పెదవులపై ట్రంప్ పగ – ప్రపంచ సుందరీమణుల ఆర్తనాదం

War effects cosmetics
  • బ్యూటీ రంగంపై బాంబు దాడుల ప్రభావం
  • హోర్ముజ్ దిగ్బంధంతో సరఫరా సంక్షోభం
  • యుద్ధంతో లిప్‌స్టిక్, మేకప్ కిట్టులకు కటకట

సహనం వందే, ఇటలీ:

ఓ సుందరీ! నీ అధరాలపై మెరిసే ఆ ఎరుపు రంగు వెనుక ఒక దేశపు రక్తపాతం దాగి ఉందంటే నువ్వు నమ్ముతావా? అద్దం ముందు నీవు అలంకరించుకునే వేళ.. ఎక్కడో సుదూర తీరాల్లో యుద్ధ మేఘాలు నీ సౌందర్య సామ్రాజ్యాన్ని ముట్టడిస్తున్నాయి. గల్ఫ్ జలాల్లో రగులుతున్న మంటలు కేవలం ప్రాణాలను తీయడమే కాదు… ప్రపంచ అందాన్ని కూడా ఖరీదైనదిగా మారుస్తున్నాయి. ఇది కేవలం ఒక వార్త కాదు.. యుద్ధం అనే రాక్షసుడు మానవ సౌందర్యంపై చేస్తున్న క్రూరమైన దాడి.

లిప్‌స్టిక్‌కు యుద్ధ సెగ
లిప్‌స్టిక్ ట్యూబులు, ప్లాస్టిక్ జార్ల తయారీ ఖర్చులు ఇరాన్ యుద్ధం కారణంగా ఒక్కసారిగా పెరిగాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ప్యాకేజింగ్‌కు వాడే ప్లాస్టిక్ రెసిన్ కొరత ఏర్పడింది. లోరియల్ లాంటి దిగ్గజ సంస్థలకు కంటైనర్లు సరఫరా చేసే యాన్వు సంస్థ ఇప్పుడు ముడి పదార్థాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. హోర్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల సరకు రవాణా నిలిచిపోయి పరిశ్రమ మొత్తం కుదేలవుతోంది.

War effects on Beauty Products like Lipstick and all..

కోట్లలో అదనపు భారం
ఇటాలియన్ బ్యూటీ గ్రూప్ కికో సీఈఓ సిమోన్ డొమినిసి పెరిగిన ఖర్చుల మీద ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం లాజిస్టిక్స్ మార్పుల వల్లే ఏడాదికి సుమారు 15 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. కికో సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా స్టోర్లు ఉన్నాయి. అక్కడ 450 రూపాయల నుంచి ప్రారంభమయ్యే సౌందర్య ఉత్పత్తుల ధరలు ఇప్పుడు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

బోలోగ్నాలో ఆందోళనలు
ఇటలీలోని బోలోగ్నా నగరంలో జరిగిన కాస్మోప్రోఫ్ ట్రేడ్ ఫెయిర్‌లో యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపించింది. 68 దేశాల నుంచి 3100 ఎగ్జిబిటర్లు, 150 దేశాల నుంచి 2.55 లక్షల మంది సందర్శకులు ఈ మేళాకు వచ్చారు. యుద్ధం వల్ల సరఫరా లింకు తెగిపోవడంపై ఇక్కడ చర్చ జరిగింది. ఐదు వారాలుగా సాగుతున్న హోర్ముజ్ జలసంధి దిగ్బంధం బ్యూటీ రంగానికి శాపంగా మారింది.

నత్తనడకన రవాణా
అంకోరోట్టి గ్రూప్ సీఈఓ రాబర్టో బొట్టినో సరకు రవాణాలో జరుగుతున్న జాప్యాన్ని వివరించారు. గతంలో 8 వారాల్లో వచ్చే సరకు ఇప్పుడు 12 నుంచి 14 వారాలు పడుతోందని చెప్పారు. రవాణా మార్గాలు మారడం వల్ల రేవుల్లో రద్దీ పెరిగిపోయింది. ఈ సంస్థ ఏటా 1980 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. రవాణా ఆలస్యం వల్ల ఖర్చులు పెరిగి వినియోగదారుల మీద భారం తప్పదని ఆయన హెచ్చరించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు
యుద్ధం వల్ల సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో కంపెనీలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. ఫ్రామేసి సంస్థ ఛైర్మన్ ఫాబియో ఫ్రాంచినా తమ డిస్ట్రిబ్యూటర్లు కొత్త దారులు వెతుకుతున్నట్లు చెప్పారు. జెడ్డా వరకు షిప్పింగ్ చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సరకును తరలిస్తున్నారు. మరికొందరు విమానాల ద్వారా రవాణా చేస్తూ ఖర్చును మరింత పెంచుకుంటున్నారు. ఏసియా మార్కెట్లకు రైళ్ల ద్వారా కూడా సరకు పంపిస్తున్నారు.

ఇటలీ ఎగుమతులకు దెబ్బ
ప్రపంచ సౌందర్య సాధనాల ఎగుమతుల్లో ఇటలీ 5వ స్థానంలో ఉంది. 2025లో ఇటలీ 1.62 లక్షల కోట్ల విలువైన సౌందర్య ఉత్పత్తులను తయారు చేసింది. ఇందులో సుమారు 75 వేల కోట్ల విలువైన ఎగుమతులు ఉన్నాయి. హెయిర్ డైలు, ఐ మేకప్ సామాగ్రికి ఇటలీ పెట్టింది పేరు. ఇరాన్ సంక్షోభం ఇలాగే కొనసాగితే సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *