పై విచారణ…
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ రికార్డుల్లో 123 ఎకరాలు చూపిస్తున్నప్పటికీ, అక్కడ 325 సర్వే నంబర్ పరిధిలోని 388 ఎకరాలకు ఎలాంటి చట్టబద్ధమైన ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఈ భూములపై 30 రోజుల్లో సమగ్ర విచారణ పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. స్వాధీనం చేసుకోబోయే ఆ 388 ఎకరాలను దళిత కుటుంబాలకు పంచుతామని హామీ ఇచ్చారు.

కేటీఆర్ చేతుల్లోకి రామలింగరాజు ఆస్తులు
సత్యం రామలింగరాజు ఆస్తులు కేటీఆర్ బంధువుల చేతుల్లోకి ఎలా మారాయో, జన్వాడ ఫామ్‌హౌస్ వెనుక ఏం జరిగిందో సీఎం బయటపెట్టారు. అలాగే రంగనాయక సాగర్ వద్ద రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు గుంజుకుని హరీష్ రావు 14 ఎకరాలు సొంతం చేసుకున్నారని, ఆ భూమికి రాకపోకల కోసం రూ. 5 కోట్లతో రోడ్డు వేయించుకున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను వాడుకుని ఆయన బంధువుల పేర్లపై 120 ఎకరాలు బదిలీ చేశారన్నారు.

మై హోమ్ సంస్థకు 2,400 ఎకరాలు…
మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, దయాకర్ రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డిలు అసైన్డ్, భూదాన్ భూములను ఆక్రమించారని తెలిపారు. వట్టినాగులపల్లిలో వినోద్ రావు సోదరుడు, పల్లా రాజేశ్వర్ రెడ్డి భూదాన్ భూములను అక్రమంగా మార్చుకున్నారన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ బంధువులకు 8,000 ఎకరాలు, మై హోమ్ సంస్థకు 2,400 ఎకరాల భూమిని కేటాయించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పదేళ్లలో దాదాపు లక్ష కోట్ల భూ దోపిడీ జరిగిందని విమర్శించారు.

భూ కుంభకోణాలపై సిట్…
ఈ భూ కుంభకోణాలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. టీజీఐఐసీ భూముల దోపిడీని బడ్జెట్ సమావేశాల్లో సాక్ష్యాధారాలతో బయటపెడతానని, ‘నమస్తే తెలంగాణ’ ఆస్తులు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇచ్చిన కార్ల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్…
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఏకంగా 308 ఎకరాల భూములున్నాయని, దీనికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ భూముల సమీపం నుంచే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అలాగే బుల్లెట్ ట్రెయిన్ అలైన్మెంట్ వెళ్లేలా ప్లాన్లు రూపొందించుకున్నారని అన్నారు. “నిజంగా రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే… రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఈ మూడేళ్లలో ఆయన సంపాదించిన ఆస్తులతోపాటు, మా ఆస్తులు.. ధరణి-భూభారతిలో జరిగిన వ్యవహారాల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?” అని సవాల్ విసిరారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *