తెలంగాణలో గుజరాత్ మోడల్ చిచ్చు – మోడీ, రేవంత్ సంభాషణలతో రాజకీయ వేడి

Mode at Telangna
  • నిధుల కోసం రేవంత్ విన్నపంతో మారిన సీన్
  • కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
  • స్నేహ హస్తమా? రాజకీయ వ్యూహమా?
  • గుజరాత్ నమూనాపై రేవంత్ వ్యాఖ్యల రణం

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణలో ఇప్పుడు గుజరాత్ మోడల్ చిచ్చు రేపుతుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ… కేవలం నిధుల విజ్ఞప్తిగా కాకుండా ఒక లోతైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రం చాటున దాగి ఉన్న రాజకీయ అంతరార్థాలను విశ్లేషకులు ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

అభివృద్ధి బెంచ్ మార్క్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికరమైన పోలికను ముందుకు తెచ్చారు. మోడీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిర్మించిన ‘గుజరాత్ మోడల్’ను ప్రస్తావిస్తూ… తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు కూడా అలాంటి అభివృద్ధిని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్లలో గుజరాత్ సాధించిన ప్రగతిని ఒక బెంచ్ మార్క్‌గా రేవంత్ అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేంద్రం నుంచి నిధులు రాబట్టే వ్యూహమా లేక భావజాలపరమైన మార్పుకు సంకేతమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Modi Visit to Telangana

కేంద్రం షరతు…
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోడీ స్పందిస్తూ… నిధుల కేటాయింపులో గణాంకాలను తెరపైకి తెచ్చారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గుజరాత్‌కు ఇచ్చిన నిధులను తెలంగాణకు ఇస్తే, అది ఇప్పుడు వస్తున్న దానికంటే సగం మాత్రమే అవుతుందని మోదీ విశ్లేషించారు. “మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే నాతో కలవండి” అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు సమాఖ్య వ్యవస్థలో కేంద్రం పాత్రపై చర్చను లేవనెత్తాయి. అభివృద్ధి పథంలో తనతో కలిసి నడవాలని ప్రధాని కోరడం వెనుక రాజకీయ విలీనం ఉందనే అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రతిపక్షాల నిరసన
మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధాని ఒక్కరేనని, పన్నుల వాటాను తిరిగి ఇవ్వడం కేంద్రం బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. విపక్ష నాయకులు బలంగా ఉండకూడదనే కుట్రతోనే మోడీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారిక వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మల్లాది పవన్ వ్యాఖ్యానించారు.

సిద్ధాంతాల సంఘర్షణ
బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఈ పరిణామాలను కాంగ్రెస్ సిద్ధాంతాల పతనంగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ కార్పొరేట్ శక్తుల దోపిడీగా అభివర్ణించే ‘గుజరాత్ మోడల్’ను రేవంత్ రెడ్డి ఎలా సమర్థిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ఒక ప్రైవేటు ఫ్రాంచైజీలా నడుపుతూ మోదీ పట్ల భక్తిని చాటుకుంటున్నారని రేవంత్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

అధికార పక్షం సమర్థన
బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి మాత్రం ప్రధాని వ్యాఖ్యలను సహకార సమాఖ్య స్ఫూర్తిగా అభివర్ణించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబించారని… కానీ ఇప్పుడు కలిసి పనిచేయాలనే సంకేతాన్ని మోడీ ఇచ్చారని పేర్కొన్నారు. వికసిత తెలంగాణ లేనిదే వికసిత భారత్ సాధ్యం కాదని… అందుకే అభివృద్ధి పథంలో చేరమని ప్రధాని కోరారని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం పాలన పరమైన అంశమే తప్ప ఇందులో రాజకీయం లేదని బీజేపీ వాదిస్తోంది.

విశ్లేషకుల చూపు
రాజకీయ విశ్లేషకులు దుర్గం రవీందర్, పెంటపాటి పుల్లారావు ఈ పరిణామాలను భిన్న కోణాల్లో చూస్తున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే గెలుపే ప్రామాణికంగా మారుతోందని రవీందర్ అభిప్రాయపడ్డారు. అయితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మధ్య సానుకూల వాతావరణంలో చర్చ జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని పుల్లారావు విశ్లేషించారు. ఈ పరిణామాలు భవిష్యత్ లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *