గొంతులో మధురం… గుండెలో మోసం – పాటల మంగ్లీ… మోసాల అగ్లీ

Mangli Scam
  • మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల టోకరా
  • సెలబ్రిటీ హోదా అడ్డుపెట్టుకొని దోపిడీ గాధ
  • 100 మందిని మోసం చేసినట్లు ఫిర్యాదు
  • దర్శకుడు వేణు ఉడుగుల ప్రమేయం
  • పోలీస్ కేసు… మంగ్లీ ఎదురు ఫిర్యాదు

సహనం వందే, హైదరాబాద్:

జానపద గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాయని మంగ్లీ చుట్టూ ఇప్పుడు చట్టం ఉచ్చు బిగుస్తోంది. సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని మైక్రో ఫైనాన్స్ ముసుగులో భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. లాభాల ఆశ చూపి మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పెను దుమారం రేపుతోంది.

రూ.10 కోట్ల మాయాజాలం
గాయని మంగ్లీ తన సోదరుడు శివతో కలిసి పక్కా పథకం ప్రకారం ఈ మోసానికి తెరలేపారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ కాలంలోనే ఊహించని లాభాలు వస్తాయని అమాయకులను నమ్మించారు. ఈ మాటలు నమ్మిన దాదాపు 100 మంది బాధితులు సుమారు రూ.10 కోట్ల వరకు వారి చేతుల్లో పెట్టారు. నెలలు గడిచినా లాభాలు రాకపోగా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు రోడ్డెక్కారు.

Mangli scam

దర్శకుడు వేణు ఉడుగుల పాత్ర
ఈ భారీ స్కామ్‌లో విరాట పర్వం సినిమా దర్శకుడు వేణు ఉడుగుల పేరు బయటకు రావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కేవలం మంగ్లీ కుటుంబ సభ్యులే కాకుండా ఒక వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలో వేణు ఉడుగుల కీలక భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కూడా బాధితులను నమ్మించడంలో, బెదిరింపుల్లో పాలుపంచుకున్నట్లు సమాచారం.

న్యాయవాదికి ప్రాణహాని హెచ్చరికలు
బాధితుల పక్షాన నిలబడిన న్యాయవాది సుబ్బారావును ఈ ముఠా తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసింది. చెల్లించాల్సిన డబ్బుల గురించి నిలదీసినందుకు మంగ్లీ, శివ, వేణు ఉడుగుల ఫోన్‌లలో బెదిరింపులకు దిగారు. యాక్సిడెంట్ చేయించి చంపేస్తామంటూ హెచ్చరించినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ప్రాణాలు తీస్తామని బెదిరించడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు…
లాయర్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. మంగ్లీ, శివ, వేణు ఉడుగులపై బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు. చీటింగ్, బెదిరింపుల ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే వీరిపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మంగ్లీ ఎదురు దాడి
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండిస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఎదురు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రూ.150 కోట్లు మోసం చేశానంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. తనకు సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపారు.

సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు
వరుస పాటలతో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మంగ్లీపై ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎంతమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయోనని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం ఈ ఆర్థిక లావాదేవీల మూలాలను వెతుకుతున్నారు. మధ్యతరగతి బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *