‘గడల’కు తెలంగాణ జనసేన పగ్గాలు? – డాక్టర్ శ్రీనివాసరావుకు అప్పగించే యోచన

Gadala Janasena
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహం
  • వచ్చే ఎన్నికల్లో సత్తా చూపాలని దిశానిర్దేశం
  • గడలకు ఉన్న పేరు పార్టీకి ప్రయోజనం
  • ప్రజారాజ్యం పార్టీ నుంచి గడల ప్రస్థానం
  • చిరంజీవి కుటుంబంతో డాక్టరుకు సంబంధాలు

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణలో సరికొత్త రాజకీయ భూకంపం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన ప్రకటించడంతో ఇక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ పగ్గాలను ఒక కీలక నేత చేతుల్లో పెట్టేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం
తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం తగ్గిందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇక్కడ గట్టిగా ఫోకస్ పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. పార్టీని నడిపించే సరైన లీడర్ కోసం వెతుకుతున్న తరుణంలో ప్రజారోగ్య మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, గడల శ్రీనివాసరావు ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడం ఇక్కడ విశేషం. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక అధికారిగా పనిచేసిన గడలకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆయనను తెలంగాణ జనసేన ఇన్ చార్జిగా నియమించేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గడల కూడా రాష్ట్ర పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మెగా ఫ్యామిలీతో గడలకు గట్టి బంధం
డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటులో గడల శ్రీనివాసరావు చాలా కీలకపాత్ర పోషించారు. అప్పటినుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఆ కుటుంబ సభ్యులందరితో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీ పెళ్లిళ్లకు గడల వెళ్లడం, అలాగే గడల ఇంట్లో శుభకార్యాలకు మెగా ఫ్యామిలీ హాజరుకావడం నిరంతరం జరుగుతూనే ఉంది. కరోనా కాలంలో గడల చేసిన సేవలను గుర్తించి హీరో రామ్ చరణ్ ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు.

ప్రజారాజ్యం నాటి చేదు అనుభవం
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు గడల శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ఆ పార్టీ కోసం పనిచేశారు. చిరంజీవితో నిరంతరం టచ్ లో ఉంటూ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. టికెట్ గడలకే వస్తుందని అందరూ భావించినా కొన్ని సమీకరణాల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో గడల అప్సెట్ అయ్యారు. అప్పట్లో ప్రజారాజ్యం ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినా ఆ పార్టీ పరాజయంతో గడల ఆశలు అడియాశలయ్యాయి.

బీఆర్ఎస్ ఇచ్చిన గట్టి షాక్
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడల శ్రీనివాసరావు సుదీర్ఘకాలం ప్రజారోగ్య సంచాలుడిగా చక్రం తిప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో ఆయనకు గట్టి సంబంధాలు ఉండేవి. బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం టికెట్ సాధించాలని ఆయన తీవ్రంగా శ్రమించారు. అందుకోసం తన తండ్రి పేరు మీద జీఎస్ఆర్ ట్రస్టును ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు, ఉద్యోగ మేళాలు, బతుకమ్మ ఈవెంట్లు నిర్వహించారు. అధికారిగా ఉంటూనే జనం మధ్య తిరిగారు. కానీ కేసీఆర్ చివరి నిమిషంలో టికెట్ నిరాకరించడంతో గడల తీవ్ర నిరాశకు గురయ్యారు.

కాంగ్రెస్ హయాంలో అవమానాల పర్వం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గడల శ్రీనివాసరావుకు కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అనుకూలుడనే ముద్రతో ఆయనను ప్రజారోగ్య సంచాలకుడి పోస్టు నుండి తొలగించారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక రెండో స్థాయి పోస్టుకు బదిలీ చేస్తూ అవమానించారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఖమ్మం లోక్ సభ సీటు కోసం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కండువా కప్పుకున్నా అక్కడ కూడా టికెట్ దక్కలేదు. ఆ తర్వాతే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వ్యాపారాల్లో మునిగిపోయారు.

తెరపైకి జనసేన ఇన్ చార్జి పదవి
కాంగ్రెస్ లో చాన్స్ లేకపోవడం, బీఆర్ఎస్, కవిత పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో గడల తన సొంత కుటుంబం లాంటి మెగా ఫ్యామిలీ వైపు అడుగులు వేశారు. కొత్తగూడెంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఆ సీటు హామీతోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పొత్తు ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఖాయమని గడల భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కీలక సమావేశాల్లో గడల పాల్గొంటున్నారు. తెలంగాణలో జనసేన వాయిస్ వినిపించేందుకు ఆయనకు త్వరలోనే రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *