- గులాబీ గూటిలో సెగ… కవిత కొత్త వేదిక
- కన్న తండ్రి పైనే కూతురు తిరుగుబాటు
- ఎజెండా లేని ఆరాటం… వారసత్వ యుద్ధం
- రేపు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. సొంత తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాలపై కూతురు కవిత ధిక్కార స్వరం వినిపించడం సంచలనంగా మారింది. ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు. శనివారం తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతుంది. ఈ పార్టీ ఆశయం కంటే ఆవేదనతోనే ఈ అడుగు వేస్తుందన్న చర్చ నడుస్తోంది. కుటుంబ కలహాలు, కేసుల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ ప్రయాణం తెలంగాణ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
పార్టీ అంటే పాన్ షాప్ డబ్బా కాదు…
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్‌కు ఇప్పుడు ఇంట్లోనే సవాల్ ఎదురవుతోంది. కూతురు పార్టీ పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ పెట్టడమంటే పాన్ షాప్ డబ్బా పెట్టడం కాదని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తన కూతురు నిర్ణయంపై ఆయనలో ఉన్న అసహనం ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కేడర్‌లో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తండ్రి నీడలో ఎదిగిన నాయకురాలు ఇప్పుడు ఆయనకే ఏకుమేకై కూర్చుంది. ఒక రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తికి తన వారసురాలే ఎదురు తిరగడం పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.

జాగృతి నుంచి జనంలోకి…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా బతుకమ్మ పండుగను 10 దేశాలకు చేర్చి కవిత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో ఆమె పోషించిన పాత్ర సామాన్యులను ఆకట్టుకుంది. అయితే సామాజిక వేదిక వేరు రాజకీయ పార్టీ వేరు. క్షేత్రస్థాయిలో ఓట్లు రాబట్టడం అనేది కత్తిమీద సాము వంటిది. కేసీఆర్ వ్యూహాలకు వ్యతిరేకంగా ఆమె అడుగులు వేయడం బీఆర్ఎస్ కేడర్‌లో తీవ్ర ఆందోళనను పెంచుతోంది. తండ్రి వేసిన బాటను కాదని కొత్త దారి వెతుక్కోవడం కేవలం రాజకీయ నిర్ణయం కాదు. అది కుటుంబంలోని లోతైన చీలికకు సంకేతం.
ఎజెండా లేని పోరాటం
చరిత్రను గమనిస్తే బలమైన ఆకాంక్ష ఉన్న పార్టీలే నిలబడ్డాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లోనే అధికారం చేపట్టారు. కేసీఆర్ 2001లో ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో బయటకు వచ్చి 13 ఏళ్ల పోరాటం తర్వాత 2014లో విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ కూడా రాజన్న రాజ్యం అంటూ జనంలోకి వెళ్లి సక్సెస్ అయ్యారు. కానీ కవిత పెట్టబోయే పార్టీకి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ఎజెండా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం కేసుల వల్ల కలిగిన నష్టం లేదా కుటుంబ గొడవలే ఈ పార్టీకి పునాదిగా కనిపిస్తున్నాయి.
మట్టికొట్టుకుపోయిన చరిత్ర
భారతదేశంలో పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదు, ప్రస్తుతం దేశంలో 2800 పైగా పార్టీలు ఉన్నాయి. సిద్ధాంతం లేకుండా కేవలం వ్యక్తిగత కోపంతో పుట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రజల మద్దతు లేని నాయకులు చివరకు దుకాణం సర్దేసిన దాఖలాలు మన కళ్లముందే ఉన్నాయి. ప్రజల కష్టాల కంటే స్వయం ప్రయోజనాల కోసం వచ్చే నాయకులను జనం ఆదరించరు. కవిత పార్టీ కూడా కేవలం కేసుల నుంచి ఉపశమనం కోసమే అయితే అది రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. నినాదం లేని ప్రయాణం గమ్యం చేరడం అసాధ్యం.
జాతీయ స్థాయి ఆకర్షణ
తండ్రికి కూతురే ప్రత్యర్థిగా మారడం జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా ఈ తిరుగుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. సొంత వారసులే పార్టీని చీల్చడం కొత్తేమీ కాకపోయినా తెలంగాణ లాంటి ప్రాంతీయ సెంటిమెంట్ ఉన్న చోట ఇది సంచలనం. దీనివల్ల సామాన్య ప్రజలకు రూపాయి ప్రయోజనం కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. సిద్ధాంతాల మీద కాకుండా వ్యక్తిగత అసంతృప్తితో వచ్చే నాయకుల వెనుక జనం నడవరు.
విశ్లేషకుల హెచ్చరిక
రాజకీయ విశ్లేషకులు కవిత నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఏ నినాదం లేకుండా కోట్లాది మంది ప్రజలు ఆమె వెనుక ఎలా నడుస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయాల్లో రాణించాలంటే బలమైన సిద్ధాంతం ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ వల్ల ఆమెకు రాజకీయంగా కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా నిలబడాలనే తాపత్రయం చివరకు ఎక్కడ ముగుస్తుందో కాలమే నిర్ణయించాలి. కేసీఆర్ కరకుదనం ముందు కవిత కసి నిలబడుతుందో లేదో చూడాలి.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్