ట్రంప్ పై గన్ – వైట్ హౌస్ వద్ద తూటాల గర్జన

Attack on Trump
  • ట్రంప్ టార్గెట్… ఒకరు మృతి
  • జర్నలిస్టుల పరుగులు… భద్రతపై నీలినీడలు
  • ప్రెసిడెంట్ ట్రంప్ సురక్షితం… ఇరాన్ సెగలు

సహనం వందే, అమెరికా:

అమెరికా అధికార కేంద్రం వైట్ హౌస్ వద్ద జరిగిన భీకర తుపాకీ కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం అమెరికా అంతర్గత భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఈ దాడి జరగడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

భద్రతా కోటలో భారీ లీకేజీ
అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత వైట్ హౌస్ ప్రాంగణంలో ఒక్కసారిగా తూటాల గర్జన వినిపించింది. 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ ఎన్‌డబ్ల్యు కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. ఇది శ్వేతసౌధం వాయువ్య మూలలో ఉంటుంది. అక్కడ విధుల్లో ఉన్న యూస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై ఒక దుండగుడు తన బ్యాగ్ నుంచి గన్ తీసి వరుసగా కాల్పులు జరిపాడు. ఈ ప్రాంతంలో భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది. అధ్యక్షుడు లోపల ఉన్న సమయంలోనే ఈ కాల్పులు జరగడం వ్యవస్థల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.

హతమైన నిందితుడు
పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన సదరు నిందితుడిని చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులకు ఎలాంటి గాయాలు కాలేదు. దర్యాప్తు సంస్థలు ఈ దాడి వెనుక ఉన్న అంతర్గత శక్తుల ప్రమేయంపై లోతుగా విచారణ చేస్తున్నాయి. ఈ తుపాకీ ఫైరింగ్ వెనుక అసలు పొలిటికల్ అజెండా ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

సామాన్యుడికి తగిలిన తూటాలు
ఈ కాల్పుల తీవ్రత కేవలం నిందితుడికే పరిమితం కాలేదు. తుపాకీ గుండ్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే సమీపంలో ఉన్న మరో సాధారణ పౌరుడికి కూడా తూటాలు తగిలాయి. ఒక బైస్టాండర్ ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడని దర్యాప్తు అధికారులు ధృవీకరించారు. ఆ వ్యక్తికి నిందితుడి బుల్లెట్లు తగిలాయా లేక అధికారుల ఎదురుకాల్పుల్లో గాయపడ్డాడా అనే కోణంలో మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది. అధికారిక శ్వేతసౌధం వెలుపల ఒక సామాన్యుడు ఇలా కాల్పుల బారిన పడటం అక్కడి భద్రతా వైఫల్యాలపై విమర్శలను పెంచుతోంది.

జర్నలిస్టుల లైవ్ ఆందోళన
వైట్ హౌస్ ఉత్తర లాన్ నుండి సుమారు 20 నుండి 30 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ది న్యూయార్క్ టైమ్స్ ఫోటోగ్రాఫర్ అలిసన్ రాబర్ట్ తెలిపారు. ప్రెస్ రూమ్ వెలుపల ఉన్న జర్నలిస్టులు ఈ శబ్దాలు విన్నారని ఆమె చెప్పారు. ఏబీసీ న్యూస్ సీనియర్ వైట్ హౌస్ కరస్పాండెంట్ సెలీనా వాంగ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆమె ఐఫోన్‌లో సోషల్ వీడియో కోసం రిపోర్ట్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ ఘోరం జరిగింది. రికార్డింగ్ ప్రారంభించిన 3 సెకన్లకే కాల్పుల శబ్దాలు వచ్చాయి. ఆమె వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో మీడియా టెంట్‌లో తలదాచుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో 30 లక్షల వీక్షణలను పొందింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది జర్నలిస్టులను సురక్షితంగా ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌కు తరలించారు.

రంగంలోకి ఎఫ్‌బిఐ చీఫ్
ఈ సంచలన ఘటనపై అమెరికా అంతర్గత భద్రతా విభాగాలు తక్షణమే స్పందించాయి. సమాచారం అందిన వెంటనే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. లీగల్ ఇమ్మిగ్రేషన్ పరిమితులు, జనవరి 6 ఇన్వెస్టిగేషన్, గ్యాస్ ధరలు, ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ వంటి కీలక రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ సంక్షోభం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో అమెరికా గడ్డపై వరుసగా జరుగుతున్న ఈ దాడుల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఎఫ్‌బీఐ లోతుగా విశ్లేషిస్తోంది. శ్వేతసౌధం వాయువ్య మూలలో ఇంతటి సాహసానికి ఒడిగట్టడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

రక్తసిక్తమవుతున్న అధికార కేంద్రం
వైట్ హౌస్ చుట్టుపక్కల ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లో ఇదే ప్రాంతంలో రహమానుల్లా లకన్‌వాల్ అనే వ్యక్తి జరిపిన మెరుపు దాడిలో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్‌కు చెందిన ఆర్మీ స్పెషలిస్ట్ సారా బెక్స్‌ట్రోమ్ మరణించగా, ఆండ్రూ వోల్ఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే గత నెల 25న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్‌ను హతమార్చేందుకు కాలిఫోర్నియాకు చెందిన కోల్ టోమస్ అలెన్ అనే నిందితుడు విఫలయత్నం చేశాడు. ఆ తర్వాత మే 4 న వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో టెక్సాస్‌కు చెందిన 45 ఏళ్ల మైఖేల్ మార్క్స్ అనే వ్యక్తి సీక్రెట్ సర్వీస్ పై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ఒక యువకుడు గాయపడ్డాడు. తాజాగా శనివారం నాటి ఉదంతంతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే అధ్యక్షుడి నివాస ప్రాంతంలో మూడోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. ఇరాన్ అణు ఒప్పందాల చర్చల నేపథ్యంలోనే ఈ దాడులు ముడిపడి ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *