బిచ్చగాడు… ఇక కానరాడు – జనాభా లెక్కల్లో బిచ్చగాళ్లు ఔట్

No Beggars in the Voters List
  • ఆ కేటగిరీని ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం
  • కొత్తగా తల్లిదండ్రుల వివరాల నమోదు
  • మత మార్పిడుల చరిత్ర తెలుసుకునే యత్నం
  • ఫోన్ నెంబర్, ఆధార్ డీటేల్స్ తప్పనిసరి
  • వలసల కేటగిరీలో ప్రకృతి వైపరీత్యాలు

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ ఎప్పుడూ కనిపించని విచిత్రమైన కోణం ఒకటి ఉంది. రాబోయే 2027 సెన్సస్ నుంచి భిక్షాటన కేటగిరీని పూర్తిగా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా నమోదు చేసిన ఈ వర్గం ఇకపై అధికారిక గణాంకాల్లో కనిపించదు. ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు ఇక్కడ చూద్దాం.

తొలగిపోయిన భిక్షాటన జాబితా
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రాబోయే 2027 సెన్సస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జరిగిన ప్రతి జనాభా లెక్కల్లో దేశంలో భిక్షాటన చేసేవాళ్లను, నిరాశ్రయులను ప్రత్యేకంగా గుర్తించేవాళ్ళు. కానీ ఈసారి విడుదల చేసిన ప్రశ్నావళి నుంచి ఆ కేటగిరీని పూర్తిగా తొలగించారు. నాన్-ఎకనామిక్ యాక్టివిటీ జాబితాలో గతంలో ఉన్న బెగ్గర్స్ అండ్ వాగ్రెంట్స్ అనే ఆప్షన్ ఇప్పుడు కనిపించదు. దీనివల్ల దేశంలో అసలు ఎంతమంది భిక్షాటన మీద బతుకుతున్నారు అనే కచ్చితమైన సంఖ్య ఇకపై సెన్సస్ టేబుల్స్ లో ఎక్కడా కనిపించదు.

తక్కువ రెస్పాన్స్ వల్లే…
ఇలా ఈ కేటగిరీని తొలగించడానికి ప్రధానంగా గత లెక్కల్లో వచ్చిన అతి తక్కువ రెస్పాన్సే కారణమని తెలుస్తోంది. 2011లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 3.8 లక్షల మంది మాత్రమే తమను తాము బెగ్గర్స్ లేదా వాగ్రెంట్స్ గా ప్రకటించుకున్నారు. అంతకుముందు 2001లో 6.3 లక్షల మంది, 1991లో దాదాపు 5.4 లక్షల మంది మాత్రమే ఈ జాబితాలో నమోదయ్యారు. ఇన్ని కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ సంఖ్య అసలు వాస్తవ పరిస్థితికి చాలా దూరంగా ఉందని అధికారులు భావించారు. అవమానం లేదా భయం కారణంగా చాలామంది తాము బిక్షాటన చేస్తున్నట్లు బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడలేదని అధికారులు చెబుతున్నారు.

Beggars Out from the Voters List

ఎన్యుమరేటర్ల సరికొత్త పద్ధతి
సెన్సస్ నిబంధనల ప్రకారం జనాభా లెక్కలు సేకరించే అధికారి ఎల్లప్పుడూ ప్రతివాది స్వయంగా చెప్పిన వృత్తిని లేదా సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలి. ప్రజలు తమ నిజమైన స్థితిని చెప్పడానికి వెనుకాడటం వల్లే గతంలో ఈ డేటా ఎప్పుడూ సరిగా రాలేదు. అందుకే ఇకపై ఈ ప్రత్యేక వర్గాన్ని విడివిడిగా గుర్తించడం మానేసి అందరిలాగే వారిని కూడా ఇతరులు లేదా అదర్స్ కేటగిరీ కింద కలపాలని నిర్ణయించారు. దీనివల్ల ఇకపై భిక్షాటన చేసే వాళ్ల సంఖ్య తెలిసే అవకాశం లేదు. దీన్ని ఆధారం చేసుకుని దేశంలో బిచ్చగాళ్లే లేరని ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే అవకాశం లేకపోలేదని కొందరు విమర్శిస్తున్నారు.

వలసల్లో ప్రకృతి వైపరీత్యాలు
అయితే ఈసారి జనాభా లెక్కల్లో కీలకమైన మార్పులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వలసలకు సంబంధించిన కారణాలలో ఈసారి సరికొత్తగా ప్రకృతి వైపరీత్యాలు అనే ఆప్షన్ చేర్చారు. ఇప్పటివరకు పని, వ్యాపారం, చదువు, పెళ్లి, లేదా కుటుంబంతో పాటు వెళ్లడం వంటి కారణాలను మాత్రమే రికార్డు చేసేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి తగినట్టుగా వరదలు, తుఫానులు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎంతోమంది ప్రజలు తమ స్వస్థలాలను వదిలి వలస వెళ్లవలసి వస్తున్న వాస్తవాన్ని కూడా ఈ గణనలో స్పష్టంగా రికార్డు చేయనున్నారు.

తల్లిదండ్రుల వివరాల సేకరణ
అలాగే ఈసారి సెన్సస్ ఫారమ్ లో తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలను సేకరించడం మరొక ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరి ఫారమ్ లో తల్లి, తండ్రి పుట్టిన తేదీ, పుట్టిన స్థలం అలాగే వారి మతం వివరాలను సేకరించేలా కొత్త కాలమ్స్ పెట్టారు. అయితే ఇక్కడ ప్రజలు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ వివరాలు ప్రతి ఒక్కరు నింపాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు వేరుగా ఉంటారో లేదా వారు ఇప్పటికే జీవించి లేకపోతే మాత్రమే ఈ ప్రత్యేక వివరాలను పూరించాల్సి ఉంటుంది. దీని ద్వారా తరాల మధ్య మతాంతర వివాహాలు, మత మార్పిడుల చరిత్ర, పౌరసత్వ అర్హతల లెక్కలు బయటకు అవకాశం ఉంది.

ఆధార్… పాస్‌పోర్ట్ వివరాల సేకరణ
ఈ జనగణనలో ఆధునిక సాంకేతికతను జోడించి మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఓటర్ ఐడీ, ఇండియన్ పాస్‌పోర్ట్ నంబర్ వంటి కీలక పత్రాల వివరాలను కూడా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ ఎవరినీ బలవంతంగా వివరాలు సేకరించడానికి వీలులేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *