- ఈ భాషలోనే కంప్యూటర్ సైన్స్ మూలాలు
- ఈ లాంగ్వేజ్ చట్రంలోనే కోడింగ్ సిస్టమ్
- మెషిన్ లాంగ్వేజ్ రూపకల్పనకు ప్రాణాధారం
- ఆధునిక యంత్ర భాషా అనువాదానికి కీలకం
సహనం వందే, హైదరాబాద్:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నేడు వస్తున్న విప్లవాత్మక మార్పులకు వేల ఏళ్ల కిందటే మన దేశంలో పునాదులు పడ్డాయి. కంప్యూటర్ సైన్స్‌కు, ప్రాచీన సంస్కృత భాషకు మధ్య ఉన్న విడదీయరాని శాస్త్రీయ సంబంధం ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఆధునిక సాంకేతికతకు మన ప్రాచీన గ్రంథాలే దిక్సూచిగా మారుతున్నాయి.
సహజ భాషా ప్రాసెసింగ్ సవాళ్లు…
ఏఐ, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో నేడు శాస్త్రవేత్తలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సహజ భాషా ప్రాసెసింగ్. మానవుడు మాట్లాడే మాటలను కంప్యూటర్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే దానికి కఠినమైన నియమాలు, స్పష్టమైన వ్యాకరణం ఉండాలి. సరిగ్గా ఈ అవసరమే శాస్త్రవేత్తలను సంస్కృత భాష వైపు చూసేలా చేసింది. సంస్కృత భాష నిర్మాణం అత్యంత పకడ్బందీగా, మ్యాథమెటిక్స్ సూత్రాల మాదిరిగా ఉంటుంది. దీనివల్లనే ఏఐ పరిశోధకులు ఈ భాష వైపు మొగ్గు చూపుతున్నారు.

మ్యాథమెటిక్స్ సూత్రాల లాజిక్…
అల్గారిథమ్స్ పరంగా చూస్తే సంస్కృత భాష స్వభావమే ఒక అల్గారిథమ్ లా పనిచేస్తుంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో మనం ఉపయోగించే ఇఫ్-దెన్ లాజిక్స్, కండిషనల్ స్టేట్‌మెంట్స్ అన్నీ సంస్కృత వ్యాకరణంలో అంతర్గతంగా ఇమిడి ఉన్నాయి. ఒక పదాన్ని విడదీయాలన్నా, కలపనాలన్నా సంస్కృతంలో నిర్దిష్టమైన సూత్రాలు ఉంటాయి. ఈ గణిత శాస్త్ర పోలికల కారణంగానే ఆధునిక యంత్ర భాషా అనువాదాలు, కంప్యూటేషనల్ భాషా శాస్త్రంలో సంస్కృతం ఒక ప్రామాణిక నమూనాగా నిలుస్తోంది.
నాసా పరిశోధన పత్రం వెల్లడించిన నిజాలు…
ఈ శాస్త్రీయ బంధానికి చారిత్రక ఆధారాలు కూడా బలంగా ఉన్నాయి. సరిగ్గా 1985 సంవత్సరంలో నాసా సంస్థ విడుదల చేసిన ఒక ప్రతిష్టాత్మక పరిశోధన పత్రంలో మెషిన్ లాంగ్వేజ్ రూపకల్పనకు సంస్కృత భాష అత్యుత్తమ నమూనా అని స్పష్టంగా తేల్చి చెప్పారు. కంప్యూటర్లకు ఆదేశాలు ఇచ్చే కోడింగ్ సిస్టమ్ ఎలా ఉండాలో వివరించడానికి ఈ ప్రాచీన భాషా నిర్మాణమే సరైన ఉదాహరణగా నిలిచింది. ఇవాళ ఏఐ టెక్నాలజీలో వాడుతున్న చాలా మోడళ్లకు ఈ తరహా ఖచ్చితత్వమే ప్రాతిపదికగా మారుతోంది.
పాణిని అష్టాధ్యాయి అద్భుత నిర్మాణం…
ఈ శాస్త్రీయ ప్రయాణానికి సరిగ్గా 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుత పాకిస్థాన్ ప్రాంతంలోని షాలతులాలో మహర్షి పాణిని రచించిన అష్టాధ్యాయి గ్రంథం మానవ చరిత్రలోనే ఒక అద్భుతం. ఈ గ్రంథంలో ఆయన ఏకంగా 4 వేల నియమాలను రూపొందించి, కేవలం ఒక భాషను మాత్రమే కాకుండా మానవ తర్కాన్ని ఒక లాజిక్‌గా మార్చారు. ఒక భాషను పూర్తిగా మ్యాథమెటిక్స్ సూత్రాల రూపంలోకి మార్చవచ్చని నిరూపించిన మొట్టమొదటి మేధావి పాణిని.
నేటి సైంటిస్టుల పరిశోధనలకు దిక్సూచి…
నేటి ఆధునిక కాలంలో కంప్యూటర్ సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ రంగాల్లో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు అందరూ పరోక్షంగా పాణిని చూపిన మార్గంలోనే నడుస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అభివృద్ధి చెందడానికి సంస్కృత వ్యాకరణ నియమాలు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయి. ప్రాచీన భారతీయ మేధస్సు ఎంత శాస్త్రీయమైనదో చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ భాషకు ఉన్న అనుబంధమే తిరుగులేని నిదర్శనం.
కంప్యూటర్ యుగంలో ప్రాచీన భాష…
ఇన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నా ఈ భాష ఎక్కడా ఆగిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త రూపాలను సంతరించుకుంటూ ముందుకు సాగుతోంది. పాత గ్రంథాల నుంచి మొదలై నేటి టెక్నాలజీ వరకు అన్ని చోట్లా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. కాలంతో పాటు మారుతూ, నేటి తరానికి సరికొత్త అర్థాన్ని ఇస్తూ ఈ అమర భాష తన ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది.