- విద్యార్థులపై భారం… నిఘాలో జర్నలిస్టులు
- పీహెచ్డీ విద్యార్థులకు 4 ఏళ్లకే అనుమతి
- 3.63 లక్షల మంది మన విద్యార్థులకు నష్టం
సహనం వందే, హైదరాబాద్:
అమెరికాలో చదువుకోవాలన్నా లేదా మీడియా ప్రతినిధిగా వెళ్లాలన్నా ఇకపై పాత పద్ధతులు కుదరవు. దశాబ్దాలుగా నమ్మకంతో సాగుతున్న వీసా విధానాలకు అగ్రరాజ్యం తెరదించింది. ఇప్పటి వరకు ఉన్న సౌలభ్యం స్థానంలో కఠినమైన ఆంక్షలు ప్రవేశపెట్టింది. వేల మంది విద్యార్థుల కెరీర్‌ను మార్చేసే ఈ నిర్ణయం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల వల్ల కలిగే చిక్కులేంటో ఇప్పుడు చూద్దాం.
అసలు ఏం మారింది అంటే…
ఇప్పటివరకు అమెరికాలో చదువుకునే విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే పద్ధతి ఉండేది. అంటే మీరు చదువులో చేరినప్పుడు వీసా తీసుకుంటే చాలు, మీ కోర్సు ఎన్ని సంవత్సరాలు కొనసాగితే అన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఆ పద్ధతిని పూర్తిగా ఎత్తేసింది. దీనివల్ల ఇకపై విద్యార్థులకు ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ అడ్మిషన్ మాత్రమే వర్తిస్తుంది. అంటే మీకు నిర్ణయించిన గడువు ముగియగానే మీరు అమెరికా వదిలి వెళ్లాల్సిందే.
పీహెచ్డీ విద్యార్థులకు చిక్కులు
ముఖ్యంగా పీహెచ్డీ చేసే వారికి ఈ రూల్ పెద్ద సమస్యగా మారింది. వీరికి గరిష్టంగా 4 ఏళ్ల అనుమతి మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీ పరిశోధన 4 ఏళ్లు దాటితే, ఆటోమేటిక్‌గా వీసా పొడిగించే పద్ధతి ఇక లేదు. మీరు మళ్ళీ అమెరికా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫీజులు చెల్లించి, ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఆ అనుమతి రాకపోతే మీ చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.
జర్నలిస్టుల కదలికలపై నిఘా
మీడియా రంగంలో పనిచేసే ఐ వీసా హోల్డర్లపై అమెరికా నిఘా మరింత పెంచింది. సాధారణ జర్నలిస్టులకు గరిష్టంగా 240 రోజులు మాత్రమే ఉండేలా కాలపరిమితిని కుదించారు. అదే చైనా జర్నలిస్టుల విషయానికి వస్తే ఆ గడువును కేవలం 90 రోజులకు పరిమితం చేశారు. ఏటా వందల సంఖ్యలో పెరిగే జర్నలిస్టుల కార్యకలాపాలను పర్యవేక్షించడం కష్టమని అమెరికా భావిస్తోంది. ఈ మార్పుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో మీడియా స్వేచ్ఛపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారతీయ విద్యార్థులపై ఒత్తిడి
ప్రస్తుతం అమెరికాలో 3.63 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిపై ఈ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి తన కోర్సు మధ్యలో సబ్జెక్టులు మార్చాలన్నా లేదా స్కూల్ మార్చాలన్నా ఇప్పుడున్న పద్ధతిలో చాలా కష్టంగా మారింది. దీనివల్ల వారు తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా అది అమెరికాలో ఉండే హక్కును దెబ్బతీసే అవకాశం ఉంది.
గ్రేస్ పీరియడ్ సగానికి తగ్గింపు
చదువు పూర్తయ్యాక ఉద్యోగం వెతుక్కోవడానికి గతంలో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు కుదించారు. అంటే కోర్సు అయిపోయాక మీకు ఉన్న సమయం చాలా తక్కువ. ఆ నెల రోజుల్లోపు కొత్త ఉద్యోగం దొరక్కపోతే లేదా వేరే కోర్సులో చేరకపోతే మీరు అమెరికా నుండి వచ్చేయాల్సిందే. ఈ తక్కువ గడువు కాలం విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోంది.
భద్రతే ప్రామాణికం
వీసాల పంపిణీలో అమెరికా భద్రతను ముఖ్యంగా చూస్తోంది. వీసాలను వాడుకుని చాలా మంది పర్మనెంట్‌గా ఉండిపోతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే ఈ నిర్ణయాలన్నింటినీ తీసుకుంది. వీసా గడువు పెంచే అధికారం కూడా ఇకపై యూనివర్సిటీలకు ఉండదు, అది పూర్తిగా ఫెడరల్ అధికారుల చేతుల్లో ఉంటుంది. ఇలా ప్రతి అడుగులోనూ అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. మీరు గనుక అమెరికా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కొత్త రూల్స్‌ను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే.