ఫ్రెండ్‌షిప్ పేరెంటింగ్ డేంజరస్ ట్రెండ్ – అతి స్నేహంతో పిల్లల్లో క్రమశిక్షణ గల్లంతు

Friendship Parenting Dangerous
  • రూల్స్ లేని పెంపకం… బాధ్యత లేని పిల్లలు
  • ఎమోషనల్ సపోర్ట్ పేరిట నిర్లక్ష్యం
  • కఠినమైన రూల్స్ లేకపోతే నష్టం
  • బ్యాలెన్స్ లేకుంటే జీవితం ఫెయిల్

సహనం వందే, హైదరాబాద్:

నేటి సమాజంలో పిల్లలను పెంచే పద్ధతుల్లో పెద్ద విప్లవమే వస్తోంది. ఒకప్పుడు తల్లిదండ్రులంటే పిల్లలంటే భయం, భక్తి ఉండేవి. కానీ నేటి తరం పేరెంట్స్ ఆ గీతలను చెరిపేస్తున్నారు. పిల్లలు తమ మనసులోని ఆందోళనలు, భయాలు, ఫెయిల్యూర్స్ ను ఎటువంటి మొహమాటం లేకుండా తల్లిదండ్రులతో పంచుకోవాలని కోరుకుంటున్నారు. పరిశోధనలు కూడా చిన్నతనంలో తల్లిదండ్రులతో మంచి బంధం ఉన్న పిల్లలు పెద్దయ్యాక మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

మారుతున్న కాలం.. మారుతున్న పద్ధతులు
జెన్-జీ తరం పిల్లలు గతంలో ఎన్నడూ లేనంతగా మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో పేరెంట్స్ ఒక స్నేహితుడిగా పక్కన ఉండి వారి మాట వింటే సగం టెన్షన్ తగ్గిపోతుంది. చిన్న విషయానికి కూడా కుంగిపోయే నేటి పిల్లలకు ఈ ఎమోషనల్ సపోర్ట్ ఒక పెద్ద కవచంలా మారుతుంది. ఏ సమస్య వచ్చినా ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుందనే భరోసా ఉంటే పిల్లలు చెడు వ్యసనాల వైపు లేదా తప్పుడు దారుల వైపు వెళ్లే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి.

గీత దాటితేనే అసలు సమస్య
ఫ్రెండ్లీగా ఉండటానికి, అతిగా లైట్ తీసుకోవడానికి మధ్య సన్నని గీత ఉంటుంది. దాన్ని దాటితే మాత్రం అసలు సమస్య మొదలవుతుంది. పిల్లలకు అన్నీ తామే అయిపోయి, వాళ్ళు ఏ తప్పు చేసినా నవ్వుకుంటూ ఊరుకుంటే అది పేరెంటింగ్ కాదు… నిర్లక్ష్యం అవుతుంది. పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తే కఠినంగా మొట్టికాయ వేయాల్సిన చోట కూడా ఫ్రెండ్ షిప్ ముసుగులో వదిలేస్తే ఆ పిల్లలు సమాజంలో ఎదగలేరు.

ప్రేమతో పాటు కఠినమైన రూల్స్ అవసరం
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పర్ఫెక్ట్ పేరెంటింగ్ అంటే కేవలం గారాభం చేయడం కాదు. దాాన్ని ఆథరైటివ్ పేరెంటింగ్ అంటారు. అంటే ప్రేమను పంచడంలో ముందుండాలి. అదే సమయంలో కొన్ని కఠినమైన రూల్స్ పెట్టడంలోనూ వెనకడుగు వేయకూడదు. కేవలం స్నేహం పేరుతో పిల్లలకు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పకుండా, ఎటువంటి క్రమశిక్షణ నేర్పకపోతే వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది.

బయటి ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం
ఇంట్లో ఏ రూల్స్ లేకపోతే బయటి ప్రపంచం పెట్టే నిబంధనలను పిల్లలు జీర్ణించుకోలేరు. స్కూళ్లలో తోటివారితో కలిసిపోవడం, టీచర్లు చెప్పే క్రమశిక్షణను పాటించడం వారికి పెద్ద శిక్షలా అనిపిస్తుంది. అందుకే కేవలం కౌగిలింతలు, ముద్దులతో పాటు సరైన సమయంలో కఠినమైన నో చెప్పే ధైర్యం కూడా తల్లిదండ్రులకు ఉండాలి. ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూనే ఒక గైడ్ లా వెనుక ఉండి నడిపించే పేరెంట్స్ మాత్రమే పిల్లలను నిజమైన విజేతలుగా మారుస్తారు.

స్కూల్స్ సైకాలజీ… పేరంటాలజీ
ఈ సరికొత్త పేరెంటింగ్ ట్రెండ్ ను అందిపుచ్చుకోవడంలో ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ కూడా ముందుంటున్నాయి. కేవలం మార్కులు మాత్రమే కాకుండా పిల్లల మానసిక వికాసానికి స్కూల్, ఇల్లు కలిసికట్టుగా పనిచేయాలని నిపుణులు వాదిస్తున్నారు. కొన్ని స్కూల్స్ పేరంటాలజీ లాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పేరెంట్స్ కి నేటి తరం పిల్లల సైకాలజీని అర్థం చేసుకునే మెలకువలు నేర్పిస్తున్నాయి. ఇల్లు బేస్ అయితే స్కూల్ వేదిక అవుతుంది, ఈ రెండూ కలిస్తేనే పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

గైడ్ స్థానం ముఖ్యం
పేరెంటింగ్ అనేది ఏనాడూ ఒకేలా ఉండే స్థిరమైన సైన్స్ కాదు. మారుతున్న కాలానికి తగినట్లుగా తల్లిదండ్రులు కూడా మారుతున్నారు. కానీ మారుతున్నామనే పేరుతో పిల్లలకు మీరే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి పేరెంట్స్ స్థానాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకండి. పిల్లలు స్నేహితుడి లాంటి ప్రేమను కోరుకుంటారు, కానీ అదే సమయంలో తను దారి తప్పినప్పుడు గట్టిగా పట్టుకుని నిలబెట్టే ఒక గురువును కూడా నమ్ముకుంటారు. ఆ బ్యాలెన్స్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే నిజమైన మంచి పేరెంటింగ్ పుడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *