- కుటుంబాల్లో బంగారంపై ఐటీ గురి
- పురుషులకు 100 గ్రాముల నిబంధన
సహనం వందే, హైదరాబాద్:
మీ ఇంట్లో బంగారం ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కన్ను పసిడి నిల్వలపై పడింది. కేవలం కొత్తగా బంగారం కొనడం ఆపడమే కాదు, ఇంట్లో ఉన్న పాత బంగారానికి కూడా పక్కా ఆధారాలు ఉండాలి. ఆదాయపు పన్ను శాఖ దాడుల సమయంలో నిబంధనలకు మించి బంగారం దొరికితే అధికారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించనున్నారు. ఇది ఇప్పుడు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న అసలు వార్త.
నిఘా నీడలో పసిడి
ఇంట్లో ఉన్న బంగారంపై ఆదాయపు పన్ను శాఖ తన నిఘాను తీవ్రం చేసింది. పరిమితికి మించి పసిడి ఉంటే ఐటీ దాడుల సమయంలో కచ్చితంగా చిక్కులు ఎదురవుతాయి. మీ దగ్గర ఎంత బంగారం ఉన్నా దానికి సంబంధించిన సరైన లెక్కలు చూపాలి. ఒకవేళ ఆ బంగారం కొనడానికి కావాల్సిన ఆదాయ వనరులను మీరు నిరూపించలేకపోతే అధికారులు దానిని జప్తు చేస్తారు. అక్రమంగా పసిడిని నిల్వ చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.

మహిళలకు ఉన్న పరిమితులు
బంగారం నిల్వ విషయంలో ఐటి శాఖ కొన్ని స్పష్టమైన హద్దులు గీసింది. పెళ్లైన మహిళలు తమ వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. ఈ పరిమితి లోపు ఉన్న బంగారానికి ఎలాంటి పన్ను పత్రాలు లేదా కొనుగోలు రశీదులు చూపాల్సిన అవసరం లేదు. అధికారుల తనిఖీల్లో ఈ లోపు ఉన్న నగలను వారు స్వాధీనం చేసుకోరు. అయితే అవివాహిత మహిళల విషయానికి వస్తే ఈ పరిమితి 250 గ్రాములుగా నిర్ణయించారు. దీనికి మించి ఒక్క గ్రాము ఉన్నా లెక్క చూపాల్సిందే.
పురుషులపై కఠిన నిబంధన
బంగారం నిల్వ నియమాలు కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తాయి. పురుషుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ చాలా కఠినంగా ఉంది. పురుషులు తమ వద్ద కేవలం 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంది. ఈ 100 గ్రాముల వరకు అధికారులు ఎటువంటి ప్రశ్నలు వేయరు. కానీ ఈ పరిమితి దాటిన ప్రతి గ్రాముకు ఆస్తుల వెల్లడి పత్రాలు కచ్చితంగా ఉండాలి. లేదంటే ఆ బంగారం మొత్తం ప్రభుత్వ పరం అయ్యే ప్రమాదం ఉంది.
వారసత్వ నగలకు మినహాయింపు
చాలామందికి తమ పూర్వీకుల నుంచి బంగారం వారసత్వంగా వస్తుంది. ఇలాంటి పసిడి నగలకు ఐటీ పరిమితులతో సంబంధం ఉండదు. అయితే ఆ బంగారం వారసత్వంగానే వచ్చిందని నిరూపించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కుటుంబ పెద్దలు రాసిన విల్లు లేదా ఇతర చట్టపరమైన పత్రాలు ఇక్కడ చాలా కీలకం. కుటుంబ సంప్రదాయాల ప్రకారం వచ్చే నగలను అధికారులు గౌరవిస్తారు. కానీ సరైన ఆధారాలు లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మోదీ వ్యూహం… దిగుమతులకు చెక్
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. రాబోయే ఏడాది పాటు ఎవరూ బంగారం కొనవద్దని ఆయన కోరారు. మనం ఏటా 800 టన్నులకు పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. ఈ దిగుమతులను నియంత్రిస్తేనే రూపాయి విలువ బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ దిగుమతుల భారం తగ్గించి దేశ సంపదను కాపాడటమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు లక్ష్యం.
మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన
ఈ నిబంధనలు ఇప్పుడు సామాన్య ప్రజల్లో చర్చకు దారి తీశాయి. పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం కొనడం భారతీయుల ఆచారం. ఇప్పుడు ఐటీ దాడుల ముప్పు, కొనుగోళ్లపై నియంత్రణ వల్ల మార్కెట్లు కళ తప్పే అవకాశం ఉంది. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ అవసరమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిబంధనల ప్రకారం పరిమితిలోపు బంగారం ఉంచుకుంటే ఎవరూ భయపడాల్సిన పని లేదు. లెక్కలు పక్కాగా ఉంటేనే పసిడికి భద్రత ఉంటుంది.