- సగం ధరకే బ్రాండెడ్ పేర్లతో డ్రగ్స్ మాఫియా
- బెంగళూరులో 90 ఆసుపత్రుల బాగోతం
- సిట్ విచారణలో విస్తుగొలిపే విషయాలు
- ఢిల్లీ రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో దందా
- హైదరాబాదులోనూ ఉండొచ్చని అనుమానం
సహనం వందే, న్యూఢిల్లీ:
మనం ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రులకు వెళ్తాం. డాక్టర్లు రాసిన మందులు వాడితే రోగం నయమవుతుందని నమ్ముతాం. కానీ, అదే మందులు మన ప్రాణాలను తీసే విషపూరితమైన నకిలీవని తెలిస్తే? క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న రోగులకు, ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్నవారికి ఇచ్చే ఇంజెక్షన్లను కూడా సగం ధరకే అమ్ముతూ, కొన్ని హాస్పిటల్స్ కొనుగోలు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు వ్యాపించిన ఈ దారుణమైన నకిలీ మందుల దందా వెనుక ఉన్న అసలు నిజాలేంటో చూద్దాం.
90 ఆసుపత్రులకు కల్తీ మందులు…
బెంగళూరు నగరంలో వెలుగుచూసిన నకిలీ మందుల వ్యవహారం ఇప్డు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఏదో ఒక చిన్న మెడికల్ షాప్‌లో జరిగే మోసం కాదు ఇది. ఏకంగా 90 ప్రముఖ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఈ కల్తీ మందులు సరఫరా అయ్యాయని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణలో తేలింది. తవరేకెర ప్రాంతంలోని ఒక రహస్య గోదాముపై జరిగిన దాడితో ఈ ముఠా అసలు రంగు బయటపడింది. ఒక లైసెన్స్ ఉన్న ఫార్మాసిస్టే ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన సూత్రధారిగా ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీలు…
ఈ గ్యాంగ్ చేసిన మోసం సామాన్యమైనది కాదు. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఫైజర్ ఉత్పత్తులతో పాటు క్యాన్సర్ వ్యాధికి వాడే విలువైన మందులు, ఐసీయూలో అత్యవసరంగా ఇచ్చే ఇంజెక్షన్లను వీరు నకిలీవి తయారు చేశారు. మార్కెట్ ధరపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఆశ చూపించడంతో అనేక ఆసుపత్రులు వీటిని గుడ్డిగా కొనుగోలు చేశాయి. అసలే లక్షల రూపాయల ఖర్చుతో నలిగిపోయే రోగులకు, ఇలాంటి నకిలీ మందులను ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పదిహేను మందికి పైగా మెడికల్ రిప్రజెంటేటివ్‌లు ఈ నెట్‌వర్క్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. బిల్లులు, ప్యాకింగ్, లైసెన్సులు అన్నీ సక్రమంగా ఉన్నట్లు కనిపించడంతో హాస్పిటల్స్ కూడా వీటిని పసిగట్టలేకపోయాయని అధికారులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా విస్తరణ…
ఈ నకిలీ మందుల జాడ కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు కూడా ఈ నెట్వర్క్ పాకినట్లు దర్యాప్తులో తేలింది. ఇది ఏదో ఒక ప్రాంతంలో జరిగిన చిన్నపాటి నేరం కాదు, దేశవ్యాప్తంగా అల్లుకున్న ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్. రోగుల బలహీనతను, హాస్పిటల్స్ లాభాపేక్షను ఆసరాగా చేసుకుని వందల కోట్ల రూపాయల నకిలీ వ్యాపారాన్ని వీరు సాగించారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటిదే ఒక భారీ రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. అక్కడ క్యాన్సర్ మందుల అక్రమ రవాణాకు సంబంధించి 17 మందిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా వచ్చే క్యాన్సర్ మందులను దొంగిలించి, బ్లాక్ మార్కెట్లోకి మళ్లించడమే కాకుండా, కల్తీ మందులను కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇది కేవలం నకిలీ మందుల సమస్యే కాదు, ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడం కూడా.
ఢిల్లీ నుంచి రాజస్థాన్ దాకా…
ఢిల్లీ కేసు విచారణ రాజస్థాన్ దాకా వెళ్లడం మరింత ఆందోళన కలిగిస్తోంది. బికనేర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన క్యాన్సర్ మందుల వయల్స్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆసుపత్రి వర్గాలు ఈ ఆరోపణలను ఖండించాయి. తమ వద్ద రికార్డులన్నీ పక్కాగా ఉన్నాయని చెబుతున్నాయి. ఏది ఏమైనా ఉచిత మందుల సరఫరా వ్యవస్థలో కూడా ఎక్కడో పెద్ద రంధ్రం పడిందనేది స్పష్టమవుతోంది.
హైదరాబాద్ కేంద్రంగా అనుమానాలు…
హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి కేసులు ఉండే అవకాశం ఉందని… కాబట్టి విచారణలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని కొందరు స్పష్టం చేస్తున్నారు. క్యాన్సర్ లాంటి వ్యాధితో పోరాడే రోగికి మందు ప్రామాణికత అనేది కేవలం ఒక సాంకేతిక విషయం కాదు, అది వారి జీవన్మరణ సమస్య. కొనుగోలు చేసే ప్రతి మందు సురక్షితమైనదని నమ్మకం కలిగించడమే ఇప్పుడు వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు. బెంగళూరు, ఢిల్లీ, రాజస్థాన్ కేసులను పరిశీలిస్తే, మందు ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చాక ఏం జరుగుతుందనేదే ప్రధాన సమస్యగా మారింది. డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేలర్లు, హాస్పిటల్ కొనుగోళ్లు దాటుకుని వచ్చే క్రమంలో ఎక్కడో చోట కల్తీ మందులు చొరబడుతున్నాయి. దీనివల్ల అసలైన రోగులకు చేరాల్సిన ప్రాణరక్షణ మందుల స్థానంలో విషం చేరుతోంది.