- వారే యాహూ బాయ్స్… సైబర్ సెలబ్రిటీస్
- జైలుకు వెళ్లాల్సిన దొంగలకు లక్షల్లో ఫాలోవర్స్
- చదువులు పక్కన పెట్టి.. మోసాల బాట పట్టి
- రాత్రికి రాత్రే నోట్ల పంట… లగ్జరీ లైఫ్‌కు బాట!
- సామాజిక హోదాగా నేరం… కార్లోస్ పుస్తకం
- తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా సైబర్ దోపిడి
సహనం వందే, హైదరాబాద్:
సైబర్ నేరాలు ఇప్పుడు మోసాలు కావు. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే మంత్రదండాలుగా మారాయి. నైజీరియా యువతను ఊపేస్తున్న యాహూ బాయ్స్ సంస్కృతిపై కార్లోస్ బరాగన్ రాసిన కొత్త పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది. ఆన్లైన్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్ముతో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న వైనం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో ప్రపంచవ్యాప్తంగా వీరి దోపిడీ విస్తరించి పోయింది.
కోట్ల రూపాయల దోపిడీ
ఈ అంతర్జాతీయ మోసాల సామ్రాజ్యం ఎంత పెద్దదో చూస్తే గుండె గుభేల్ మంటుంది. 2025 సంవత్సరంలో వారి మోసాల విలువ ఏకంగా 37.12 లక్షల కోట్ల రూపాయలు. ఏఐ, డీప్‌ఫేక్స్ సాంకేతికతతోనే ఈ స్థాయి దోపిడీ జరిగింది. వివిధ భాషల్లో అప్పటికప్పుడు అనువాదం చేసే యాప్ లు నేరగాళ్లకు వరంగా మారాయి. ఇంటర్నెట్లో లభించే ఫ్రాడ్ యాజ్ ఏ సర్వీస్ సాఫ్ట్వేర్ సాయంతో ఈ నేరాలు రూపాంతరం చెందుతున్నాయి. పెట్టుబడుల పేరిట, ఈకామర్స్ పేరిట దోపిడీలు సాగుతున్నాయి. తప్పుడు రుణాల యాప్‌లు కూడా ఇందుకు వేదికగా మారుతున్నాయి.

యాహూ బాయ్స్ నెట్వర్క్
నైజీరియాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడే క్రిమినల్స్ ప్రపంచవ్యాప్తంగా యాహూ బాయ్స్ అనే పేరుతో చలామణిలో ఉన్నారు. వీరు విదేశీయులను బురిడీ కొట్టించి భారీగా సంపాదిస్తున్నారు. ఇంటర్నెట్లో అమాయకులను వలలో వేసుకుని బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఘోరమైన ప్రేమ దోపిడీ వెనుక నైజీరియాకు చెందిన యాహూ బాయ్స్ నెట్వర్క్ ఉంది. శృంగార దోపిడీని ఒక పెద్ద పరిశ్రమగా మార్చేశారు.
హోదాగా మారిన క్రైమ్
సాధారణంగా నేరస్థులు సమాజంలో తలదించుకుంటారు. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. సైబర్ మోసాల ద్వారా సంపాదించిన డబ్బుతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నైజీరియా సమాజంలో వీరికి ప్రత్యేక గౌరవం లభిస్తోంది. ఆన్లైన్ దగా ద్వారా వచ్చిన సంపద వీరికి విపరీతమైన పరపతిని తెచ్చిపెడుతోంది. ఖరీదైన కార్లు, దుస్తులు, బంగ్లాలు, బంగారు గొలుసులు, బ్రాండెడ్ వస్తువులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. కష్టపడకుండా తక్కువ సమయంలోనే కోట్లకు పడగలెత్తే ఈ విధానాన్ని యువత ఒక ఫ్యాషన్‌గా భావిస్తోంది. చదువుకున్న వారే కాకుండా చదువురాని వారు కూడా ఈ ఆన్లైన్ దందాలోకి ఈజీగా అడుగుపెడుతున్నారు.
సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్
యాహూ బాయ్స్ సంపాదిస్తున్న అక్రమ సొమ్ము వారిని రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారుస్తోంది. సోషల్ మీడియాలో వీరికి లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటున్నారు. తాము చేసే మోసాలను దాచుకోకుండా బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. ఈ డబ్బుతోనే వారు పాపులారిటీని, అధికారాన్ని శాసిస్తున్నారు. శ్రమపడి సంపాదించడం కంటే ఈ సులువైన మోసాల వైపే నైజీరియా యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు పరిశోధనలో తేలింది.
రాజకీయాలను శాసిస్తున్నారు…
ఈ స్కామర్స్ కేవలం డబ్బుతోనే ఆగడం లేదు. స్థానిక రాజకీయాలను, వ్యాపారాలను సైతం శాసిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో వీరు సంబంధాలు కలిగి ఉంటున్నారు. మోసపూరిత డబ్బుతో సమాజంలో ఒక బలమైన నెట్వర్క్ నిర్మించుకున్నారు. ఆన్లైన్ ఫ్రాడ్ అనేది ఒక వ్యవస్థీకృత పరిశ్రమగా రూపాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ భద్రతా సంస్థలకు ఈ యాహూ బాయ్స్ ఇప్పుడు పెద్ద సవాలుగా నిలుస్తున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న నెట్వర్క్
ఈ గ్యాంగ్‌ల విస్తృతి ఇప్పుడు ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారింది. వివిధ దేశాల ధనవంతులను టార్గెట్ చేస్తూ రొమాన్స్ స్కామ్స్, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ వంటి మోసాలకు పాల్పడుతున్నారు. నేరం ద్వారా సంపద, కీర్తి లభిస్తుండటంతో నైజీరియాలో నైతిక విలువలు పతనమవుతున్నాయి. కష్టపడి చదువుకునే వారి కంటే మోసాలు చేసేవారే సమాజంలో హీరోలుగా చెలామణి అవ్వడం ఒక పెద్ద సామాజిక సంక్షోభానికి దారితీస్తోంది.