మెడికల్ ఫీ’జులుం’పై ఉక్కుపాదం – రంగంలోకి దిగిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

Kaloji Narayana Rao Health University
  • నాలుగున్నరేళ్ల ఫీజు వసూలుకే అనుమతి
  • ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై ఆగ్రహం
  • ఇంటర్న్‌షిప్‌కు అడ్డుతగల్గొద్దని హెచ్చరిక
  • కాలేజీ ప్రిన్సిపల్స్, డీన్లకు వార్నింగ్ లేఖ

సహనం వందే, హైదరాబాద్:

ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తూ చేస్తున్న దోపిడీపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. నాలుగున్నరేళ్ల కోర్సు కాలానికి మించి ఫీజులు అడగవద్దని స్పష్టం చేస్తూనే ఇంటర్న్‌షిప్ అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలను హెచ్చరించింది. ప్రభుత్వం, ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ నిబంధనల అమలే పరమావధిగా శనివారం ఈ కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన
ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు రావడంతో విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఫీజుల వసూళ్లలో నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కాలేజీల తీరు మారకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

నాలుగున్నరేళ్ల ఫీజు మాత్రమే
కోర్సు కాలం నాలుగున్నరేళ్ల మాత్రమేనని… దీనికి మించి ఒక్క రూపాయి కూడా అడగకూడదని వర్సిటీ తేల్చి చెప్పింది. ఈ ఫీజును 5 సమాన వార్షిక వాయిదాలలో తీసుకోవాలని ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ మార్గదర్శకాలను ఉటంకించింది. కానీ కాలేజీలు ఇంటర్న్‌షిప్ పేరుతో అదనపు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిని ప్రభుత్వం, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధమని వర్సిటీ భావిస్తోంది.

ఇంటర్న్‌షిప్ తో అడ్డంకులు వద్దు
కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వెళ్తే ఫీజుల పేరుతో అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధమని వర్సిటీ పేర్కొంది. నాలుగున్నరేళ్ల ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థికి ఇంటర్న్‌షిప్ చేసే హక్కు ఉంటుందని గుర్తు చేసింది. ఇంటర్న్‌షిప్ కాలానికి సంబంధించి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదని ప్రిన్సిపాల్స్, డీన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంటర్న్‌షిప్ కొనసాగించాలని ఆదేశించారు.

చర్యలకు సిద్ధమైన వర్సిటీ
విశ్వవిద్యాలయం గత ఏప్రిల్ 2న జారీ చేసిన ఆదేశాలను కూడా కొన్ని యాజమాన్యాలు పట్టించుకోలేదు. ఇకపై ఎటువంటి ఫిర్యాదు అందిన చర్యలు తప్పవని వర్సిటీ హెచ్చరించింది. 2018 నాటి హైకోర్టు తీర్పు, 2024 జూన్ 26 నాటి టీఏఎఫ్ఆర్సీ ఆదేశాలను కూడా కాలేజీలు అమలు చేయాలని సూచించింది. లేనిపక్షంలో నిబంధనల మేరకు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *