సౌత్ లో యూత్ సెన్సేషన్ – దక్షిణాది పాలిటిక్స్: కుర్రాళ్ల కేక

South Youth Politics
  • పక్కకు తప్పుకుంటున్న వృద్ధ నేతలు
  • పాత నీరు పోయింది… కొత్త రక్తం వచ్చింది
  • గద్దె పైనే గురి… యువ సింహాల గర్జన
  • విజయ్, పవన్, లోకేష్, రేవంత్, జగన్ హవా

సహనం వందే, హైదరాబాద్:

రాజకీయాలంటే ఒకప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేసే కాలక్షేపం. తెల్ల జుట్టు, ముడతలు పడిన ముఖాలే పవర్ సెంటర్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 50 ఏళ్ల లోపు రాజకీయ కుర్రాళ్లే ఇప్పుడు రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారు. వెండితెర రికార్డులను తిరగరాసిన హీరోల నుంచి విదేశాల్లో చదువుకున్న వారసుల దాకా అంతా పవర్ పాలిటిక్స్‌లోకి దూసుకొచ్చారు.

తమిళనాడులో దళపతి ప్రభంజనం
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. వెండితెర మీద తన నటనతో కోట్లాది మందిని మెప్పించిన దళపతి విజయ్ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కుర్చీని కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. అటు మాజీ సీఎం స్టాలిన్ వారసుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా యువ శక్తిని ప్రదర్శిస్తున్నారు. సీఎం, అపోజిషన్ లీడర్ ఇద్దరూ యువ స్టార్లే కావడంతో అక్కడ రాజకీయం పక్కా కమర్షియల్ సినిమాను తలపిస్తోంది. పాత తరం నేతలకు అక్కడ కాలం చెల్లిపోయిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రలో ముగ్గురు మొనగాళ్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు ముగ్గురు కీలక యువ నేతల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే 5 ఏళ్లు సీఎంగా పనిచేసి తన మార్క్ చూపించిన జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే.. పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ మరోవైపు ఉన్నారు. వీరితోపాటు లోకేష్ తన తండ్రి చంద్రబాబు నీడ నుంచి బయటకు వచ్చి పార్టీని నడిపించే భవిష్యత్తు నాయకుడిగా వేగంగా దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురి దూకుడు చూస్తుంటే సీనియర్ నేతలు కేవలం సలహాదారులుగా మాత్రమే మిగిలిపోయేలా కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా యువతదే పైచేయి అవుతోంది.

తెలంగాణలో రేవంత్ మార్క్ స్పీడ్
తెలంగాణలో కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తన దూకుడైన మాటలతో ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. రేవంత్ వేగం, నిర్ణయాలు తీసుకునే తీరు చూసి పాత తరం కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గ్రౌండ్ లెవల్‌లో ఆయన చేస్తున్న పాలిటిక్స్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రేవంత్ రెడ్డి తన మార్క్ దూకుడును చూపిస్తూ పాత పద్ధతులను తుడిచిపెట్టేస్తున్నారు.

బీఆర్ఎస్ టీమ్ యాక్షన్ ప్లాన్
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుతం మౌనంగా ఉన్నా ఆయన యువ సైన్యం మాత్రం ఫీల్డ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలోనూ… సోషల్ మీడియాలోనూ రేవంత్ రెడ్డిని ఢీకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కేసీఆర్ వ్యూహాలకు ఈ యువ నాయకత్వం పదును పెడుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. పార్టీ భవిష్యత్తు ఈ ఇద్దరి భుజాల మీదనే కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీ పెట్టి తన వంతు పాత్రను పోషిస్తున్నారు.

ముగిసిన హేమాహేమీల శకం
దక్షిణాదిలో రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన హేమాహేమీలు ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ సైలెంట్ కావడం… చంద్రబాబు తన వారసుడికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ మార్పుకు నిదర్శనం. యువ నాయకులు ఇప్పుడు డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటూ ఓటర్లకు చేరువవుతున్నారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి నిర్ణయాధికారం మొత్తం యువ రక్తం చేతుల్లోకి వెళ్లిపోయింది. డిజిటల్ ప్రచారం ద్వారా వీరు అతి తక్కువ కాలంలోనే ప్రభావితం చేయగలుగుతున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో మార్పు సంకేతాలు
తమిళనాడు, ఏపీ, తెలంగాణలో యువ నాయకత్వం ఉరకలెత్తుతుంటే కర్ణాటక, కేరళలో మాత్రం ఇంకా సీనియర్ నేతలే చక్రం తిప్పుతున్నారు. అక్కడ పాత కమ్యూనిస్టు నేతలు… సీనియర్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇంకా రాజ్యమేలుతున్నారు. కానీ పక్క రాష్ట్రాల ప్రభావంతో అక్కడ కూడా కుర్ర నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జనరేషన్ గ్యాప్ క్లియర్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా మార్పు రాక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *