జర్నలిస్టుల ఇళ్లకు హరీష్ ఎసరు – ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటన

Harishrao Against Future City
  • కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • ల్యాండ్ పూలింగ్ వివాదం
  • ఆందోళనలో జర్నలిస్టుల లోకం
  • నేడు క్యాబినెట్… జూన్ 2న ఉత్కంఠ

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు వదిలిన పొలిటికల్ అస్త్రం తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపింది. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ రాజకీయ చదరంగంలో ఇళ్ల స్థలాలు ఆశించిన జర్నలిస్టులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడిపోయారు.

అమెరికా వేదికగా పొలిటికల్ బాంబ్
తెలంగాణ రాజకీయం ఎల్లలు దాటి అమెరికా వేదికగా సంచలనం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒక్క ప్రకటనతో పొలిటికల్ సర్కిల్స్, పాత్రికేయ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పాలసీలు మార్చడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఫార్మా సిటీ వర్సెస్ ఫ్యూచర్ సిటీ
గత బీఆర్ఎస్ హయాంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యంగా ఫార్మా సిటీని తలపెట్టామని హరీష్ రావు గుర్తు చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ కూడా కేవలం ఫార్మా సిటీకి మాత్రమే అనుమతులు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని మార్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త జిమ్మిక్కులు చేస్తోందని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.

హైకోర్టు అఫిడవిట్ డబుల్ గేమ్
హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీని కొనసాగిస్తామని అఫిడవిట్ సమర్పించిందని హరీష్ రావు గుర్తు చేశారు. కోర్టులోనేమో ఫార్మా సిటీ అంటారు, బయట మాత్రం ఫ్యూచర్ సిటీ పేరుతో కాలక్షేపం చేస్తున్నారంటూ అధికారుల తీరును, ప్రభుత్వ నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. ఇది కేవలం ప్రాజెక్టు మార్పు కాదు… పెద్ద ఎత్తున జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆయన ఆరోపించారు.

వందల ఎకరాల ల్యాండ్ పూలింగ్ దందా
ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో ఏకంగా 75 శాతం భూములను ఇతర వ్యాపారాలకు కేటాయిస్తూ కేవలం 25 శాతం మాత్రమే ఫార్మా రంగానికి పరిమితం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ నిబంధనలను తుంగలో తొక్కి రియల్టర్లకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాత్రం ఇది కేవలం భూముల దందా అని కొట్టిపారేస్తూ తాము రాగానే ఫార్మా సిటీని పునరుద్ధరించి తీరుతామని సవాల్ విసురుతోంది.

జర్నలిస్టుల ఆశలపై చల్లిన నీళ్లు
ఈ పొలిటికల్ ఫైట్‌లో జర్నలిస్టులు, ఉన్నత స్థాయి అధికారులు నలిగిపోతున్నారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల స్థలాల కోసం 500 ఎకరాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు హరీష్ రావు ఏకంగా ప్రాజెక్టే రద్దు చేస్తామనడంతో జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) నాయకులు గత ప్రభుత్వ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అప్పటి నాయకురాలు కవిత, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబును కలిసిన డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ… దీని ఫలితంగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.

జూన్ 2 డెడ్‌లైన్ ఉత్కంఠ
ఇళ్ల స్థలాల సాధన కోసం డెక్కన్, జవహర్‌లాల్ నెహ్రూ, తెలంగాణ, జూబ్లీహిల్స్ లాంటి ఆరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి జాబితాను ప్రభుత్వానికి అందజేశాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్న తరుణంలో హరీష్ రావు ప్రకటన జర్నలిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ అడ్డంకులు కల్పించవద్దని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ప్రధాన కార్యదర్శి అమృత, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, ట్రెజరర్ చిలుకూరి అయ్యప్ప విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సైమా) కూడా హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించింది. ఆ సంఘం నేతలు రవి, సురేష్ బాబు, శ్రీనివాస్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *