- వీరుల బలిదానాలపై డిస్కౌంట్
- దక్షిణ కొరియా ప్రజల నిరసన వెల్లువ
- హేళన చేసినందుకు నిలువునా దహనం
- గ్లోబల్ బ్రాండ్‌పై లోకల్ బండ
- దేశవ్యాప్తంగా 2 వేల స్టార్‌బక్స్ క్లోజ్
సహనం వందే, దక్షిణ కొరియా:
వ్యాపార ప్రకటనల్లో స్థానిక ప్రజల సెంటిమెంట్లు, దేశ చరిత్రను గౌరవించకపోతే ఎంతటి పెద్ద కంపెనీ అయినా రోడ్డున పడాల్సిందేనని దక్షిణ కొరియా స్టార్‌బక్స్ ఉదంతం నిరూపించింది. ఒక ప్రమోషన్ కోసం ఈ అంతర్జాతీయ కాఫీ సంస్థ చేసిన చారిత్రక తప్పిదం అక్కడ పెను సంచలనం సృష్టించింది. దేశ ప్రజల గుండెల్లో ఇంకా రగులుతున్న ఒక నాటి రక్తపాతాన్ని, పోలీసుల దారుణాలను ఈ ప్రకటన హేళన చేసినట్లుగా ఉండటంతో కొరియన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీనితో సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన దుకాణాలన్నింటినీ మూసివేయడం సంచలనం సృష్టిస్తుంది.
ప్రజలను రగిలించిన యుద్ధ ట్యాంక్ గుర్తు
ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథను విశ్లేషిస్తే, స్టార్‌బక్స్ కొరియా సంస్థ మే 18వ తేదీన ఒక కొత్త ట్యాంక్ టంబ్లర్ (కాఫీ తాగే పెద్ద కప్పులు) అమ్మకాల కోసం డిస్కౌంట్ ప్రమోషన్ ప్రారంభించింది. దానికి ట్యాంక్ డే అని పేరు పెట్టింది. అయితే ఈ మే 18 అనేది దక్షిణ కొరియా చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. 1980 మే 18న గ్వాంగ్జూ నగరంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వందలాది మంది ప్రజలను అప్పటి మిలిటరీ నియంత చున్ డూ-హ్వాన్ ఆర్మీ ట్యాంకులతో తొక్కిస్తూ దారుణంగా కాల్చి చంపించాడు. సరిగ్గా అదే రోజున స్టార్‌బక్స్ సంస్థ ట్యాంక్ గుర్తుతో డిస్కౌంట్ సేల్ పెట్టడం అంటే… చనిపోయిన అమాయక ప్రజలను, ఆ నాటి ఆర్మీ ట్యాంకుల భయానక వాతావరణాన్ని క్రూరంగా గుర్తుచేసి హేళన చేసినట్లుగా స్థానికులు భావించారు.

పోలీసుల దారుణాల నినాదం
స్టార్‌బక్స్ చేసిన మరో ఘోరమైన తప్పు ఏమిటంటే, ఈ ప్రచారం కోసం టేబుల్‌పై గట్టిగా ధడేల్ అనేలా నినాదాన్ని వాడటం. ఇది కొరియా ప్రజల పాత గాయాలను మళ్లీ రేపింది. 1987లో పార్క్ జోంగ్-చుల్ అనే విద్యార్థి నాయకుడిని పోలీసులు లాకప్‌లో విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టి చంపేశారు. కానీ అప్పట్లో ప్రభుత్వం ఆ నిజాన్ని దాచిపెడుతూ, అధికారి టేబుల్‌పై గట్టిగా ధడేల్ మని బాదగానే ఆ శబ్దానికి విద్యార్థి భయపడి గుండె ఆగి చనిపోయాడని ఒక నమ్మశక్యం కాని అబద్ధం చెప్పింది. ఇప్పుడు స్టార్‌బక్స్ అదే వాక్యాన్ని కాఫీ కప్పుల మార్కెటింగ్ కోసం వాడటంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలు కూడా ఈ ప్రచారాన్ని నిరసిస్తూ స్టార్‌బక్స్‌తో ఉన్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
కృత్రిమ మేధస్సు తెచ్చిన ముప్పు
ఇంత పెద్ద తప్పు జరగడానికి కారణం ఏమిటంటే, శైన్సెగే గ్రూప్‌కు చెందిన మార్కెటింగ్ అధికారులు సొంత బుద్ధిని వాడకుండా ఒక కృత్రిమ మేధస్సు సాధనాన్ని సంప్రదించారు. ఆ కృత్రిమ మేధస్సు టూల్ ఇచ్చిన నినాదాలను, డిజైన్లను అక్కడి నిర్వాహకులు కనీసం ఈమెయిల్ అటాచ్మెంట్లు కూడా తెరిచి చూడకుండా గుడ్డిగా ఆమోదించి మార్కెట్లోకి వదిలారు. దీని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో వారు ఊహించలేకపోయారు. ప్రచారం మొదలైన కొన్ని గంటల్లోనే దేశమంతా నిరసనలు మొదలయ్యాయి. ప్రజలు రోడ్లెక్కి స్టార్‌బక్స్ మగ్గులను, టంబ్లర్లను పగలగొట్టారు. దీంతో యాజమాన్యం తక్షణమే ఆ ప్రచారాన్ని వెనక్కి తీసుకుని బాధ్యుడైన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను అదే రోజున ఉద్యోగం నుంచి తొలగించింది.
జాతికి క్షమాపణలు చెప్పిన చైర్మన్
పరిస్థితి చేతులు దాటిపోవడంతో సంస్థ బిలియనీర్ చైర్మన్ చుంగ్ యాంగ్-జిన్ స్వయంగా రంగంలోకి దిగక తప్పలేదు. ఆయన ఒక లేఖ ద్వారా క్షమాపణలు చెప్పడమే కాకుండా లైవ్ టెలివిజన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రజల ముందు మూడుసార్లు తలవంచి క్షమాపణలు వేడుకున్నారు. అమెరికాలోని సీటెల్ నగరంలో ఉన్న స్టార్‌బక్స్ ప్రధాన కార్యాలయం కూడా రాతపూర్వకంగా క్షమాపణ పత్రాన్ని పంపింది.
దుకాణాల బంద్.. వందల కోట్ల నష్టం
ఈ పాపపరిహారంగా దక్షిణ కొరియాలోని 2000 స్టార్‌బక్స్ దుకాణాలను జూన్ 22వ తేదీ నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నారు. కేవలం విమానాశ్రయాల్లోని కొన్ని స్టోర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ సమయంలో ఉద్యోగులందరికీ ఆధునిక కొరియా చరిత్రపై ప్రత్యేక క్లాసులు తీసుకొని ప్రజల సెంటిమెంట్ల పట్ల ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తారు. చైర్మన్ చుంగ్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా జూన్ 24న ఈ ట్రైనింగ్‌కు హాజరవుతున్నారు. ఈ సగం మూసివేత వల్ల ఆ కంపెనీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. చరిత్రను, ప్రజల భావోద్వేగాలను విస్మరించి కేవలం టెక్నాలజీని నమ్ముకుని మార్కెటింగ్ చేస్తే వ్యాపారాలు ఎలా కుప్పకూలుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక అంతర్జాతీయ ఉదాహరణ.