ముఖ్యమంత్రి కాకుంటే పార్టీ ముక్కలే – కల్వకుంట్ల కుటుంబంలో అందరూ సీఎంలే

Kalvakuntla Family Politics
  • ముఖ్యమంత్రి పీఠం కోసం ‘ముక్క’చెక్కలు
  • సొంత కుంపటి పెట్టిన ఆడబిడ్డ కవిత
  • బావా బావమరుదుల మధ్య ప్రచ్చన్న యుద్ధం
  • కనుమరుగయ్యే దశలో కల్వకుంట్ల సామ్రాజ్యం

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కుటుంబం ఒకప్పుడు తిరుగులేని శక్తి. కానీ నేడు అదే కుటుంబం అధికార దాహంతో ముక్కలవుతోంది. ఒకే గూటి పక్షులు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న ఈ అంతర్యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితి వరకు సాగిన ప్రయాణం ఇప్పుడు విచ్ఛిన్నం దిశగా సాగుతోంది.

తారాస్థాయికి వారసత్వ పోరు…
భారతదేశ రాజకీయ చరిత్రలో ఒకే ప్రాంతీయ పార్టీ నుండి నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండటం ఇదే తొలిసారి. కేసీఆర్ పదేళ్లు పాలించిన తర్వాత ఆ పీఠం తనదేనని కేటీఆర్ ధీమాగా ఉన్నారు. కానీ మేనల్లుడు హరీష్ రావు వ్యూహాలు కేటీఆర్ ఆశలకు గండి కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. ప్రజాక్షేత్రంలో పట్టున్న హరీష్ రావును కాదని కేటీఆర్ పగ్గాలు చేపడితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించలేమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Kalvakuntla Kavith New party

సొంత తండ్రిపైనే ఆడబిడ్డ సమరం
కేసీఆర్ కూతురు కవిత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యత లేదని గమనించిన ఆమె ఏకంగా సొంత పార్టీని స్థాపించారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ముద్ర వేసిన ఆమె ఇప్పుడు రాజకీయంగా తండ్రిని ఎదిరిస్తున్నారు. సొంత కూతురే తండ్రిని దారుణంగా విమర్శించడం దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. తనకు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కని పరిస్థితి ఉందని గ్రహించే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముగ్గురు ఉద్దండుల మధ్య మూడు ముక్కలాట
కేసీఆర్ కుటుంబంలో అందరూ చదువుకున్న వారే కాకుండా అనర్గళమైన వక్తలు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వీరికి మంచి పట్టుంది. ఈ ప్రతిభే ఇప్పుడు పార్టీకి శాపంగా మారింది. కేటీఆర్, హరీష్ రావు గతంలో మంత్రులుగా చక్రం తిప్పారు. కవిత ఎంపీగా పనిచేశారు. పదేళ్ల అధికార అనుభవం తర్వాత అందరి కళ్ళు ముఖ్యమంత్రి కుర్చీపైనే ఉన్నాయి. ఈ కుర్చీ లాటలో పార్టీ ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

చెదిరిన కల్వకుంట్ల కలలు
పాత టీఆర్ఎస్ పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్న కవిత ఇప్పుడు తండ్రికి, అన్నకు సవాల్ విసురుతున్నారు. ఒకప్పుడు ఐక్యంగా ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు పరస్పర విమర్శలతో వీధిన పడింది. సంతోష్ కుమార్ కూడా తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నా పీఠం కోసం జరుగుతున్న యుద్ధం మాత్రం బహిరంగంగానే సాగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తేల్చడం కల్వకుంట్ల బాస్‌కు కూడా అసాధ్యంగా మారుతోంది.

పాత పార్టీల బాటలో కవిత ప్రస్థానం
గతంలో ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు భారీ అంచనాలతో వచ్చి కనుమరుగయ్యాయి. షర్మిల, విజయశాంతి పార్టీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు కవిత పార్టీ ఎంతవరకు నిలదొక్కుకుంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఆమె ఒంటరి పోరాటంలో విఫలమైతే మళ్లీ బీఆర్ఎస్‌లో విలీనం చేసే అవకాశం లేకపోలేదని ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. అయితే కేటీఆర్, హరీష్ రావు మధ్య అగాధం పెరిగితే ఆమె యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది.

భవిష్యత్తులో మిగిలేది ఎవరు?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా పరిస్థితి మారింది. వీరిద్దరి మధ్య కవిత తన రాజకీయ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీలో నలుగురు నేతలు సీఎం కావాలనుకోవడం వినాశనానికి సంకేతం. ఈ కుటుంబ పోరులో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో కల్వకుంట్ల సామ్రాజ్యం నిలబడుతుందో లేక కూలిపోతుందో కాలమే నిర్ణయించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *