ఖాకీల కామ క్రీడలు – రక్షకుల రూపంలో రాక్షసులు

Telangana Police Sexual Harassments
  • నమ్మకాన్ని హతమార్చిన పోలీసులు
  • కామాంధులుగా మారిన అధికారులు
  • కటకటాల వెనక్కి ఖాకీలు
  • తెలంగాణలో ఐపీఎస్, సీఐల లీలలు

సహనం వందే, హైదరాబాద్:

ఖాకీ డ్రెస్ వేసుకుని రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే నేరాలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న లైంగిక వేధింపుల ఉదంతాలపై అత్యంత తీవ్రమైన విచారణ ఇది. నేరాలకు పాల్పడిన ఆ ముగ్గురి అధికారుల బండారం బట్టబయలైంది. రక్షక భటుల ముసుగులో సాగుతున్న అరాచకాలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Telangana Police Sexual Harassments

వ్యవస్థను మంటగలుపుతున్న ఖాకీలు
సామాన్యుల రక్షణ కోసమే రాజ్యాంగం పోలీసులకు విశేష అధికారాలను కల్పించింది. అయితే ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి కొందరు అధికారులు విచక్షణ మరిచి అరాచకాలకు పాల్పడుతున్నారు. డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాల్సిన వారు కామాంధులుగా మారిపోయి మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో వెలుగు చూసిన ముగ్గురు అధికారుల బండారం పోలీసు శాఖలో ఉన్న కుళ్లిపోయిన వ్యవస్థను అద్దం పడుతోంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డితో పాటు జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు, మలక్‌పేట్ సీఐ నరసింహ చేసిన ఘాతుకాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో డిపార్ట్‌మెంట్ ఉలిక్కిపడింది.

ట్రెయినీ ఐపీఎస్ అరాచక పర్వం
సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి సాటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. 2025 మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన బాధితురాలితో క్లోజ్‌గా మూవ్ అయిన ఉదయ్ ఈ జూన్ 23 నుంచి వేధింపులు మొదలుపెట్టాడు. వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపడం, తోటి ట్రైనీస్ ముందు కించపరచడం, ఫోన్ లాక్కోవడం, గదిలో నిర్బంధించడం, జుట్టుపట్టుకొని లాగడం, గొంతు నులిమడం వంటి రాక్షస చర్యలకు ఒడిగట్టాడు. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను రహస్యంగా రికార్డ్ చేసి భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేశాడు. జూలై 10న మరోసారి దాడి చేయడంతో బాధితురాలు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించింది.

కటకటాల వెనక్కి ఉదయ్ కృష్ణారెడ్డి
పోలీసులు కేసులు నమోదు చేసి నాలుగు ప్రత్యేక బృందాలతో గాలించి మిర్యాలగూడ సమీపంలో కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు.

జూబ్లీహిల్స్ సీఐ దారుణాలు
ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి ఆమె గర్భం దాల్చిన తరువాత బెదిరించి బలవంతంగా అబార్షన్ చేయించాడు. రహస్యంగా చిత్రీకరించిన ఆమె ప్రైవేట్ వీడియోలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండు కోట్ల రూపాయల వరకు దోచుకున్నాడు. బాధితురాలు నేరుగా డీజీపీకి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ ఇంకా కొనసాగుతోంది.

మలక్‌పేట్ సీఐ లీలలు
మలక్‌పేట్ సీఐ నరసింహ తమ డిపార్ట్‌మెంట్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాధితురాలపై వేధింపులకు దిగాడు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ వేధింపులు జరిగాయి. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకున్నాడని, వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని మొదటి భార్య ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో శాఖాపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఆరోపణలపై హైదరాబాద్ సీపీ మలక్‌పేట్ సీఐ నరసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.

కఠిన శిక్షల కోసం డిమాండ్లు
గౌరవప్రదమైన ఖాకీ యూనిఫామ్ ధరించి ప్రజలను కాపాడాల్సిన అధికారులే నేరస్తులుగా మారుతుండటంతో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందనే ప్రశ్న వ్యక్తమవుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి తప్పులు మరెవరూ చేయకుండా ఉండేలా కఠిన శిక్షలు అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *