- దళిత స్పీకర్ అంటే అగ్రవర్ణాలకు చులకనా?
- బీఆర్ఎస్ పార్టీకి దిక్కుతోచని దుస్థితి
సహనం వందే, హైదరాబాద్:
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత భాష వాడటం ఎంతవరకు సమంజసం అని అధికార పార్టీ సభ్యులు సూటిగా నిలదీస్తున్నారు. సభ గౌరవాన్ని, మర్యాదను పూర్తిగా దెబ్బతీసేలా ఈ మాటలు ఉన్నాయని అధికార పక్షం మండిపడుతోంది. ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తేవాలనుకున్న ప్రతిపక్షం, చివరికి తమ స్వంత నేతల మాటల వల్లే ఇరుకున పడాల్సి వచ్చింది.
దళిత స్పీకర్ అంటే చులకనా?
గడ్డం ప్రసాద్ కుమార్ కేవలం అసెంబ్లీ స్పీకర్ మాత్రమే కాదు. ఆయన ఒక దళిత నాయకుడు, సమాజంలో ఎంతో కష్టపడి పైకి వచ్చి ఒక అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఆయన కన్నతల్లిని వివాదంలోకి లాగడం ఏ రాజకీయ సంస్కృతికి నిదర్శనం? ఈ తరహా వ్యాఖ్యలు చివరికి ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎసరు పెట్టేలా మారాయి.
“మీ తల్లిని కాదు కదా”
అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన ఎవరినైనా కదిలిస్తుంది. “మీ తల్లిని కాదు కదా… నా తల్లిని అన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా” అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ఆయన కంటతడి పెట్టుకున్న క్షణం తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. గౌరవం కోసం ఒక దళిత నాయకుడు, సభాపతి పడిన ఆవేదనను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి.
కేసీఆర్ తీవ్ర అసంతృప్తి…
ఈ వివాదం ముదిరిపాకాన పడటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా ఎందుకు మాట్లాడారంటూ తాతా మధు తీరుపై కేసీఆర్ సీరియస్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. పరిస్థితి పూర్తిగా చేయి దాటుతోందని, ఇది పార్టీకి పెద్ద మచ్చగా మారుతుందని గ్రహించిన తర్వాతే తాతా మధు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన అప్పటికప్పుడు మాట వెనక్కి తీసుకున్నప్పటికీ జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది.
తాతా మధు అరెస్ట్ ఎపిసోడ్…
తాతా మధు అరెస్ట్ వ్యవహారం కూడా ఈ ఎపిసోడ్‌ను మరింత వేడెక్కించి రాజకీయంగా తీవ్ర రూపం దాల్చేలా చేసింది. ఒక చిన్న మాట ఎంత పెద్ద రాజకీయ ప్రళయానికి దారి తీస్తుందో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్‌లో పడటానికి కేవలం వ్యూహాత్మక వైఫల్యమే కాదు, నేతల బాధ్యతారహితమైన మాట్లాడే శైలే కారణమనే అభిప్రాయం బలపడుతోంది. దళిత నాయకులకు ఉన్నత పదవులు దక్కినా వారి గౌరవానికి రక్షణ ఉండదా అనే కోణంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.