- భర్తలకు భార్యలే 91 శాతం ఆర్గాన్ డోనర్లు
- పిల్లలకు తల్లులే 73 శాతం అవయవ దాతలు
- నేషనల్ ఆర్గాన్, ట్రాన్స్‌ప్లాంట్ సంస్థ వెల్లడి
- స్త్రీలు ఇతరులపై ఆధారపడడటం వల్లే ఇలా!
- బంధాల వెనుక బలవంతపు దానం!
సహనం వందే, హైదరాబాద్:
ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే చాలు… ప్రాణాలైనా ఇచ్చేసేందుకు ముందుకొచ్చేది ఎవరు? నిస్సందేహంగా ఇంట్లోని ఆడవాళ్లే. కానీ అదే ఆడవాళ్లకు అవయవం అవసరమైతే ఎంతమంది మగాళ్లు ముందడుగు వేస్తున్నారు? మన సమాజంలో అవయవ దానంలో కూడా తీవ్రమైన లింగ వివక్ష నడుస్తోంది. ఆడవాళ్ళు అవయవాలు ఇవ్వడానికే పరిమితం అవుతుంటే, మగవాళ్ళు వాటిని పొందడంలో ముందుంటున్నారు. అసలు మన వ్యవస్థలో ఏం జరుగుతోంది? ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా లేక త్యాగం పేరిట బలిచేస్తున్నారా?
డోనర్లలో 63.8 శాతం మంది మహిళలే…
దేశంలో అవయవ మార్పిడికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (నోటో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2019-23 మధ్య కాలంలో లైవ్ ఆర్గాన్ డోనర్లలో ఏకంగా 63.8 శాతం మంది మహిళలే ఉన్నారు. కానీ ఆ అవయవాలను తీసుకుని ప్రాణాలు నిలబెట్టుకున్న వారిలో 69.8 శాతం మంది పురుషులే కావడం గమనార్హం. అంటే గడిచిన ఐదేళ్లలో నమోదైన 56,509 డోనర్లలో 36,038 మంది మహిళా దాతలు ఉన్నారు. అయితే మహిళలు ఇచ్చిన ఈ అవయవాల్లో కేవలం 17,041 మాత్రమే తిరిగి మహిళలకు దక్కగా, మిగిలిన 39,447 అవయవాలు పురుషులకు మార్పిడి చేశారు. అంటే మహిళలు కేవలం దాతలుగానే మిగిలిపోతున్నారు తప్ప, వారు అనారోగ్యానికి గురైనప్పుడు వారికి అవయవాలు దక్కడం లేదు.

భర్తలకు భార్యలే 91 శాతం డోనర్లు…
మన ఇళ్లలో సాధారణంగా భార్య లేదా తల్లి తమ కుటుంబం కోసం దేనికైనా సిద్ధపడాలనే ఆలోచనను చిన్ననాటి నుంచే నూరిపోస్తారు. ఫలితంగా కుటుంబ సభ్యుడి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు, ఆ ఇంట్లోని మహిళపై మానసిక భారం పడుతుంది. పిల్లలకు ఇచ్చే అవయవ దానాల్లో తల్లుల వాటా ఏకంగా 73 శాతంగా ఉంది. అలాగే భార్యాభర్తల విషయానికి వస్తే, ఏకంగా 91 శాతం డొనేషన్లు భార్యలే తమ భర్తలకు చేస్తున్నారు. అంటే భర్తకు ఆరోగ్య సమస్య వస్తే భార్య తన అవయవాన్ని ఇస్తోంది కానీ, భార్య అనారోగ్యానికి గురైతే భర్త ముందుకు రావడం చాలా అరుదుగా జరుగుతోంది.
కుటుంబం కోసం త్యాగం…
భావోద్వేగ బంధాలు, కుటుంబం కోసం త్యాగం చేయాలనే ఒత్తిడి వారిని డోనర్లుగా మారుస్తున్నాయి. ఇక పురుషులు డోనర్లుగా మారకపోవడానికి మన సమాజంలోని పితృస్వామ్య ఆలోచనలే ప్రధాన కారణం. చాలా కుటుంబాల్లో పురుషుడే ఏకైక సంపాదనాపరుడు కాబట్టి అతనికి సర్జరీ జరిగితే కుటుంబానికి ఆదాయం ఆగిపోతుందనే భయం ఉంటుంది. ఈ ఆర్థిక ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఇంట్లో సంపాదన లేని మహిళలపై ఆ భారాన్ని నెట్టేస్తుంటారు.
స్త్రీలు ఇతరులపై ఆధారపడడటం వల్లే…
మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడి ఉండటం వల్ల వారు మరింత బలహీనులుగా మారుతున్నారు. వైద్య పరీక్షలు, ఆపరేషన్ ఖర్చులు, రికవరీ సమయం ఇవన్నీ లెక్కలేసుకుని కుటుంబాలు మహిళనే డోనర్‌గా ఎంచుకుంటున్నాయి. ఆర్థిక కోణంలో మహిళల ఆరోగ్యం కంటే పురుషుడి సంపాదనకే ప్రాధాన్యత ఇస్తుండటంతో స్వచ్ఛంద దానానికి, బలవంతపు త్యాగానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతోంది.
వివక్షను అరికట్టాలంటే…?
ఈ వివక్షను అరికట్టడానికి వైద్యులు అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అవయవ దానానికి ముందుకు వచ్చే మహిళలతో డాక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలి. వారిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టంగా నిర్ధారించుకోవాలి. బాధితురాలు మనస్ఫూర్తిగా ఇస్తోందా లేక వేరే దారి లేక ఒప్పుకుందా అనేది గుర్తించి అవసరమైతే వెనక్కి తగ్గే వెసులుబాటును కల్పించాలని మేధావులు కోరుతున్నారు. త్యాగానికి మారుపేరుగా మహిళలను పొగడడం బాగానే ఉన్నా, ఆ త్యాగమే వారి ప్రాణాల మీదకు రావడం విచారకరం.