ఐఫోన్ స్థానంలో ఏఐ ఫోన్ – చాట్ జీపీటీ ఆధ్వర్యంలో ఏజెంటిక్ ఏఐ ఫోన్

Agentic AI Phone
  • స్మార్ట్‌ఫోన్ల రూపురేఖలు మారుతున్నాయి
  • ఐఫోన్ కంటే వేల రెట్ల సామర్ధ్యంతో కొత్త ఫోన్
  • యాప్‌లు ఔట్… టెక్ ప్రపంచంలో కొత్త యుద్ధం

సహనం వందే, హైదరాబాద్:

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి అసలైన ముగింపు పలకబోయే రోజులు దగ్గరపడ్డాయి. మనం ఫోన్ వాడే విధానాన్ని ఓపెన్ ఏఐ సంస్థ సమూలంగా మార్చేస్తోంది. కేవలం స్క్రీన్ మీద వేళ్లతో నొక్కడం కాకుండా మన ఆలోచనలను పసిగట్టి పనులు చేసే ఏజెంటిక్ ఏఐ ఫోన్ వస్తోంది. ఇది ప్రస్తుతం మన దగ్గరున్న ఐఫోన్ కంటే వేల రెట్లు తెలివైనది. ఇది స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో రెండో విప్లవంగా నిలిచిపోనుంది.

యాప్‌లు మాయం…
ప్రస్తుతం మనం ఒక పని చేయాలంటే దానికి సంబంధించిన యాప్‌లోకి వెళ్లాలి. ఉదాహరణకు ఆహారం ఆర్డర్ చేయాలంటే జొమాటో లేదా స్విగ్గీ యాప్ తెరవాలి. కానీ ఏజెంటిక్ ఏఐ ఫోన్‌లో ఈ తలనొప్పి ఉండదు. నాకు ఆకలిగా ఉంది, మంచి బిర్యానీ ఆర్డర్ చేయి అని చెబితే చాలు. అది మీ పాత ఆర్డర్లను బట్టి రుచిని గుర్తించి ధరలను బేరీజు వేసి ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఇందులో మీరు యాప్ వెతకాల్సిన పని లేదు. యాపిల్ సృష్టించిన యాప్ స్టోర్ సామ్రాజ్యానికి ఇది పెద్ద సవాల్ కానుంది.

సామ్ ఆల్ట్‌మాన్ రహస్య వ్యూహం
ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్‌మాన్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యాపిల్ కంపెనీలో ఐఫోన్, ఐప్యాడ్ వంటి అద్భుతాలను డిజైన్ చేసిన జోనీ ఐవ్ ఇప్పుడు ఆల్ట్‌మాన్‌తో చేతులు కలిపారు. వీరు రూపొందిస్తున్న ఫోన్ హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్ మేధస్సుతోనే నడుస్తుంది. సాధారణ ఫోన్లు కేవలం ఆజ్ఞలను పాటిస్తాయి. కానీ ఈ ఏజెంటిక్ ఫోన్ మీ తరఫున నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక విమానం టికెట్ బుక్ చేయమంటే మీ క్యాలెండర్ చెక్ చేసి ఖాళీ సమయాన్ని బట్టి తక్కువ ధరలో టికెట్ కొనేస్తుంది.

వ్యక్తిగత సహాయకుడిగా ఫోన్…
ఈ కొత్త ఫోన్ ఒక యంత్రంలా కాకుండా ఒక వ్యక్తిగత కార్యదర్శిలా పనిచేస్తుంది. ఉదాహరణకు రేపు ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉందని చెబితే ట్రాఫిక్ పరిస్థితిని బట్టి మిమ్మల్ని ఎప్పుడు నిద్రలేపాలో అది నిర్ణయిస్తుంది. ఐఫోన్‌లో మనం సిరిని వాడతాం కానీ దానికి పరిమితులు ఉన్నాయి. ఏజెంటిక్ ఏఐ ఫోన్ మాత్రం సంక్లిష్టమైన పనులను కూడా సులభం చేస్తుంది. మీ ఇమెయిల్స్ చదివి ముఖ్యమైన వాటికి రిప్లై ఇవ్వడం లేదా మీ ఖర్చుల వివరాలను క్రమబద్ధీకరించడం వంటివి ఇది చిటికెలో చేసేస్తుంది.

ఐఫోన్ ఆధిపత్యానికి ముగింపు
2007లో ఐఫోన్ వచ్చినప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఫోన్ కూడా అలాంటి మార్పునే తెస్తోంది. లెస్లీ డీమాంటే విశ్లేషణ ప్రకారం… ఇకపై ఫోన్ హార్డ్‌వేర్ ఫీచర్ల కంటే అందులోని ఏఐ ఏజెంట్ల పనితీరుకే విలువ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ తయారీలో యాపిల్, గూగుల్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని ఇది దెబ్బతీసే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న టచ్ స్క్రీన్ టెక్నాలజీ నుంచి వాయిస్, ఏఐ ఆధారిత టెక్నాలజీకి ప్రపంచం మారుతోంది.

భారీ పెట్టుబడులు… మార్కెట్
ఈ ఏజెంటిక్ ఏఐ ఫోన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు… స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ భవిష్యత్తు. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి ఇంజనీర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న ఐఫోన్ ధరల కంటే దీని ధరలు వినియోగదారులకు ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. టెక్ ప్రియులు ఇప్పటికే ఐఫోన్ 16 వంటి మోడళ్ల కంటే ఈ ఏఐ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది నిజంగానే స్మార్ట్‌ఫోన్ల అంతానికి ఆరంభం కానుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *