వెబ్‌సైట్లు ఇక కనుమరుగు – గూగుల్ సెర్చ్ ఇంజనుకు చరమగీతం!

Google Search
  • ఏఐ పెత్తనం… బలిపీఠంపై ఇంటర్నెట్
  • ముంచుకొస్తున్న సమాచార శోధనా సంక్షోభం
  • ఇంటర్నెట్ రూపురేఖలు మార్చుతున్న గూగుల్
  • లింకుల క్లిక్ నిలిపివేత…నెటిజన్ల ఎంపికకు బ్రేక్
  • వెబ్‌సైట్ల ప్రకటనల ఆదాయానికి అడ్డంకులు
  • గూగుల్ నియంతృత్వ ధోరణితో సర్వనాశనం

సహనం వందే, హైదరాబాద్:

వినియోగదారుడు వెతుక్కుంటూ వెళ్లే ఒక అందమైన ప్రపంచం ఇంటర్నెట్. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన కొత్త మార్పులు ఆ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాయి. సమాచారం కోసం మనం వెబ్‌సైట్లలోకి వెళ్లకుండా కృత్రిమ మేధతో కూడిన సమాచారమే మన ముందుకు వచ్చేలా గూగుల్ చేస్తున్న ప్రయత్నం ఇంటర్నెట్ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈ సాంకేతిక సంక్షోభంపై లోతైన విశ్లేషణ.

గూగుల్ మార్పుల గుత్తాధిపత్యం
ప్రపంచవ్యాప్తంగా సమాచార శోధనకు చిరునామాగా మారిన గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో తీసుకొచ్చిన సరికొత్త మార్పులు ఇంటర్నెట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇంటర్నెట్ అనేది వినియోగదారులు తమకు నచ్చిన సమాచారం కోసం వెతికే స్థలంగా ఉండాలి. కానీ గూగుల్ ఇప్పుడు ఆ ఇంటర్నెట్‌ను యూజర్ల ముందుకు బలవంతంగా నెడుతోంది. ఈ మార్పులు మొత్తం వెబ్ వ్యవస్థను నాశనం చేసేలా ఉన్నాయి. సాంకేతిక విప్లవం పేరుతో గూగుల్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు నెటిజన్ల ఆలోచనా విధానాన్ని మొద్దుబార్చే ప్రమాదం ఉంది.

స్వేచ్ఛా ప్రపంచానికి సంకెళ్లు
గతంలో వినియోగదారులు గూగుల్‌లో ఏదైనా అంశాన్ని సెర్చ్ చేస్తే వివిధ రకాల వెబ్‌సైట్ల లింకులు కనిపించేవి. యూజర్లు తమకు నచ్చిన వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి సమాచారాన్ని సేకరించేవారు. కానీ గూగుల్ కొత్త విధానం ప్రకారం సెర్చ్ చేయగానే ఏఐ సాయంతో తయారు చేసిన ఒక నివేదిక నేరుగా తెరపై ప్రత్యక్షమవుతుంది. దీనివల్ల యూజర్లు ఇతర వెబ్‌సైట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గూగుల్ అడ్డుకుంటోంది. ఇది వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను పూర్తిగా దెబ్బతీస్తోందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

వెబ్‌సైట్ల మనుగడ ప్రశ్నార్థకం
ఇంటర్నెట్ రంగాన్ని నమ్ముకుని వేలాది సంస్ధలు, పత్రికలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు నడుస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చే ట్రాఫిక్ ఆధారంగానే ఈ వెబ్‌సైట్లకు ప్రకటనల ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు గూగుల్ తన సెర్చ్ పేజీలోనే కృత్రిమ మేధతో సమాధానాన్ని చూపించడం వల్ల యూజర్లు ఇతర సైట్లను క్లిక్ చేయడం మానేస్తారు. దీనివల్ల స్వతంత్ర వెబ్‌సైట్ల ట్రాఫిక్ ఘోరంగా పడిపోతుంది. ఆదాయం లేక లక్షలాది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు వీధిన పడే పరిస్థితి వస్తుంది.

కృత్రిమ మేధ సమాచార సంక్షోభం
గూగుల్ నమ్ముకున్న కృత్రిమ మేధ సాంకేతికత పూర్తిగా నమ్మదగినది కాదు. పలు సందర్భాల్లో ఈ ఏఐ టెక్నాలజీ తప్పుడు సమాచారాన్ని, అసంబద్ధమైన విషయాలను క్రోడీకరించి ఇస్తోందనే విమర్శలు ఉన్నాయి. వినియోగదారుడు స్వయంగా శోధించి నిజానిజాలు తెలుసుకునే అవకాశాన్ని గూగుల్ ఇక్కడ నిలిపివేస్తోంది. గూగుల్ ఇచ్చే కృత్రిమ సమాచారమే పరమావధిగా నెటిజన్లు భావించాల్సి రావడం భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది.

ఇంటర్నెట్ సహజత్వం నాశనం
వెబ్‌సైట్ల మధ్య పోటీ ఉన్నప్పుడే నాణ్యమైన సమాచారం బయటకు వస్తుంది. కానీ గూగుల్ అన్ని వెబ్‌సైట్ల సమాచారాన్ని దొంగిలించి ఏఐ ద్వారా సొంతంగా రీరైట్ చేసి ప్రదర్శిస్తోంది. ఇది మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గూగుల్ తన సొంత లాభాల కోసం, ఏఐ రేసులో ముందంజలో ఉండటం కోసం ఇంటర్నెట్ సహజత్వాన్ని, ఉనికిని బలిపీఠం ఎక్కిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

నియంతృత్వ ధోరణి వైపు అడుగులు
ఈ మార్పుల వల్ల గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఒక సమాచార వేదిక నుండి సమాచార నియంతగా మారుతోంది. వినియోగదారులు ఏమి చదవాలో ఏమి చూడాలో గూగుల్ మాత్రమే నిర్ణయించే ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి. ఒక వైపు సాంకేతిక దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతుంటే మరోవైపు ఇంటర్నెట్ ప్రాథమిక సూత్రాలకే గూగుల్ ఎసరు పెడుతోంది. ఇప్పటికైనా గూగుల్ తన సెర్చ్ విధానంపై పునరాలోచించకపోతే ఇంటర్నెట్ ఒక మురికికూపంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *