రాముడి గుడిలో రావణాసురులు – అయోధ్య రామమందిర నిధుల దోపిడీ వెనుక

Rama Mandi
  • ఇంత జరిగితే నేతలకు సంబంధం లేదా?
  • ట్రస్ట్ సభ్యుల రాజీనామాలతో సరిపెట్టారా?
  • అరెస్టులకే పరిమితం… భక్తుల్లో తీవ్ర ఆగ్రహం
  • ఆర్ఎస్ఎస్, బీజేపీలదే బాధ్యత: కాంగ్రెస్

సహనం వందే, అయోధ్య:

అయోధ్య రామాలయం పవిత్రతను మంటగలుపుతూ వెలుగులోకి వచ్చిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. భక్తి భావంతో భక్తులు సమర్పించుకున్న కానుకలు అన్యాక్రాంతం కావడమే కాకుండా ట్రస్ట్ నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కార్చింది. తాము షాక్‌కు గురయ్యామని, ఈ పరిస్థితికి అత్యంత బాధపడుతున్నామని ట్రస్ట్ ప్రతినిధులు కంటి తుడుపు ప్రకటనలు చేశారు.

నిధులు పక్కదారి పడుతుంటే నిద్రపోయారా?
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఇద్దరు కీలక వ్యక్తుల నిష్క్రమణ సంస్థలో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతోంది. ట్రస్ట్ రాబోయే సమావేశంలో ఈ రాజీనామాలపై నిర్ణయం తీసుకోనుంది. భక్తులు స్వయంగా అందజేసిన వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయని ట్రస్ట్ హామీ ఇస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతోంది. వేలకోట్ల రూపాయలు పక్కదారి పడుతుంటే వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

హవ్వ… డ్రైవర్ చేతిలో హూండీ తాళాలా?
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రమాశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను యాదవ్ ఈ అవినీతికి కేంద్ర బిందువుగా మారారు. నిబంధనలను ఉల్లంఘించి తిన్ను యాదవ్ హుండీల తాళాలను తన వద్దే ఉంచుకున్నాడు. హుండీల్లోని నగదును ఆయన ఎలా స్వాహా చేశారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రామాణిక నిర్వహణ విధానాలను అమలు చేయడంలో ట్రస్ట్ చూపిన నిర్లక్ష్యమే ఈ దొంగతనానికి దారితీసిందని ప్రాథమికంగా గుర్తించారు.

అరెస్టుల పర్వం…
అయోధ్యలోని స్థానిక కోర్టు ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. జూన్ 29 వరకు వీరు రిమాండ్‌లో ఉంటారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా నిందితుల పాత్రపై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అరెస్టులు కేవలం ఆరంభం మాత్రమేనని మరికొంతమందిని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజకీయ రగడ
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ పూర్తి బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది సనాతన ధర్మాన్ని నమ్మే ప్రజలు సహించరని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో పారదర్శకత లేదని ఆయన విమర్శించారు.

భక్తుల నమ్మకానికి పరీక్ష
రామాలయ నిర్మాణానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన విరాళాలు ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నాయి. నిధుల పర్యవేక్షణలో జరిగిన లోపాలు ఇప్పుడు భక్తుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ట్రస్ట్ ఎంత వివరణ ఇచ్చినప్పటికీ జరుగుతున్న పరిణామాలు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ఒక పవిత్ర క్షేత్రంలో చోటుచేసుకున్న ఈ అవినీతి వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీయడమే కాకుండా ట్రస్ట్ పై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా కాపాడుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *